అమావాస్య చీకటి కమ్ముకున్న వేళ
పున్నమి వెన్నెలను కలగనడం కష్టంగా వుంది
వెలుగును ప్రశంసించడం
సాధ్యం కావడం లేదు
పెదాల మాటున మాటల్ని బంధించి
గుండెలోతుల్లో గుబుల్ని దాచుకుని
నేనిప్పుడు మౌనంగా వున్నాను
మహానగరపు మాయ ముసురుకున్న వేళ
చిక్కటి అడివిని అభినందించడం
చేత కావడం లేదు
కానీ..
హృదయం ఇంకా తేటగానే వుంది
మనసులోపల ఇంకా
తడి తడిగానే వుంది
ఎత్తిన తలింకా నిటారుగానే వుంది
అర్ధ రాత్రి కలత నిద్రలో
వెలుగును కలగంటూనే వున్నాను
నేనిప్పుడు
మౌనాన్ని మాట్లాడించే పనిలో పడ్డాను
నేస్తమా..
నాతో కలిసొస్తావా…
-వారాల ఆనంద్ ,9440501281