అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చెప్పిందేమిటి? అధికారంలోకి వచ్చాక చేస్తున్నదేమిటి? తెలంగాణలో రెండున్నరేండ్లుగా వరుసగా భూభాగోతాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ అక్రమాల్లో ప్రభుత్వ పెద్దల ప్రమేయాలు, స్వార్థపూరిత ప్రయోజనాలు మితిమీరి పోతున్నాయి. నియంత్రించవలసిన ఉన్నతాధికార యంత్రాంగం పెద్దల ఒత్తిడిలకు లొంగిపోతున్నది. కార్పొరేట్ కంపెనీలు, బడా పారిశ్రామికవేత్తలు, అధికార పార్టీకి చెందిన రాజకీయ నాయకులకు భూములను అప్పనంగా అప్పగించడానికి ఏకంగా ప్రభుత్వమే రియల్టర్ అవతారం ఎత్తింది. వేలం లీజు బదిలీ రూపంలో ఇప్పటికే సుమారు 20వేల ఎకరాలను ధారాదత్తం చేసింది. మా భూములు మాకేనని మర్లవడుతున్న బడుగు జీవులపై, వారికి మద్దతుగా నిలిచిన వారిపై వేధింపులకు పాల్పడుతున్నది. బెదిరింపులు, కేసులు, నిర్బంధాలను ప్రయోగించి గొంతు నొక్కేందుకు యత్నిస్తున్నది. తాజాగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా రావల్కోల్ గ్రామ పరిధిలో 275 ఎకరాల భూదందా వెలుగులోకి వచ్చింది. కంటోన్మెంట్ పరిధిలోని తిరుమలగిరి తోకట్ట సర్వే నంబర్ 157/1లోని అంత్యంత విలువైన 8 ఎకరాలపై కబ్జా కోరుల కబళింపు బయట పడింది.
ఆ మధ్య ఆదిలాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రసంగిస్తూ ప్రభుత్వం ఎవరిపైనా నిర్బంధాలు విధించడం లేదని చెప్పుకొచ్చారు. మరుసటి రోజే మాజీమంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డితోపాటు పలువురు నేతలను గృహ నిర్బంధంలో ఉంచారు. ఇంతకీ వారు సాధారణ జనజీవనానికి భంగం కలిగించే కార్యక్రమాలేమైనా తలపెట్టారా అంటే అదీ లేదు. వికారాబాద్ జిల్లా పరిగి ప్రాంతం రాపోల్, కాళ్లపూర్ గ్రామాల పరిధిలో ఇండస్ట్రియల్ పార్క్ కోసం ప్రభుత్వం చేపట్టిన సుమారు 1,200 ఎకరాల భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమించారు. సమీపంలోని దోమ మండలంలో మరో 830 ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో బాధితులను పరామర్శించడానికి బయలుదేరిన వారిని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు.
శంషాబాద్ మండలం పెదషాపూర్కు చెందిన రూ.1,000 కోట్ల విలువైన 180 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేసే కుట్రను బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు ఇటీవల బయట పెట్టడంతో సమాజం నివ్వెరపోయింది. హైదరాబాద్ నడిమధ్యన ఉన్న విలువైన భూములను ప్రభుత్వం పప్పు బెల్లాలు అమ్మినంత సులువుగా వేలం వేస్తున్నది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో కమాండ్ కంట్రోల్ ఎదురుగా ఏసీబీ ఆఫీస్ సమీపంలోని రూ.1,000 కోట్ల విలువైన 8.24 ఎకరాల భూమిని అమ్మకానికి పెట్టింది. వాస్తవానికి అది థీమ్ పార్క్‌కు ఉద్దేశించిన భూమి. ఫార్మా సిటీ కోసం తమ నుంచి స్వాధీనం చేసుకొన్న 2,250ఎకరాల భూమిని తమకు తిరిగి ఇచ్చేయాలని రైతులు రెండు నెలలుగా దీక్షలు చేస్తున్నారు. పక్క రాష్ట్రం పెద్దలు కొందరు గండిపేటలో అక్రమంగా కొన్న భూములపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు శూన్యం. నాదర్గుల్లో భూదందాలకు తెగపడ్డ కాంగ్రెస్ నేతల ఆగడాలు ఇటీవలే వెలుగులోకి వచ్చాయి.
ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని లగచర్ల సహా పోలేపల్లి హకీంపేట పరిసరాల్లోని 1,300 ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. కేసులు, అరెస్టులు, జైళ్లను లెక్కచేయకుండా లగచర్ల రైతులు చరిత్రాత్మక పోరాటం చేసి, విజయం సాధించారు.
లగచర్ల అనుభవంతో ప్రభుత్వం కండ్లు తెరువాల్సింది పోయి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం భూములపై పడింది. యుద్ధ దృశ్యాలను తలపించే విధంగా బుల్డోజర్లను, ప్రొక్లయినర్లతో రాత్రికి రాత్రి 400 ఎకరాల భూమి చదును చేయడానికి తరలించింది. సుమారు 120 ఎకరాల్లో పెద్ద ఎత్తున పర్యావరణ, జీవావరణ హననానికి పాల్పడింది. ఉద్యమించిన విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జీకి పాల్పడి, వారిని అరెస్ట్ చేశారు.
ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. అప్పటికే ధ్వంసమైన ప్రాంతాన్ని గుర్తించిన న్యాయస్థానం అంతటితో ఆగకపోతే జైలు పాలుకాక తప్పదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని హెచ్చరించింది. ఆ భూముల దందా అక్కడితో ఆగలేదు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ పేరున మరో రూపంలో జడలు విప్పింది. ఫార్మాసిటీ కోసం ఉద్దేశించిన భూములను దారి మళ్లించి ఫ్యూచర్‌సిటీ పేరుతో రైతులను నిండా ముంచిది. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ర్మేషన్ పాలసీ పేరుతో ఔటర్ రింగ్ రోడ్డు పరిధి లోపల ఉన్న 22 పారిశ్రామిక వాడల్లోని పదివేల ఎకరాల భూమిని నివాస, వాణిజ్య, సంస్థాగత అవసరాల పేరిట సేకరించడానికి చర్యలు చేపట్టింది. కాలుష్యం సాకుతో 3,100 పరిశ్రమల తరలింపునకు సిద్ధపడింది. రూ.5 లక్షల కోట్ల విలువైన 9,200ఎకరాల పారిశ్రామిక భూముల దందా వ్యవహారాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెలుగులోకి తేవడంలో పారిశ్రామిక రంగం నిర్ఘాంతపోయింది.
ఇక మూసీ సుందరీకరణ వ్యవహారం రూ.లక్షన్నర కోట్లకు చేరడం అక్రమాల నాటకంలో పతాక సన్నివేశం. హైదరాబాద్ నగర పరిధిలో 54 కిలోమీటర్లు ప్రవహించే మూసీకి ఇరువైపులా ఉన్న ప్రజల ఇండ్లను బుల్డోజర్లతో జబర్దస్తీగా తొలగించడం హైడ్రాకు నిత్యకృత్యమైపోయింది. ప్రభుత్వపరమైన అన్ని రకాల అనుమతులు సౌకర్యాలతో కట్టుకున్న ఇండ్లు, అపార్ట్మెంట్లను కూడా వదిలిపెట్టడం లేదు. నిజాం కాలం నుంచి కొనసాగుతున్న జియాగూడ కబేళాకు మున్సిపల్ అధికారులు తాళం వేయడంతో వేలాది మంది చిరువ్యాపారులు, శ్రమజీవులు వీధిన పడ్డారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ భూదందాలు పెరిగిపోవడంతో సామాన్యులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇటీవల ఖమ్మం పొలిమేరలోని వెలుగుమట్లలో భూదాన్ భూముల్లో చిన్నచిన్న ఇండ్లు కట్టుకొని దశాబ్దాలుగా నివసిస్తున్న వారిపై రాత్రికి రాత్రి అధికార భూమాఫియా పంజా విప్పింది. సుమారు 700 ఇండ్లను గంటలోనే నేలమట్టం చేసింది. నిరాశ్రయులకు ప్రత్యామ్నాయం వెంటనే చూపించాలంటూ కోర్టు మొట్టికాయలు వేసే వరకు ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదు.
కేసీఆర్ హయాంలో కోహెడ పండ్ల మార్కెట్ కోసం 199 ఎకరాలు కేటాయించి సుమారు రూ.400 కోట్ల అంచనా వ్యయంతో పనులు మొదలుపెట్టగా ప్రస్తుత ప్రభుత్వం ఆ మార్కెట్‌ను ప్రత్యామ్నాయం అంటూ మరో వివాదాస్పద ప్రాంతానికి తరలించాలని చూస్తున్నది. తద్వారా రూ.3 వేల కోట్ల విలువైన కోహెడ భూమిని పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థకు కట్టబెట్టడం ద్వారా ఓ పెట్టుబడిదారుకు సమర్పించుకోవాలని భావిస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నాదర్గుల్లో వివాదాస్పద నిషేధిత జాబితాలో ఉన్న 373 ఎకరాల భూమికి సంబంధించిన రూ.7 వేల కోట్ల స్కామ్‌లో, కొత్వాల్‌గూడ, ఆలేరు, చల్లూరు గుట్టల్లో అక్రమ క్రషర్ ఏర్పాట్లలో, గోపన్‌పల్లి లేఔట్లలో మంత్రులు, అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యుల ప్రమేయం బహిరంగ రహస్యమైనా ప్రభుత్వ పెద్దలు మొండిగా వెనుకేసుకురావడం ఆశ్చర్యకరం. కాంగ్రెస్ పెద్దల భూదందాల గురించి అసెంబ్లీలో బీఆర్ఎస్ నేతలు నిలదీయడంతో విధిలేక ఒక మంత్రికి సంబంధించిన భూవివాదాన్ని ప్రభుత్వం ఏసీబీకి అప్పగించింది. స్వతంత్ర ప్రతిపత్తి లేని ప్రభుత్వ విభాగమైన ఏసీబీ విచారణలో ఏం జరుగుతుందోతెలిసిందే. గచ్చిబౌలిలోని మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయ భూములు, అదానీ కోసం రామన్నపేట భూములు జనగామ, యాదాద్రి జిల్లాల్లో ధరణి భూభారతి రిజిస్ట్రేషన్ల మాయాజాలం… ఇలా ఒకటా రెండా రాష్ట్రవ్యాప్తంగా భూఅక్రమాలు, దురాక్రమణలు కోకొల్లలు.
దీర్ఘకాలిక ప్రజాప్రయోజనాల కోసం సర్వాంగీణ అభివృద్ధి కోసం ప్రభుత్వం భూసేకరణ చేయడం ఉన్నదే. అయితే అంతకుముందే భూములు కోల్పోతున్న ప్రజలకు సమంజసమైన పరిహారం, యోగ్యమైన ఉపాధి, పునరావాసం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంటుంది. ఆ మౌలిక సూత్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించి అమానవీయంగా వ్యవహరిస్తున్నదని రుజువు అవుతున్నది. ప్రభుత్వ భూములు చాలినంత అందుబాటులో ఉండగా, పట్టా భూములు, పంట పొలాలపై కన్నేయడం దుర్మార్గం. భవిష్యత్తు అవసరాలను పరిగణనలోకి తీసుకోకుండా కీలకమైన పట్టణ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ భూములను తెగనమ్మడం దారుణం. ధనిక రాష్ట్రం తెలంగాణకు ప్లాటమ్మితే తప్ప పూటగడువని దుస్థితికి కాంగ్రెస్ పాలకులు దిగజార్చారు. ఎట్లుండే తెలంగాణ… ఎట్లయిపాయె!