ఉన్నట్టుండి నా పుస్తకాల అల్మారా నుండి
పుస్తకాలు మాయమౌతున్నాయి
ఏ అదృశ్య దేవతల పనో మరి!
అవి వట్టి కాగితపు రాశులు కావు
నా చేతి ముద్రలు తాకి బరువెక్కిన పుటలు
అక్షరాలు రాల్చిన కన్నీటి చెలిమెలు
హృదయం పగిలిన చప్పుళ్ళు
భరించిన పుటలు
పుక్కిటి పురాణాలు కావు
కనిపించని అరణ్యాలు
కురిసిన ఎడతెగని వర్షాలు
దారితప్పిన వాగులు
మరచిపోయిన వసంతాలు
హోరున కుదిపేసే
గాలి తుపాన్లు ఒక్కొక్కటిగా
జారిపోతున్న అడుగులు
విరిగిపడిన కెరటాలు
కటిక రాత్రుల్లో
వెలిగిన నక్షత్రాల తీగెలు
ఇప్పుడెక్కడికి
పయనమయ్యాయి
ఈ పూల తెమ్మెరలు
నన్ను ఇలా ఒంటరిని చేసి
ఏ మేఘాలు తీసుకెళ్ళిన
ఒదిగిన నీటి బిందువులు
కళ్లజోడు కోసం
వెతుకుతున్న నాకు
ఆ గదిలో ఒక్కసారి
గుల్మొహర్ పూలవర్షం కురిసినట్టు
కనిపించని సెలయేళ్లు పారుతున్నట్టు
పోగొట్టుకున్న వసంతాలు తిరిగి వచ్చినట్టు
నా కళ్ళద్దాల పైన పేరుకున్న
దుమ్మును తుడిచాయి
అన్నెఫ్రాంక్ డైరీ పుస్తకంలో
కొత్త గుర్తులు…
నా పూల కొమ్మను
సుతారంగా తెంపుకున్న
అదృశ్య బాలదేవత నా ఇంట్లోనే
నడయాడుతున్నదని
నా వాకిట్లోనే ఇంద్రధనస్సు తచ్చాడుతున్నదని
ఒక సతత హరిత వనం
లోగిలిలోనే పెరుగుతుందని తెలిసాక
బహుశా అల్మారాలు ఖాళీ అయినట్టు
మన మనసు పొరలు ఖాళీ కావాలని..
కొత్త చూపు, కొత్త దారి కోసం…
-డాక్టర్ సుంకర రమేశ్
9492180764