నా నరనరాల్లో నిరంతరం
ఒక పర్వతం ప్రవహిస్తూ వుంటుంది
భోనగిరి గుట్ట దాని పేరు.
దాని పాదాల చెంతనే జన్మించాన్నేను
నేను కళ్ళు తెరిచిన నాటి నుండి
దర్శించే ప్రతి దృశ్యానికీ బ్యాక్డ్రాప్ అదే.
నేను ఎలా భావిస్తే అలాగే కనిపిస్తుందది
ముఖ్యంగా ఏనుగులాగ,
పైన ఖిల్లా దాని వీపు మీద
అంబారీలా అమిరింది.
వర్షం కురిసిన చారలు
దాని మదజలంలా స్రవిస్తాయి.
గుట్ట మా ఊరు నుంచి
పక్క ఊరి దాకా వ్యాపించి ఉంది.
మా స్కూలు మైదానంలో
కూర్చుని రాసుకుంటుంటే
ఆ నేపథ్యంలోనే
నా పద్యం తయారయ్యేది.
పట్నం నుంచి రైలులో నేను ఊరికొస్తుంటే
గుట్ట నా వైపు పరిగెత్తుకొస్తుంది
మా చూపులు కలిసిన ఉద్రిక్త క్షణం
ప్రాచీన అనుభూతుల మధురజ్వలనం.
ఆ గుట్ట ఔన్నత్యం
తల పైకెత్తి తిరగడం నేర్పింది నాకు.
గుట్ట పైకెక్కి చూస్తే
దూరంగా హైదరాబాద్ లైట్లు
మిణుక్కుమంటాయి.
ఇవాళ గుట్ట పక్క నుంచి కారులో వెళ్తుంటే
ప్రేమగా పలకరించి దగ్గరికి పిలిచింది
కింద పిల్లబాటల్లో ఆనాటి తెగిన స్లిప్పర్స్ను
వెతుక్కుంటున్నానని చెప్తే
తెగ మురిసి పోయింది.
నమ్మండి.. గుట్ట రాతికి చెవిపెట్టి వింటే
ఏవో పురా సంభాషణలు వినిపిస్తాయి
ఏదైనా దుఃఖం వాటిల్లినప్పుడు
దాని ముందు నిల్చొని చెప్పుకునే వాణ్ని
గుట్ట లేకుండా
జీవితాన్ని ఊహించలేన్నేను
ప్రపంచంలో పలు దేశాలు తిరిగాను
అయినా ఇప్పటికీ
భోనగిరి గుట్టే నా చిరునామా.
-డా. ఎన్. గోపి
93910 28496