స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి దాకా ఏడు సార్లు జన గణన జరిగింది. అందులో కేవలం ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన వివరాలను మాత్రమే వెల్లడించారు. బ్రిటీష్ కాలంలో 1931లో కుల గణన జరిగింది. దీని ప్రకారం 52 శాతం ఓబీసీలున్నట్లు తేల్చారు. ఆ తరువాత మళ్ళీ కుల గణన ఊసే లేదు. తెలంగాణ ప్రభుత్వం బీసీ కుల గణనకు సానుకూలత వ్యక్తం చేస్తున్నది. కేంద్రం కుల గణన చేపట్టేలా ఒత్తిడి తీసుకు రావడానికి ఉద్యమమే శరణ్యం. ఆ ఉద్యమానికి కలాలు తోడ్పాటునివ్వాలి. దీనికోసం బీసీ కవులు తమ కవిత్వానికి పదును పెట్టాలి. ఈ నేపథ్యంలో తెలంగాణ బీసీవాద కవిత్వాన్ని పునఃసమీక్షించుకోవడం ఒక చారిత్రక అవసరం.
జనాభా దామాషా ప్రకారం అభివృద్ధి ఫలాలు అందాలని అంబేద్కర్, ఫూలే ఆలోచనలతో బీసీలు ఎప్పటినుంచో ఉద్య మిసు ్తన్నారు. ఈ ఉద్య మానికి కలం కూడా తోడవ్వాలి. ఎందుకంటే ఎవరి బాధలు వాళ్ళే చెప్పుకోవాలి. తమ గురించి తామే చెప్పుకోవాలని ఎండ్లూరి సుధాకర్ అస్తిత్వ ఉద్యమాల పట్ల ఒక నిర్దిష్టమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయన అభి ప్రాయంతో ఏకీభవించిన బీసీ కులాల కవులు తమ కలాలకు మరింత పదును పెట్టారు.
అస్తిత్వ ఉద్యమాలు ప్రారంభమైన 1990ల నుంచి ఇప్పటిదాకా అనేక కవితా సంకలనాలు తెలంగాణ నుంచి వెలువడ్డాయి.‘చిక్కనవుతున్న పాట’ (బీసీ, దళిత) (1995), ‘బహువచనం’ (1996), ‘మే మే’, మొగి’,‘వెంటాడే కాలాలు-వెనుకబడిన కులాలు’, ‘ఎడపాయలు’(2001), ‘చెమ్మ స్’ (2005), కలాలు-గళాలు’ (2006), ‘రుంజ’ (2013), ‘సమూహం’ (2016), బీసీ కవితా సంకలనం (2020) తదితర కవితా సంకలనాలు వెలువడ్డాయి. విడిగా ఎంతో మంది బీసీ స్పృహతో ఎన్నో కవితలు రాశారు. వీటి నిండా బీసీ కులాలపై జరుగుతున్న సామాజిక అణచివేత కనిపిస్తుంది.
వాళ్ళు కుప్పపోసిన పనిముట్లు
ఈ దేశ నిర్మాణానికి
తమ చెమట చుక్కల ఇటుకల్ని పేర్చి
శ్రమనే సిమెంటుగా పూస్తారు
పరికరాల్నితిరిగేస్తే ఆయుధాలవుతాయనే
సోయి లేక ఎవడు ఛీ కొట్టినా
మాట్లాడకుండా మరింత
దగ్గరవుతుంటారు
సంఖ్యా బలమున్నా
సమైఖ్య బలంలేక
చతికిలపడు తుంటారు
ఎవరో పూనుకొని
జకముక’ రగిలిం చాలి.
ఆ నిప్పు ముందు
ఏ పీఠమైనా వంగి సలాం చేయాలి.
తొలిదశలో పగడాల నాగేందర్, ము నాసు వెంకట్, కొంపె ల్లి వెంకట్‌గౌడ్, కందుకూరి దుర్గాప్రసాద్, అంబటి వెంకన్న, అనిశెట్టి రజిత, సీతారాం, బాణాల శ్రీనివాసరావు, దెంచనాల శ్రీనివాస్, ప్రొఫెసర్ ఎన్. గోపి, ఆచార్య ననుమాస స్వా మి, ఎస్వీ సత్యనారాయణ, ప్రసాదమూర్తి, ప్రసేన్, సిద్ధార్థ, జూలూరు గౌరీశంకర్, నలిమెల భాస్కర్, జూకంటి జగన్నాథం, బెల్లి యాదయ్యలు విస్తృతంగా బీసీవాద కవిత్వాన్ని రాశారు. రాస్తున్నారు. తరువాతి దశలో పత్తిపాక మోహన్ (తెగినపోగు), ఎస్.రఘు, జ్వలిత, అన్నవరం దేవేందర్ (బువ్వ కుండ), వనపట్ల సుబ్బయ్య(కుర్చీ), దాసోజు కృష్ణమాచార్యులు (డాకలి,పుటం), మోహనకృష్ణ (పోగుబంధం) రచయితల మొదలైన బీసీ కవితా సంపుటాల్లోఎంతో బీసీ జీవితం, కుల కష్పిలోని సంఘర్షణ చిత్రింపబడ్డాయి.
చట్రం రాట్నం తిప్పీ తిప్పీ
భుజం బొక్కలు నొస్తుంటే
వెన్ను కీళ్ల నొప్పులతో ఉసూరుమంటూ
చిరిగిన బతుకులకు అతుకులేస్తున్నాం
అంటూ మోహనకృష్ణ చేనేత వృత్తిని కవిత్వీకరించాడు. అనాదిగా ఈ లోకానికి, మానవాళికి మానాన్ని కాపాడు కోవడానికి బట్టను నేసిచ్చిన నేతన్నకు ఈ సమాజం ఇచ్చిన బహుమతి ఆకలి కేకలు, ఆత్మహత్యలు మాత్రమే. వ్యవసాయం తరువాత చేనేత మాత్రమే ఎక్కువ ఉపాధిని కల్పించే రంగం. కానీ మిగిలేది శూన్యం. మార్కెట్ మాయజాలంలో, కార్పొరేట్ ఉచ్చులో చిక్కుకొని నేతన్న విలవిలలాడుతున్నాడు. ఈ కోణంలో జిందం అశోక్, భీంపల్లి శ్రీకాంత్, ప్రసాదమూర్తి, వెల్దండి శ్రీధర్, ఉదారి నారాయణ, సీహెచ్. ఆంజనేయులు, దాస్యం లక్ష్మయ్య, ఆడెపు లక్ష్మణ్, మోతుకూ రి అశోక్‌కుమార్, నరేష్కుమార్ సూఫీ, బిళ్ళ మహేందర్, చింతం ప్రవీణ్‌లు బలమైన కవిత్వం రాశారు.
మనువెద్దుల వొట్టకొట్టి అరిగిన కాలం అరికాళ్లకు నాడాలు కొట్టి ఊర్ల పుట్టుకకు
ముగ్గులు పోసిన గుమ్ముల రాశులకు రెక్కలు
కంచర రాజయ్య, వడ్లీర భద్రయ్యలు
నే కొలిమి తిత్తి
వూదీ వూదీ మంటలకు మాటలు నేర్పాకేగా
చరిత్ర ప్రసవం
జూలూరు గౌరీ శంకర్ విశ్వకర్మల జీవితాలను వడగట్టి అక్షరీకరించాడు పై కవితలో. చేతి వృత్తులేవయినా మనిషి జీవితాన్ని మలుపు తిప్పేవే. లేదంటే ఏదో ఒక ఉత్పత్తికి దోహద పడేవే. శ్రమ జీవుల నుంచే ప్రపంచం బతకడం నేర్చుకున్నది. వాళ్ళ చేతులే ఈ సమాజ గతిని మార్చాయి.
రకం కట్టేది మేమైతే
చెట్టు మీద జులుం వాడిది
కల్లు గీసేది మేమైతే
ముంత మీద ధర ముద్రించేది వాడు
మా పుట్టుకలు మేఘాలై
బతుకులు శోక సముద్రమవుతుంటే
మా వెనుకట్టి మీద లారీలు కట్టి
మాకు కడుపులే లేనట్టు
మా పొట్ట పేగులను కూడా
వేపుకు పోతున్నారు. దళారులు
అని గౌడుల శ్రమను దోపిడీ చేస్తున్న దళారుల వైఖరిని చెప్తాడు అంబటి వెంకన్న. దిన దిన గండంతో తాటి చెట్లను, ఈత చెట్లను నమ్ముకొని కల్లు అమ్మకం మీదనే జీవనం సాగిస్తున్న గౌడుల బతుకు పోరాటాన్ని విడమర్చి చెప్తాడు కవి.
ఇల్లునెత్తుకోని తిరిగిన్నో
చెరువునెత్తుకోని తిరిగిన్నో
చాపలు వలలో పడ్డాయో లేదో గాని
కన్నీళ్ళు చెరువులో పడ్డయి
చెరువులను, నదులను గాలించి చేపలు పట్టి జీవనం సాగించే బెస్తల జీవన పోరాటం కళ్ళకు కడుతుందీ కవితలో. ఓ వైపు కార్పొరేట్ దళారులు, మరో వైపు సరైన ధర లేనితనం అంతా కలిసి సగటు జాలర్లను ముంచడమే కనిపిస్తుంది.
సెప్పును కుట్టే మాదిగనడుగు
కుండను చేసే కుమ్మరినడుగు
బండ చీల్చే వడ్డెరనడుగు
తలగొరిగే మంగలినడుగు
ఈ నేలపై ఉత్పత్తి కులాలకు మించిన
ప్రతిభావంతుడు ఇంకెవడురా?
అని ప్రశ్నిస్తాడు అవని శ్రీ. బీసీ కులాల శ్రమను గుర్తించని మనువాదాన్ని ఈసడించుకుంటాడు. విశ్రాంతి వర్గాల సుతిమెత్తని దోపిడీని, నంగనాచి తనాన్ని గుర్తుపట్టాలని హెచ్చరిస్తాడు.
ఇన్నేండ్లు పోరు ధార వోసింది
ఇంకా పాలేరుతనానికి కానే కాదు
అధికారం భుజం మార్చుకునే
పటేలు తనానికే
అని బూర్ల వెంకటేశ్వర్లు బీసీల రాజ్యాధికారం గురించి మాట్లాడుతాడు. జనాభా నిష్పత్తి ప్రకారం ఎవరి వాటా వారికి దక్కే వరకు పోరాడాల్సిందే. ఏ సౌకర్యాలయినా అడుగు కానీ రాజ్యాధికారం లో భాగం మాత్రం అడుగకనే ఆధిపత్యాల వైఖరిని ఎండగడుతూ ప్రతి బీసీ కవి, బీసీ సమూహా లు కదలాల్సిన సందర్భంలో నిల్చొని ఉన్నాం. ఆ సోయితోనే సాహిత్య సృజన జరగాలని, బీసీల రచనలన్నీ అంతిమంగా బీసీలను రాజ్యాధికారం వైపు తీసుకు పోవాలని కవి కల. ప్రజాస్వామ్య మౌలిక సూత్రాల ప్రకారం మెజారిటీ ఓటర్లదే రాజ్యాధికారం కావాలి. కానీ మన అనైక్యతే మనల్ని అధికారంలోకి రాకుండా చేస్తున్నదనే ఎరుక ప్రతీ బీసీకి రావాలి. అప్పుడే ఫూలే, అంబేద్కర్ కలలు సాకారమైనట్లు.
పడావు పడ్డ ఎడారులలో బిడారులేసిన వాడు బీసీ
పాడి పంటల జంట కవిత్వంలో
శ్రామిక కావ్యం రాసిన వాడు బీసీ
ఉక్కు తల బిరుసును పనిముట్టుగా మలిచిన వాడు
చెట్టు మొదలు నుంచి చక్రం సృష్టించినవాడు
సారె మీద మట్టి ముద్ద నుండి కుండలనే కాదు
కళాఖండాలను సృష్టించిన వాడు బీసీ
అంటూ అమ్మంగి వేణు గోపాల్ బీసీ జాతుల శ్రమ సౌందర్యాన్ని కవిత్వం చేశాడు. నిజానికి బీసీలు లేకుంటే ప్రపంచం ఇంత అందంగా, ఇంత నాగరికంగా ఉండేది కాదని కవి సారాం శం. ఆయా వృత్తులకు సరైన గుర్తింపు వచ్చినపుడే ఆత్మగౌరవంతో జీవిస్తాడనే ధ్వని ఇందులో తొంగి చూస్తున్నది.
-డా. వెల్దండిశ్రీధర్
8328 594612