మా బాబు వయసు అయిదు సంవత్సరాలు. నాలుగు రోజులపాటు తీవ్రమైన జ్వరంతో బాధపడ్డాడు. జ్వరం వందకు పైగానే ఉంది. కళ్లుకూడా ఎర్రబడ్డాయి. బాగా నీరసించాడు. ఎంతకూ జ్వరం తగ్గట్లేదని పీడియాట్రిషన్ దగ్గరికి తీసుకుపోయాం. కొన్ని పరీక్షలు చేశారు. అడినోవైరల్ ఇన్ఫెక్షన్ ఉన్నదని చెప్పారు. ఇచ్చిన మందులతో అన్ని సమస్యలూ తగ్గాయి. ఈ అడినోవైరల్ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది? దీనివల్ల తర్వాత ఏమైనా ఇబ్బందులు ఉంటాయా?
ఈ జ్వరం అడినో వైరస్ వల్ల వస్తుంది. అడినో వైరల్ ఇన్ఫెక్షన్ పిల్లలకు సాధారణంగా వస్తూనే ఉంటుంది. కొన్ని నెలలుగా ఇది పిల్లలకు ఎక్కువగా సోకుతోంది. పిల్లల కళ్లు ఎర్రగా మారడం, అధిక తీవ్రతతో జ్వరం, గొంతు నొప్పి, జలుబు, దగ్గు లక్షణాలు ఉంటాయి. కొద్దిమంది పిల్లలు బాగా బలహీన పడిపోయి, ఏమీ తినలేని పరిస్థితిలో ఉంటారు. ఇలాంటి వాళ్లకు హాస్పిటల్లో చికిత్స చేయించాల్సిన అవసరం వస్తుంది. జ్వరానికి మాత్రలతోపాటు ద్రవాహారం ఇస్తూ ఇతర సమస్యలకు లక్షణాలను బట్టి చికిత్స చేస్తే త్వరగానే కోలుకుంటారు.
అతి కొద్దిమంది పిల్లల్లో ఈ ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉంటుంది. ఊపిరితిత్తుల్లో నిమోనియా వంటి సమస్యను కలిగిస్తుంది. ఎక్కువ తీవ్రతతో (వంద డిగ్రీల కంటే ఎక్కువ) జ్వరం ఉంటే పిల్లల డాక్టర్‌కు చూపించాలి. ఈ చికిత్సలో అరుదుగా యాంటి వైరల్ ఇంజెక్షన్లు ఇస్తారు. ఇది ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. శ్వాస బాగా వదిలినప్పుడు బయటికి వచ్చే సూక్ష్మ బిందువులు, తుమ్మినప్పుడు బయటికి వచ్చే తుంపర్ల ద్వారా ఇది గాలిలో వ్యాపిస్తూ ఇతరులకు సోకుతుంది. అడినో వైరల్ ఇన్ఫెక్షన్ సాధారణ సమస్య. కంగారు పడాల్సిన అవసరం లేదు. దీనివల్ల భవిష్యత్‌లో ఏ సమస్యా ఉండదు.
– డాక్టర్ విజయానంద్
నియోనేటాలజిస్ట్ అండ్ పీడియాట్రీషియన్
రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్