వేల ఏండ్లుగా కొత్తదనమూ, మార్పు, చైతన్యం లేకుండా ఛాందస సంప్రదాయాల రీతుల్లో సాగే సమాజంపై, సాహిత్యాలపై 20వ శతాబ్దంలోనే వివిధ దేశాల్లో నిరసన సాహిత్య ఉద్యమాలు వచ్చాయి. వాటిలో ప్రముఖంగా పేర్కొనదగినది 1950లో అమెరికాలో దూసుకొచ్చిన బీట్ జనరేషన్ (బీట్నిక్స్) నిరసన సాహిత్య ఉద్యమం. ఆనాటి అవినీతిమయ వ్యవస్థ, భౌతికవాదం, యాంత్రికజీవనంపై తిరుగుబాటుగా అశ్లీల పదజాలంతో సమాజానికి షాక్ ఇచ్చిన సాహిత్య ఉద్యమం అది. ఈ బీట్నిక్స్ కవి, రచయితల నిరసన ఉద్యమంతో ప్రభావితమై తెలుగు నేలలో కుళ్లిన వ్యవస్థ, సంప్రదాయ సాహిత్యం, భావకవిత, అభ్యుదయ కవిత, వచన కవితారీతులకు వ్యతిరేకంగా షాక్ ఇవ్వటానికి 1965లో ఆవిర్భవించింది దిగంబర కవిత్వ ఉద్యమం.
ఇంగ్లీషు, తెలుగు సాహిత్యాల్లో నిష్ణాతుడు, ప్రముఖ ఆధునిక కవి, అనువాదకుడు, విమర్శకుడైన ఇంగ్లీష్ ప్రొఫెసర్ బాణాల శ్రీనివాసరావు The Beatniks and the Digambaras: A comparative Study పేరిట పై రెండు షాక్ ట్రీట్మెంట్ కవిత్వాల మధ్య తులనాత్మక అధ్యయనాన్ని తన ఎం.ఫిల్ పరిశోధనాంశంగా ఎన్నుకున్నారు.
ప్రొ.బాణాల ఎన్నుకున్న అంశాన్ని నాలుగు అధ్యాయాలు, ఆపై ముగింపుగాను వింగడించి పరిశోధన చేశారు. మొదటి అధ్యాయంలో 1950లో అమెరికాలో వెల్లువెత్తిన నిరసన సాహిత్యోద్యమం బీట్ జనరేషన్లో పాలుపంచుకున్న అలెన్ గిన్స్బర్గ్, జాక్ కేర్వాక్, విలియం బరోస్, లారెన్స్ ఫెర్లింగెట్టి, గ్రెగరి కార్సో, నీల్ కాసిడీల కవిత్వం, నవలాది రచనల పరిచయం చేశారు. గిన్బర్గ్ రాసిన కవితల్లో హౌల్ కవిత మాస్టర్ పీస్. బీట్ ఉద్యమానికి మేనిఫెస్టో అని చెప్పారు. 20వ శతాబ్దంలోని రెండవ అర్ధభాగంలో ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన నిరసన ఉద్యమాలు ‘ద యాంగ్రీ యంగ్ మెన్ మూమెంట్’ (బ్రిటన్) ‘ద గ్రే జనరేషన్’ (అమెరికా), ‘ద ఊండెడ్ యూత్ ఆఫ్ హంగరీ’ (హంగరీ) ‘ద యంగ్ పోయెట్స్ ఆఫ్ రష్యా’ (రష్యా) ‘ప్రోవో మూమెంట్ ఇన్ హాలండ్’, ‘ద హంగ్రీ జనరేషన్’ (వెస్ట్ బెంగాల్, ఇండియా) ప్రొటెస్ట్ ఇన్ హిందీ లిటరేచర్ (ఇండియా) దిగంబర కవిత్వం (తెలుగునేల, ఇండియా)లను పేర్కొన్నారు.
ఇక రెండో అధ్యా యం..‘ద పోయెట్రీ ఆఫ్ బీట్స్’: అలెన్ గిన్స్ బర్గ్ రెండో ప్రపంచ యుద్ధానంతరం అమెరికా ప్రజల అంతర్గత అశాంతిని, పెడదారి పడుతున్న యువతను చూసి కవిత్వం రాయటం ప్రారంభించాడు. 956లో హౌల్ Howl పేరిట మూడు భాగాల దీర్ఘకవితా గీతం (అమెరికా ప్రభుత్వం నిషేధించిన) (Song Threnody) ప్రచురించి అమెరికన్ సమాజానికి, సాంప్రదాయవాదులకు తన కవిత్వంతో షాక్ ట్రీట్మెంటు ఇచ్చి ప్రపంచ ప్రసిద్ధుడయ్యారు.
మూడవ అధ్యాయం ‘ద పొయెట్రీ ఆఫ్ దిగంబరాస్’లో బీట్నిక్స్ కవి రచయితల రచనలతో ప్రభావితులైన ఆరుగురు ఆగ్రహ తెలుగు యువకవులు కుల, మత, వర్గాదులను తెలిపే తమ అసలు పేర్లను పక్కకు పెట్టారు. నగ్నముని (మానేపల్లి హృషికేశవరావు), నిఖిలేశ్వర్ (కే.యాదవరెడ్డి), జ్వాలాముఖి (రాఘవాచారి), చెరబండ రాజు (బద్దం భాస్కర్ రెడ్డి), భైరవయ్య (మన్మోహన్ సహాయ్), మహాస్వప్న (కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు) అనే కొత్త పేర్లు పెట్టి, తెలుగు నేలలో అన్ని రంగాల్లో విలువలు పతనమై కుళ్లిన సమాజంపై ఆగ్రహంతో తీవ్ర అశ్లీలపదాలతో కూడిన కవిత్వంతో విరుచుకుపడ్డారు.
నాలుగో అధ్యాయం ఏ కంపారిటివ్ అనాలసిస్లో రెండవ ప్రపంచ యుద్ధానంతరం అమెరికాలో చెప్పుకోదగ్గ కవి గిన్స్ బర్గ్ అంటూ.. అతను సమాజంలోని అవినీతి, కపటం, స్వార్థం, మూఢనమ్మకాలు తమకు శత్రువులని ప్రకటించాడు. ఇక ముగింపులో 20వ శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా సాహిత్యాల్లో వచ్చిన ఉద్యమాలన్నీ ప్రపంచ యువతలోని అశాంతిని వ్యక్తపరిచాయని అన్నారు. ఈ గ్రంథంలోని సరళ శైలి పాఠకులను తలెత్తకుండా ఆసక్తికరంగా చదివిస్తుంది.
– డా.రఘువర్మ 9290093933