పలుగు పార దిద్దిన
పంట కాలువల వెంట
పారుతున్న పచ్చ నెత్తురు
కరువుదెయ్యం మెడలు వంచుతూ
సాగుతున్న శ్రమకావ్యం
పచ్చటి వ్యవసాయ క్షేత్రం
మెతుకు మాత్రల
తయారీ కేంద్రం
కలల పంట మీద కన్నువడ్డ
చీడ పురుగులను
మర్రి మానులా విస్తరించే కలుపు మొక్కలను
ఏరిపారేసే రైతు రారాజు
వెన్నుపోటు పొడిచినట్టు
నాసిరకం విత్తనాలూ నకిలీ ఎరువుల
నమ్మకద్రోహం పాలవుతున్నా
బెల్లం మీద ఈగల్లాగ
మనిషి ముఖం తొడుక్కున్న
దళారీ గుంటనక్కలు
కష్టం సొమ్ము దోచుకుతింటున్నా
కాలం కన్నెర్ర జేసి
వడగండ్ల కొడవళ్లు
లాభం కోసుకుపోతున్నా
అదరని బెదరని బాహుబలి
ప్రపంచం మూడు పూటలా
తలుచుకునే అన్నదాత
బంగారు వరి గొలుసుల చుట్టూ
కంటిచూపు కంచె వేసి
ఎగిరొచ్చే రాక్షస కాలాన్ని
తెల్లదొరల్ని తరిమేసినట్టు
ఒడిసెల గుండు గురిపెట్టి
తరుముతున్న వీర సైనికుడు
కుల మత జాతి భేదం తెలియని పంట కాపు
సేవకు కంకణం కట్టుకున్న రైతు
పట్నాలు పల్లెలను పలుకరించే
పంటసిరుల సాయం.
గజ్జెల రామకృష్ణ
89774 12795