నాడు, నేడు కవులది ఒకే చూపు, ఒకే దారి. సూర్యోదయపు తొలి కిరణాలను అందిపుచ్చుకొని పొద్దు పొడుపుల వెంట చైతన్యం వైపు పరుగులు తీయడం. ఇందుకు కరీంనగర్ కవులు మినహాయింపేమీ కాదు. తడి ఆరని ఆంధ్ర మహాసభ జ్ఞాపకాలు, సాయుధ రైతాంగ పోరాటపు గాయాల సలపరింపు, భూస్వామ్య వ్యవస్థపై తిరుగుబాటు సంఘటనలు, సిరిసిల్ల జగిత్యాల కల్లోల కలవరింపు, తెలంగాణ రాష్ట్ర తొలి, మలి ఉద్యమాల ఉడుకు రక్తం.. ఇక్కడి కవులు, కళాకారులను అనుక్షణం కలవరపెడుతూనే ఉన్నాయి. పోరాటాలు, ఉద్యమాల నుంచి పుట్టుకొచ్చిన కవులే కాదు, సాంఘిక, సామాజిక, ఆర్థిక అసమానతల నుంచి పుట్టుకొచ్చిన కవులు కూడా ఉన్నారు.
శతాబ్దాల కాలం నాటి వేములవాడ భీమకవి నాటిన లలితకళల విత్తనాలతో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కవులు పుట్టిన నేల ఇది. కాలం వెంట కదులుతున్న కవులు, తెలుగు భాషకు నడకనేర్పిన రచయితలు, పాటకు ప్రాణం పోసిన గాయకులు.. ఈ నేల నేలంతా పచ్చటి మాగాణంతో పరిమళాలు వెదజల్లుతున్నది. సమాజానికి దిశానిర్దేశం చేస్తూ వచ్చిన కవితా సంపుటాలు, కథా సంకలనాలు, నవలా సాహిత్యం ‘విశ్వంభర’ను తాకాయి. ఎందరో సాహిత్యకారులను చైతన్యవంతులను చేసి, వాళ్ల దృష్టిని పేద ప్రజల జీవితాల్లోని బాధల వైపు, సమస్యల వైపు, పోరాటాల వైపు మళ్లించింది. తాజాగా వెలువడిన ‘కరీంనగర్ కవులు నాడు నేడు’ వంద రెండు కవితల సంకలనం ఇందుకు నిలువుటద్దం.
మాతృభూమి మీది మమకారంతో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి చెందిన పూర్వ ఉప కులపతి ఆచార్య అనుమాండ్ల భూమయ్య ముందుకువచ్చి నూటా ఇద్దరు కవుల కవితలతో ఆనాటి, ఈనాటి పద్యాలు, కవితలను మన ముందుకుతెచ్చారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఈ కవులందరూ ఆర్థిక స్వేచ్ఛ, సాంఘిక స్వేచ్ఛ, భావ స్వేచ్ఛ ముఖ్యంగా ఇవన్నీ కలగలసిన స్వేచ్ఛతో తమ భావాలను పటిష్ఠంగా మనస్సుకు హత్తుకునేట్లు వ్యక్తం చేశారు. 10వ శతాబ్ది నాటి జినవల్లభుడు, వేములవాడ భీమకవి, చరిగొండ ధర్మన్న, మల్లియ రేచన, ఎలిగందుల నారయ, మడికి సింగన, మామిడిపల్లి సాంబశివ శర్మ, సినారె, వానమామలై, బాపురెడ్డి తదితరులు నాటి కవులు, నేటి కవులు జూకంటి, నలిమెల భాస్కర్, అన్నవరం దేవేందర్, వారాల ఆనంద్, రాజేందర్ జింబో, వెల్దండి శ్రీధర్, గాజోజు నాగభూషణం తదితరులు 102 మంది కవితల సంకలనం ఇది.
తెలుగు భాషకు ప్రాచీన భాష హోదా కల్పించిన తొలి కందపద్యాలు రాసిన కవి జినవల్లభుడు. జిన భవనాలు కట్టించడం, జిన సాధువుల పూజలు చేయడం, జినమునులకు నచ్చిన భోజనాలు పెట్టడంలో ఇతర జైనులెవ్వరినీ జిన వల్లభునితో సరిపోల్చలేం. సూర్యుడితో సమానంగా వెలుగు వారు, జిన వల్లభునితో సరితూగు మరే కవులు లేరు. ఒక్కొక్కరు ఒక్కొక్క సుగుణంతో ఉంటారు. ఆలోచించి చూస్తే జిన వల్లభుడే గుణమణి. పైగా ఆయన ‘గుణపక్ష పాతి’ అనే అర్థంతో మొదలైన కంద పద్యం ఈ సంకలనానికి తొలి పద్య కవిత జిల్లాలోని గంగాధర మండలం కురిక్యాల గ్రామంలోని వృషభగిరి అనే బొమ్మలమ్మ గుట్టపై చెక్కబడి ఉంది. అలాగే 11వ శతాబ్దికి చెందిన కవి వేములవాడ భీమకవికి చెందిన చాటువులు ప్రజాదరణ పొందినవి. నన్నయ్య తర్వాత, తిక్కన్న కంటే ముందు జీవించి సమాజంలోని అసమానతలపై చాటువు శైలిలో పద్యాలు రాశాడు. ఈ మహాకవి స్మారకార్థం 1935లో సిరిసిల్లలో నిర్వహించిన ఆంధ్ర మహాసభ వేదికకు ‘భీమకవి నగర్’గా పేరు పెట్టడం విశేషం.
మరో కవి మల్లియ రేచన తెలుగులో మొదటి ఛందో గ్రంథం రాసినవాడు. వేములవాడకు చెందిన రేచన ఎంతోమంది కవులకు ఆశ్రయమిచ్చాడు, పోషించాడు. కంద పద్యాలతో కూడుకున్న ‘కవిజనాశ్రయము’ అనే విలక్షణమైన గ్రంథాన్ని రాశాడు. 15వ శతాబ్దానికి చెందిన మడికి సింగన రచించిన ‘సకల నీతి సమ్మతము’ గ్రంథంలోని పద్యాలన్నీ రాజ్యాంగంలోని అన్నివర్గాల ప్రజలు పరస్పర సహకారంతో ముందుకుసాగడానికి నీతి మార్గాలను బోధించాడు. ఆ తర్వాత 20వ శతాబ్దం తొలి తరం కవులలో మామిడిపల్లి సాంబశివ శర్మ, డాక్టర్ సి.నారాయణరెడ్డి, వానమామలై, బాపురెడ్డి తదితరులు మారుతున్న సమాజానికి అనుగుణంగా పద్య, వచన కవితలు రాశారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వేల సంఖ్యలో కవులున్నారు. 102 మందితో ఈ సంకలనం మనకు సమగ్రతను అందివ్వదు. మరింతమంది కవులతో ఇలాంటి సంకలనాలు మరిన్ని రావడానికి ఇది ప్రేరణగా నిలుస్తుందని ఆశిస్తున్నాను.
– కోడం పవన్‌కుమార్ 98489 92825