శ్రీకృష్ణదేవరాయలు రచించిన ఆముక్త మాల్యద తెలుగు సాహిత్య చరిత్రలో ఒక అపూర్వమైన కావ్యం. ఇది కేవలం భక్తి కావ్యం మాత్రమే కాదు. రాజకవి హృదయంలోని కవిత్వ స్ఫూర్తి, సామాజిక అవగాహన, మానవ మనస్తత్వ పరిశీలన, ధర్మం-భక్తి-ప్రేమల సమన్వయాన్ని ప్రతిబింబించే మహాకావ్య స్వరూపం. యుద్ధరంగంలో తిరుగులేని విజయాల్ని పొందే ఒక చక్రవర్తి, సాహిత్యరంగంలోనూ అంతే శక్తివంతంగా నిలువడం భారతీయ సాంస్కృతిక సంప్రదాయంలో అరుదైన ఘట్టం. ఆముక్త మాల్యద దానిని సార్థకం చేస్తుంది. ఈ కావ్యం ద్వారా కృష్ణదేవరాయలు తనను కేవలం పాలకుడిగా కాకుండా, కవిగా, దార్శనికుడిగా, భక్తుడిగా, సమాజాన్ని గమనించే సాక్షిగా స్థాపించుకున్నాడు.
ఆముక్త మాల్యద గోదాదేవి కథ ఆధారంగా నిర్మితమైనప్పటికీ, అది పురాణానువాదం మాత్రమే కాదు. గోదాదేవి విగ్రహాన్ని కేంద్రంగా చేసుకొని, భగవంతుడి పట్ల ప్రేమ స్వరూపాన్ని, భక్తిలోని ఆచార, సంప్రదాయాల పరిమితిని, నియమాల కన్నా భావానికి ఉన్న ప్రాధాన్యతను ఈ కావ్యం విశదపరుస్తుంది. గోదాదేవి తాను ధరించిన పూలదండను విష్ణువుకు అర్పించటాన్ని ‘ఆముక్త మాల్యద’గా కవి ప్రతీకాత్మకంగా ఆవిష్కరించాడు. ఇక్కడ భక్తి అనేది భయంతో పుట్టిన ఆచారం కాదు. అది హృదయం నుంచి ఉద్భవించిన ప్రేమ. ఈ భావమే కావ్యానికి ప్రాణం. ఈ కావ్యంలోని అత్యంత విశిష్టమైన అంశం రసాత్మకత. శృంగార, కరుణ, శాంత, అద్భుత రసాలు సహజంగా కలసి ప్రవహిస్తాయి. భక్తి అనే భావాన్ని కఠినమైన ధర్మబోధగా కాకుండా, మానవ జీవితానికి సన్నిహితమైన ఆనందానుభూతిగా మలిచే ప్రయత్నం కృష్ణదేవరాయల కవిత్వంలో స్పష్టంగా కనిపిస్తుంది.
కావ్యం చదివే పాఠకుడు భక్తిని భయంతో కాదు, ఆనందంతో అనుభవిస్తాడు. ఇదే ఆముక్త మాల్యద ప్రత్యేకత. కవిత్వంలో వర్ణనల విషయానికి వస్తే, ఆముక్త మాల్యద ఒక చిత్రకావ్యంలా అనిపిస్తుంది. విల్లిపుత్తూరు గ్రామ వర్ణనలో కవి చూపించిన సూక్ష్మదర్శనం ఆశ్చర్యకరం. తెల్లవారుజామున పంటకాలువ గట్టుపై నిద్రిస్తున్న బాతుల దృశ్యం, బ్రాహ్మణుల తడి వస్ర్తాలు, పంట పనులకు బయలుదేరుతున్న గ్రామస్థులు…ఈ ఒక్క వర్ణనలోనే ఆనాటి గ్రామీణ జీవన విధానం, సామాజిక క్రమం, ఆర్థిక వ్యవస్థ, మానవ-ప్రకృతి అనుబంధం అన్నీ ఒకేసారి ప్రతిఫలిస్తాయి. ఇది కేవలం ప్రకృతి వర్ణన కాదు. ఇది ఒక నాగరికత చిత్రణ.
ఈ గ్రామ వర్ణన ద్వారా కృష్ణదేవరాయలు ఒక మౌలికమైన సందేశాన్ని ఇస్తాడు. మంచి సమాజం, సుస్థిరమైన వ్యవస్థ ఉన్నచోటే మహనీయులు పుడతారు. గోదాదేవి తండ్రి విష్ణు చిత్తుడు వంటి మహాభక్తుడు పుట్టటానికి కారణం ఆ గ్రామంలోని క్రమ శిక్షణ, నైతికత, సహజ జీవన
విధానం. నాయకుని వర్ణనకు ముందు సమాజాన్ని వర్ణించటం భారతీయ కావ్య సంప్రదాయానికి అనుగుణమైనా, కృష్ణదేవరాయల దృష్టిలో అదిఒక తాత్విక ప్రకటన.
ఆముక్త మాల్యదలో మరో విశిష్ట అంశం.. ధర్మంపై కవి తీసుకున్న దృష్టికోణం. ధర్మం అంటే కేవలం ఆచారాల సమాహారం కాదని, అది మానవత్వంతో, ప్రేమతో, కర్తవ్యబోధతో ముడిపడి ఉండాలని కవి సూచిస్తాడు. గోదాదేవి తాను ధరించిన దండను భగవంతునికి అర్పించటాన్ని తండ్రి తప్పుగా భావించినా, భగవంతుడే ఆ దండను స్వీకరించటం ద్వారా ఒక గొప్ప తాత్విక సత్యాన్ని వెల్లడిస్తాడు. భగవంతుడికి కావలసింది ఆచారం కాదు, ప్రేమ. ఈ భావన ఆముక్తమాల్యదను కేవలం భక్తి కావ్యంగా కాకుండా, మానవ సంబంధాలపై లోతైన వ్యాఖ్యానంగా నిలబెడుతుంది. భక్తిభావనలోని ఈ మానవీయ కోణమే కావ్యాన్ని కాలాతీతంగా మారుస్తుంది. నియమాలకే ప్రాధా న్యం ఇస్తూ భావాన్ని మరిచిపోతే, ధర్మం తన లక్ష్యాన్ని కోల్పోతుందని కవి హెచ్చరిస్తాడు. ఈ విమర్శ ఆనాటి సమాజానికే కాదు, నేటి సమాజానికీ సమానంగా వర్తిస్తుంది. ఆచారాలు లక్ష్యం కావు. అవి లక్ష్యానికి దారి చూపే సాధనాలు మాత్రమే అనే సత్యాన్ని కవి రసాత్మకంగా తెలియజేస్తాడు.
కృష్ణదేవరాయల కవిత్వంలో మరో గొప్ప లక్షణం ఆయన దృశ్యాత్మక ఊహాశక్తి. అర్ధరాత్రి వీచే మలయ గాలి, ధ్వజస్తంభాలపై మోగే మువ్వల స్వరం, పక్షుల రెక్కల చప్పుడు…ఈ సన్నివేశాలన్నీ కవికి ప్రకృతి మీద ఉన్న లోతైన అవగాహనను సూచిస్తాయి. ఒక రాజు ఇలాంటి సున్నితమైన దృశ్యాలను గమనించటం ఆయన అంతర్గత కవిత్వాన్ని రుజువు చేస్తుంది. ఇది తీరికతో పుట్టిన కవిత్వం కాదు. తీవ్రమైన సృజనాత్మక కోరికతో పుట్టిన కవిత్వం. ఆముక్త మాల్యదలో శృంగార రసం కూడా పవిత్రతతో కూడినదిగా కనిపిస్తుంది. కొత్త దంపతుల సన్నివేశాన్ని వర్ణిస్తూ కవి ఎక్కడా అశ్లీలతకు లోనుకాకుండా, మానవ అనుభూతుల సహజత్వాన్ని మాత్రమే చిత్రిస్తాడు. శృంగారం ఇక్కడ భక్తికి విరుద్ధంగా కాదు. అది జీవన సహజ ధర్మంగా ప్రతిష్ఠితమవుతుంది. ఈ సమన్వయమే భారతీయ కవిత్వంలోని గొప్పతనం, కృష్ణదేవరాయల కవిత్వంలోని పరిపక్వత.
భాషాపరంగా ఆముక్త మాల్యద శుద్ధమైన తెలుగు కావ్య భాషకు ప్రతినిధి. సంస్కృత సమాసాల ప్రభావం ఉన్నప్పటికీ, అవి భావానికి భారంగా కాకుండా, కావ్యానికి గౌరవాన్ని చేకూర్చేలా ఉపకరించాయి. ఉపమానాలు, రూపకాలు, అనుప్రాసలు సహజంగా ప్రవహిస్తాయి. సాహిత్య విమర్శకుల దృష్టిలో ఆముక్త మాల్యద ఒక రాజు రచించిన కావ్యం అనే కారణంతో కొందరు సందేహాలు వ్యక్తపరిచినా, కావ్యంలోని అంతర్గత ఏక త్వం, భావ లోతు, రససిద్ధి ఇవన్నీ ఈ రచన కృష్ణదేవరాయల స్వంత సృజనాత్మక ఫలితమేనని నిరూపిస్తాయి. యుద్ధాల మధ్యలోనూ కవిత్వాన్ని సృష్టించిన ఈ మహానుభావుడి ప్రతిభకు ఇది సాక్ష్యం. ఆముక్త మాల్యద ఒక భక్తి కావ్యంగా ప్రారంభమై, సామాజిక తత్వ గ్రంథంగా, మానవ ప్రేమకు అద్దం పట్టే కావ్యంగా విస్తరిస్తుంది. ఇది దేవుడిని ఆరాధించమని కాదు, దేవుడిని ప్రేమించమని బోధిస్తుంది. ఆ ప్రేమ మనిషిని మనిషిగా నిలబెడుతుంది.
శ్రీకృష్ణదేవరాయల దృష్టిలోవ్యవసాయం ఒక వృత్తి కాదు,అది ధర్మం, అది రాజనీతి, అది సంస్కృతి. నీటి నిర్వహణలో విజ్ఞానం, పంటల వైవిధ్యంలో జీవ వైవిధ్య చైతన్యం, ప్రకృతి సమతుల్యతపైఅవగాహన, రైతు శ్రమపై గౌరవం ఈ నాలుగు అంశాలు భారతీయజ్ఞాన వ్యవస్థకు మూలస్తంభాలు.దేశ సమృద్ధి భూమి సమృద్ధితోనే వస్తుంది. భూమి సమృద్ధి రైతు గౌరవంతోనే సాధ్యం అవుతుంది. అందుకే శ్రీకృష్ణదేవరాయలు కేవలం రాజో! కవో! కాదు. భారతీయ కర్షక సంస్కృతిని కవిత్వంలో శాశ్వతం చేసిన జ్ఞానదర్శి, అచ్చమైన తెలుగు రైతు.
భారతీయ జ్ఞాన పరంపర అనేది కేవలం వేదాలు, శాస్ర్తాలు, దార్శనిక తత్వాలు మాత్రమే కాదు. జీవన విధానం, ఆర్థిక వ్యవస్థ, ప్రకృతి సంబంధం, కర్షక సంస్కృతిని సమగ్రంగా ఆవిష్కరించిన అనుభవ జ్ఞాన సమాహారం. ఈ పరంపరలో శ్రీకృష్ణదేవరాయల ఆముక్త మాల్యద ఒక విశిష్ట గ్రంథం. ఇది భక్తికావ్యంగా ప్రసిద్ధి చెందినప్పటికీ, ఇందులో ప్రతిఫలించిన వ్యవసాయ దృక్పథం, రైతు జీవన గౌరవం, నీటి నిర్వహణపై దృష్టి, ప్రకృతి సమతుల్యతపై అవగాహన వంటి అంశాలు భారతీయ జ్ఞాన వ్యవస్థలోని సుస్థిర అభివృద్ధి భావనలను ప్రతిబింబిస్తాయి. ధనధాన్యద్విరదాశ్వగోగణ సమేతమైనదే దేశం అని రాయలవారు పేర్కొంటారు. అంటే ధనసంపద, ధాన్యసంపద, పశుసంపద కలిగినదే నిజమైన రాజ్యం. ఈ సమృద్ధి వ్యవసాయం మీద ఆధారపడినదే. అందుకే పాలకుడి ప్రధాన బాధ్యత నీటి పారుదల సదుపాయాలను కల్పించటం అని ఆయన రాజనీతి ఉపదేశంలో స్పష్టం చేస్తారు.
-కర్నె మల్లికార్జున్
6303744239