ఆమెకు వ్యక్తిత్వం పట్ల అభిరుచి. మానవత్వం పట్ల అభిరుచి. సమాజ హితవు పట్ల అభిరుచి. ఇవన్నీ ఒక పార్శ్వం అయితే భాష పట్ల, సాహిత్యం పట్ల, సాహిత్యంలోని వివిధ ప్రక్రియల పట్ల వల్లమాలిన అభిరుచి ఉండటం మరో పార్శ్వం. నిరంతర తపనతో జీవితంలో అధికభాగం సాహితీ సేవకు వినియోగిస్తూ ఇప్పటికే ఇరవై ఐదుకు పైగా పుస్తకాలను వెలువరించిన డాక్టర్ కొండపల్లి నీహారిణి ‘అభిరుచి’ సాహిత్య వ్యాస సంపుటితో మరో అడుగు ముందుకువేశారు. ఇందులో తీసుకున్న అంశాలన్నీ వైవిధ్య భరితంగా ఉండటం ఆమె సాహిత్యాభిరుచికి దర్పణం.
ఈ సాహిత్య వ్యాస వితతిలో కొండపల్లి నీహారిణి రాసిన 30 వ్యాసాలను కవిత్వం, వ్యాసావళి, పరిశోధన, కథలు, అనువాదాలు, ఆత్మకథ, నవల అనే భాగాలుగా వింగడించవచ్చు. ఈ రచయిత్రికి అన్ని ప్రక్రియల్లో ఉన్న అవగాహన, లోతైన పరిశీలన, దేనినైనా విశ్లేషించగలిగే సామర్థ్యం మనకు అడుగడుగునా కనిపిస్తాయి. దీనికి ముందుమాట రాసిన డాక్టర్ రూప్ కుమార్ డబ్బీకార్ ‘చలనశీల భౌతిక ప్రపంచంలో కాల పరిణామాలకు అనుగుణంగా మానవ అనుభవాలను ఏ విధంగా తనలోకి ఇంకింపజేసుకుంటూ వ్యక్తి తన స్వీయ అస్తిత్వాన్ని నిలుపుకొనే ప్రయత్నం చేస్తాడో ఆ దిశగా ప్రయాణిస్తూ సమాజంలోని వైవిధ్యాలను, భిన్నత్వాలను దర్శిస్తాడు సమీక్షకుడు’ అంటూ సమీక్షకుల లక్షణాన్ని వివరిస్తారు.
ఒక పుస్తకాన్ని లోతుల్లో స్పృశించి, కవి లేదా రచయిత హృదయంలోకి పరకాయ ప్రవేశం చేసి, ఆ భావాన్ని అదే స్థాయిలో అర్థం చేసుకొని, అంత స్థాయిలో వివరించడం గొప్ప సమీక్ష అవుతుంది. ‘అభిరుచి’లోని వ్యాసాలను చదివితే నీహారిణి ఎంత సునిశితంగా ఆ పుస్తకాలను అవగాహన చేసుకున్నారో, వాటిలోని మార్మికతను ఎంతగా గ్రహించారో అర్థమవుతుంది.
‘ఒకనాటి బంధాలకు దూరంగా ఎంతో ప్రయాణం చేసిన మనకు స్వార్థం సహజమైపోయింది. నటించే మనుషుల మాటున అసలైన నైసర్గిక రూపం అణగారిపోయింది’ అని ఆయన చెప్పినట్లుగా మళ్లీ మనం జన్మించాలంటే విత్తనంలోకి వెళ్లి రాక తప్పదంటారు నీహారిణి. ఎక్కడ ఆగిపోయిందో అక్కడే ఆరంభించాలన్న సామాజిక వాస్తవాన్ని తెలుపుతారు.
‘ఎయిలు వారంగ లేచింది మొదలు/ నడిరాత్రి పడుకునే దాకా/ పొక్కిలైన నేలకు/ అలుకు పిడుచయ్యేది నాయనమ్మ’ అన్న కందుకూరి శ్రీరాములు వాక్యాలను ఉటంకిస్తూ ఆనాటి పల్లె జీవితాన్ని ప్రత్యక్షం చేయిస్తారామె.
‘అన్నిటికన్నా సులభం ఆశపడడం/ అన్నిటికన్నా కఠినం ఆశయ సాధనం/ అపజయానికి దారులు శతకోటి/ విజయ శిఖరానికి రాదారి ఒక్కటే’ వి.ఎస్.పి.తెన్నేటి వాక్యాలను ఉదాహరిస్తూ.. ‘తన చుట్టూ ఉన్న సమాజాన్ని ప్రతిబింబించడమే కవి ఉద్దేశం అయినప్పుడు, కవి Abstract perceptionతో కవిత్వం రాస్తున్నప్పుడు ఔషధ ప్రాయమైన కవిత్వాన్ని రాస్తాడు’ అని చెప్పడం కవిత్వం పట్ల ఆమెకున్న సుస్పష్టమైన అభిప్రాయాన్ని వెల్లడిస్తుంది.
‘కాలాన్ని గెలుస్తూ’ కవితా సంకలనంలో… ‘వాళ్లు అందరిలా చూడలేరు/ అందరి అంతరంగాలను చదవగలరు… నా దేశం నిస్సందేహంగా/సభ్య ప్రపంచం మునివాకిట్లో వికలాంగ దేశమే’ వంటి కవితా పంక్తులు దివ్యాంగుల అభ్యున్నతి కోసం ప్రభుత్వాలు కృషి చేయాల్సిన బాధ్యత గురించిన హెచ్చరిక, వారి పట్ల ఆవేదనను
తెలుపుతాయి.
‘అయ్యయ్యో దమ్మక్కా!’ అనేది జూపాక సుభద్ర రచించిన కవితా సంపుటి. ఈ పదం తెలంగాణలో ఒక ఆటకు సంబంధించినదని ఎవరికీ తెలియదు. వృత్తాకారంలో కూర్చున్న పిల్లల్లో ఒకరు ఒక కథ చెబుతూ గుండ్రంగా తిరుగుతారు. అయిపోయిన వెంటనే మిగతా పిల్లలు ‘అయ్యయ్యో దమ్మక్కా!’ అని ఛాతీ మీద చేతులతో కొట్టుకుంటారు. తర్వాత మరొకరు కథ చెబుతారు. ఆనాడు స్త్రీల కడగండ్లను తెలిపే ఆట ఇది. ఇటువంటి ప్రత్యేక విషయాలనెన్నిటినో ‘అభిరుచి’లో వివరిస్తారు నీహారిణి. నీహారిణి దృష్టిలో కవిత్వమంటే చిక్కని దట్టమైన అడవిలా ఉండాలి. అంతులేని ఆకాశంలో పారుతున్న నదిలా జవ జీవాలందించాలి.
వాణీ దేవులపల్లి రచించిన ‘అస్తిత్వ పరిమళాలు’ వ్యాస సంపుటిలో స్త్రీల ఉనికిని తెలిపే 13 వ్యాసాలను విశ్లేషిస్తారు నీహారిణి. ప్రాస్తావికంగా ఇక్కడ మహిళామణి రూప్ ఖాన్ పేట రత్నమాంబ రాసిన ‘తరుణీ కృత… జ్ఞానము గలదే’ అనే పద్యాన్ని ఉటంకిస్తూ రత్నమాంబని ఆధునిక కాలానికి తొలి కవయిత్రిగా ఉద్ఘాటించవచ్చని చెప్పడం స్త్రీల రచనల పట్ల నీహారిణి లోతైన దృష్టికి తార్కాణం. స్త్రీలకు ఎంత జ్ఞానం ఉన్నా వారిని తక్కువగా చూసే సమాజంలో ఇంకా స్త్రీలు బతుకుతున్నందుకు ఆమె ఆవేదన వ్యక్తం చేస్తారు. మార్పు వస్తుందన్న ఆశావహ దృక్పథాన్ని వెలిబుచ్చుతారు.
‘సాహిత్య విమర్శను చదివితే ఏం తెలుస్తుంది?’ అని ప్రశ్నిస్తూనే ‘తరతరాల సాహిత్య చరిత్ర తెలుస్తుంది. ఆనాటి సమాజ పరిస్థితులు, వర్గ వైషమ్యాలు, సఖ్యతలు, వైశాల్యాలు తెలుస్తాయి’ అంటూ సాహితీ విమర్శ ప్రయోజనాన్ని కూడా చెప్తారు నీహారిణి.
‘అభిరుచి’ వ్యాస సంపుటి ఆసాంతం వదలకుండా చదివించగలిగే రీతిలో కొనసాగుతుంది. ప్రతీ ప్రక్రియను రచయిత్రి అంతర్గత నేత్రంతో దర్శించారు. భాష, భావ ప్రకటన, వాక్య నిర్మాణశైలి, నిశిత పరిశీలన, లోతైన విమర్శ ఆమె రచనకు వన్నె తెచ్చాయి. పైకి సున్నితంగా కనిపించినా సమాజంలోని దురన్యాయాలకు ఆమె హృదయం బడబానలమై ఎగసి, దాని నుంచి ఆమె కలం పదునుదేరి కత్తిలా మారి అక్షరాలను ఝళిపిస్తుంది.