‘సాహిత్యం ఒక జీవధార. ప్రవాహ వేగం తగ్గవచ్చు కానీ ఎప్పటికీ చావదు. అసలైన సాహిత్యం ప్రాంతీయ భాషల నుంచి వస్తుంది. ఇంగ్లీషులో అనువాదం చేస్తే అసలు భావం అర్థం కాదు. కానీ ఒక భారతీయ భాష నుంచి వేరే భాషకు అనువాదం చేస్తే అర్థం, భావం మారదు’ అనేది రాజకుమారి ఇందిరాదేవి ధన్‌రాజ్‌గిర్ నిశ్చితాభిప్రాయం.
రాజా ధన్‌రాజ్‌గిర్, శ్రీమతి ప్రమీల దంపతుల జ్యేష్ఠ పుత్రికగా ఆగస్టు, 17వ తేదీన 1930లో ప్రతి అణువు కళాత్మకంగా, రాచరికానికి ప్రతీకగా నిలిచే హైదరాబాద్ పాతబస్తీలోని గ్యాన్బాగ్ ప్యాలస్‌లో ఇందిరాదేవి ధన్‌రాజ్‌గిర్ జన్మించారు. బాల్యం నుంచి నిన్నమొన్నటి వరకు ఈ ప్యాలస్‌నే ఆమెకు సర్వస్వం అయింది. 95 ఏండ్ల వయసులో ఇటీవల కాలధర్మం చెందిన ఇందిరాదేవి ధన్‌రాజ్‌గిర్ సుప్రసిద్ధ కవయిత్రిగా, రచయిత్రిగా, కళాకారిణిగా, చిత్రకారిణిగానే కాకుండా గొప్ప నాయకురాలిగా, నిర్వహణాధికారిగా అనేక సంస్థలకు సేవలందించి వినుతికెక్కారు.
తండ్రి ధన్‌రాజ్‌గిర్ సభలు, సమావేశాలు, శుభకార్యాలకు ఇందిరాదేవిని తన వెంట తీసుకువెళ్ళేవారు. దీంతో అనేకమంది గొప్ప వ్యక్తుల్ని కలవడం, వివిధ మనస్తత్వాలను చదవడం చిన్ననాటి నుండి ఆమె అలవాటు చేసుకున్నారు. ఆమె విద్యాభ్యాసం యూరోపియన్ ఆయా ద్వారా ఇంటి వద్దనే జరిగింది. ప్యాలస్‌లోని గ్రంథాలయంలో ఎన్నో పుస్తకాలు చదువుతూ, బాల్యం నుండి ఏర్పడిన పఠనాశక్తితో ప్రపంచంలోని పలు విషయాలపై గట్టి పట్టు సాధించారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్న చందంగా ఇందిరాదేవి తన 9వ ఏట రాసిన కవిత పాఠశాల మ్యాగజైన్లో ప్రచురించారు. అయితే, ఆమె తండ్రికి కుమార్తె కవిత్వం రాయడం ఇష్టం లేదు. కవిత్వమంటే సున్నితమైన శృంగార భావనలు అని ఆయన ప్రోత్సహించేవారు కాదు. దీంతో ఇందిరాదేవి తాను విదేశాల నుంచి తెచ్చుకున్న టైప్‌రైటర్‌తో తానే స్వయంగా తన కవితలను టైపు చేసుకునేవారు. ఆమె రాసిన ఆంగ్ల కవితలు, రచనలు రాశిలో కొన్నయినా వాసిలో మిన్నగా పలువురి ప్రశంసలు అందుకున్నారు. వాటిలో మచ్చుకు కొన్ని..
1964లో మొదటి కవితా సంపుటి ’ది అపోస్టల్’ (The Apostle), 1965లో రిటర్న్ ఎటర్నిటీ (Return Eternity), కోరికలు, ఇతర కవితలు (Yearnings and Other Poems), 1968-మిమోసాలో విడిపోవడం (Parting in Mimosa), 1976-పోయమ్స్ ఆఫ్ మై నేషనల్ మెమరీ (Poems by My National Memory, Indian Languages Forum 1976), 1976 – విండ్ బ్లోస్ ఫ్రమ్ ది స్కాఫోల్డ్ (Wind Blows from the Scaffold), 1969 నిబద్ధత (Commitment), 1974 టైడ్ (Tide), నాన్ ఫిక్షన్ (Non-fiction)-మెమొరీస్ ఆఫ్ ది డెక్కన్. 8వ నిజామ్ ముఖరంజా గారికి, ఇతర రాజవంశ సంబంధీకులకు అంకితం ఇచ్చారు. అనువాదాలు: 1974 శేషజ్యోత్స్నా-తన భర్త గుంటూరు శేషేంద్రశర్మ గారి ’భారతీయ ఆధునిక తెలుగు సాహిత్యం’ను ఆంగ్లంలోకి అనువదించారు. ఛాయాపురుష్-ఆంగ్లంలోకి అనువదించారు. హెర్క్యులిస్ కథను చాలా హృద్యంగా, భిన్నంగా రాశారు. నా దేశం నా ప్రజలు, మేరీ ధర్తీ మేరీ లోగ్’ పేరుతో ఓం ప్రకాశ్ నిర్మల్ గారితో కలిసి హిందీలోకి అనువదించారు. ఋతుఘోషను Cry of the Seasonగా ఆంగ్లంలోకి అనువదించారు. సహ రచయితగా ఇతర పుస్తకాలను, అనేక హిందీ, ఉర్దూ, తెలుగు, ఆంగ్ల రచయితల పుస్తకాలకు ముందుమాట రాశారు. ఉర్దూలో ఆత్మకథ-కహి కా షాన్ రచించారు. ఇందిరాదేవి అనేక ఆంగ్ల కవితలను ప్రముఖ కవి ముఖ్దుం ఉర్దూలోకి అనువదించారు.
కాళిదాసు రాసిన సంస్కృత కవితను శేషేంద్ర శర్మగారితో కలిసి అనువదించారు.1970లో గుంటూరు శేషేంద్రశర్మ గారిని ఇందిరా దేవి వివాహం చేసుకున్నారు. ఆ తరువాత తన రచనా వ్యాసంగం నుంచి కొంత కాలం విరామం తీసుకున్నారు. కానీ అడపాదడపా తన భర్త తెలుగు రచనలను హిందీ, ఇంగ్లీషులోకి అనువదించేవారు.
ఇందిరాదేవి అనేకమంది దేశవిదేశాల ప్రముఖ కవులకు ఆతిథ్యమిచ్చేవారు, హిందీ, తెలుగు కవితాగోష్టులను నిర్వహించేవారు. శ్రీశ్రీ, దాశరథి, ముఖ్దుం మొహియుద్దీన్, సర్దార్ జాఫ్రి, కైఫ్ ఆజ్మి, వంటి మహాకవులతో అనేకసార్లు కవి సమ్మేళనాలు, కవితాగోష్ఠులు నిర్వహించి చక్కటి ఆతిథ్యాన్నిచ్చేవారు.
పి.వి.నరసింహా రావు గారి కుమార్తె వివాహం గ్యాన్బాగ్ ప్యాలస్‌లో జరగడం, బాపూ-రమణల ముత్యాలముగ్గు, సర్దార్ పాపారాయుడు, మరికొన్ని సినిమాలు ఈ ప్యాలస్‌లో షూటింగ్ జరుపుకోవడం విశేషం. ముత్యాలముగ్గు సినిమాలో శేషేంద్రశర్మగారి ‘నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది’ పాట ఆదరణతో పాటు అవార్డును కూడా పొందింది. 26 సంవత్సరాల వయస్సులో తన తొలి విదేశీ పర్యటన కోసం తెలుగు రచయితల బృందానికి నాయకురాలిగా, శేషేంద్ర శర్మగారు, పోతుకూచి సాంబశివరావులతో మారిషస్ వెళ్ళడం, అక్కడ తెలుగువారి కోసం ఒక గ్రంథాలయ శంకుస్థాపనకు ఆనాటి అక్కడి ప్రధానమంత్రి సీవూసాగర్ను ఆహ్వానించడంతో ఆయన అంగీకరించడంతో సాహిత్య కారులు, కళాకారుల పట్ల మారిషస్ వారికున్న గౌరవాన్ని అభినందించాలని ఇందిరాదేవి అనేవారు. మూన్ ఆఫ్ మర్మర్-ఆంగ్ల, హిందీ త్రైమాస పత్రికకు సంపాదకురాలిగా వ్యవహరిస్తూ అనేక రచనలు చేశారు.
ఆమె ప్రచురణలలో బాగా ఆదరణ, ప్రశంసలు పొందినది ‘మిమోసాలో విడిపోవడం’. తమ ఊటీ భవంతి పెరడులో పెనవేసుకున్న మిమోసా (మన అత్తిపత్తి) మొక్కను ఎంతో హృద్యంగా ఒక స్త్రీ జీవితంతో పోలుస్తూ వర్ణించారు. స్త్రీ గుణగణాల్ని మిమోసాతో పోలుస్తూ గౌరవాన్ని, ప్రశంసల్ని, ధీరత్వాన్ని, అందంగా సున్నితంగా వర్ణించి ఎన్నో దేశాల వారి ప్రశంసలు పొందారు. ప్రతి ఇంటికి దీపం ఇల్లాలుగా మిమోసా చెట్టు లేకపోతే టీ పంట చేతికి రాదు. అలాగే ఇంట్లో స్త్రీ లేకపోతే ఆ సంసారం గొప్పస్థాయిలో నిలవదు అన్నారు ఇందిరాదేవి. తాను స్వయంగా రాసిన కవితలు, పుస్తకాలను, అనువాదాలను, ప్రయాణ విశేషాలను సొంతంగా ప్రచురించడంతో పాటు ఇతర కవులందరికీ ప్రోత్సాహం ఇవ్వాలని తెలుగు, హిందీ, ఆంగ్లం తదితర భాషల్లోకి వారి పుస్తకాలను తన ఇండియన్ లాంగ్వేజెస్ ఫోరమ్ ద్వారా ప్రచురించిన కవితా హృదయం ఇందిరాదేవి గారిది. ఓ గొప్ప విదుషీమణిగా, చెక్కు చెదరని అందంతో, ఏమాత్రం మరపురాని మేధస్సుతో అందరితో ఆప్యాయంగా మాట్లాడిన రాజకుమారి ఇందిరాదేవికి వినమ్ర నివాళులు.
( వ్యాసకర్త: విశ్రాంత ప్రధాన ఆచార్యులు)
-డాక్టర్ జీఎల్‌కే దుర్గ