
యూరప్‌లో మొదటి ప్రపంచయుద్ధం తర్వాత సామాజికంగా కట్టుబాట్లను తెంచుకున్నారు. సాహిత్యంలో, కళల్లో నూతన పంథాను అనుసరించాలని ఆరాటపడ్డారు. కవిత్వంలో ‘ఫ్రీవర్స్’ను ఎన్నుకున్నారు. ఫ్రీవర్స్ అంటే.. ఛందో నియమాలు లేకుండా పాత ఇంగ్లీషు, లాటిన్ పదాలు విడిచిపెట్టి ప్రజల భాషల్లో కవిత్వం రాయటం. భారతదేశంలోనూ 1930 దశకంలో ఛాయావాదం, భావకవిత్వం మీద నిరసన తెలిపి, కవులు కొత్త పంథాను అనుసరించారు. ఛందస్సును, అలంకారాలను, సంస్కృత సమాసాలను విడిచిపెట్టి సరళమైన భాషలో ఫ్రీవర్స్ కవిత్వం రాశారు. ఫ్రీవర్స్ అనే పదాన్ని తెలంగాణలో ‘వచన కవిత’ అని అనువదించుకున్నారు. ఫ్రీవర్స్‌లో ఫ్రీ అంటే.. స్వేచ్ఛాయుతమైన, వర్స్ అంటే కవిత్వం అని అన్నారు.
ప్రాచీన తెలుగు సాహిత్యంలో గద్యము, వచనము అనే ప్రక్రియలున్నాయి. సోమనాథుడు, కృష్ణమాచార్యులు గద్యాలను, వచనాలను రచించారు. అవి ఛందో నియమాలు లేకుండా, సంస్కృత సమాసాలు లేకుండా వచనంలో రాసిన ప్రక్రియలు. ఆ ప్రాచీన వచన శబ్దాన్ని తీసుకొని మన వాళ్లు ఫ్రీవర్స్ను వచన కవిత్వంగా తెలుగు సాహిత్యంలో చెప్పుకొన్నారు. వచన కవిత్వం అంటే.. వచనం రాసి ఆ వచనాన్ని పాదాలుగా ఒకదానికింద ఒకటి పెట్టుకోవడం కాదు. కానీ వచన కవిత్వం అంటే.. ఒక నిర్వచనం లేకపోయినా అది ఒక వ్యక్తిగత అభివ్యక్తికి నిదర్శనం. సృజనాత్మక శక్తి కలిగిన ఒక కవి తన మనస్సులోని భావాలను ఒక దృక్పథంతో వ్యక్తీకరించటమే అభివ్యక్తి. వచన కవిత్వంలో అభివ్యక్తి నైపుణ్యం చాలా ప్రధానమైనది. ఆ తర్వాత కవి వీలైనంత గుప్తంగా, క్లుప్తంగా అర్థ వ్యంగ్యంతో విషయాన్ని ధ్వనింపచేస్తూ చెప్పటం వచన కవిత్వ లక్షణం.
వచన కవితలో పాదాలను కవి తన అభివ్యక్తికి అనుగుణంగా పొట్టిగా, పొడవుగా తయారుచేసుకోవచ్చు. పాదాల నిడివికి నిర్దిష్టమైన నియమం లేదు. వచన కవిత్వంలో ఊపు, తూగు ఉండాలని సి.నారాయణరెడ్డి అన్నాడు. ఊపు అంటే.. శ్రీశ్రీ చెప్పినట్లుగా కదిలేది, కదిలించేది. అంటే.. కవిత్వం పాఠకులను భావావేశానికి గురిచేయటం. తూగు అంటే.. లయ. అంటే వచన కవిత్వంలో పాఠకులకు శబ్దప్రయోగంతో ఒక అనుభూతిని కలిగించటం. కవి చెప్పదల్చుకున్న విషయాన్ని స్వచ్ఛందంగా సమర్థవంతంగా చెప్పడంతో, విసురుతో పదాలను ప్రయోగించటం వలన లయ అనేది ఏర్పడుతుంది.
వచన కవిత్వంలో నిరాడంబరత ముఖ్యమైన గుణం. అలంకారాలు లేకపోవటం. సంస్కృత సమాసాలు లేక పోవడం. పొల్లు పదాలు లేకపోవటం. నిత్య వ్యవహర భాషలో శ్రీశ్రీ రాసిన ఈ గేయాన్ని వచన కవిత్వంలో నిరాడంబరతకు ఉదాహరణగా సి.నారాయణరెడ్డి ఇచ్చాడు.
‘గదిలో ఎవరూ లేరు/ గదినిండా నిశ్శబ్దం సాయంత్రం ఆరున్నర/ గది లోపల చినుకుల వలె చీకట్లు..’చివరి పంక్తిలోని ఉపమానం సరదాగా ఉండి, అలంకారం లేదనేంత నిరాడంబరంగా రచింపబడింది. చివరి ఆ ఉపమానం పై పంక్తులకు ప్రాణమూదింది అంటారు సినారె.
వచన కవిత్వంలో కవులు ఇమేజిజం అంటే.. భావచిత్రాలను ప్రవేశపెట్టారు. ప్రతీకలు, పద చిత్రాలను కవులు పాటిస్తారు. దీంతో భావ ప్రకటనలో మునుపున్నంత సరళత లేదు. క్లిష్టత ప్రవేశించింది. అర్థం లో నూతనత్వాన్ని, సంక్షిప్తతను సాధిస్తున్నారు. భావాలను చెప్పే పద్ధతిలో గూఢతను, ప్రతీకలను ప్రవేశపెట్టి ఒక్కోసారి సామాన్యునికి అర్థం కాకుండా చేస్తున్నారు. పూర్వం వార్తలాగా ఉన్న వచన కవిత్వంలోని భావ ప్రకటన.. ఇప్పుడు ఊహకు, ఆలోచనకు స్థానంగా ఉంది. కవులు తమ సామర్థ్యాన్ని, ఊహా నైపుణ్యాలతో వచన కవిత్వాన్ని గంభీర మార్గంలో నడిపిస్తున్నారు.
వచన కవిత్వాన్ని ‘వచన గేయం’, ‘వచన గీతం’ అని శ్రీశ్రీ పిలిచాడు. పట్టాభి ‘వచన పద్యం’ అన్నాడు. సోమసుందర్ ‘ముక్తఛందము’ అన్నాడు. వరవరరావు ‘స్వచ్ఛంద కవిత్వం’ అన్నాడు. ‘వచన కవిత’ అని కుందుర్తి, కేవీఆర్, కోవెల సుప్రసన్న మొదలైన వారన్నారు. రూపం విషయంలో ఏ నిబంధనలు లేని వచనంలో రాసే కవిత్వానికి ఆఖరికి ‘వచన కవిత’ అనే పేరే స్థిరపడింది. 1937లో శ్రీశ్రీ..‘స్మశానాల వంటి నిఘంటువుల దాటి/ వ్యాకరణాల సంకెళ్లు విడిచి, ఛందస్సుల సర్పపరిష్వంగం వదిలి..’ కవిత్వం రాస్తానన్నాడు. పట్టాభి కూడా తిరుగుబాటును ప్రబోధిస్తూ.. ‘అనుసరిస్తాను నవీన పంథా కానీ/ భావకవిని మాత్రం కాన్నేను/ సహంభావ కవిని..’ అని నిర్భయంగా, నిరంకుశంగా చెప్పుకొన్నాడు.
వచన కవితకు మంచి శీర్షిక, ఎత్తుగడ, నిర్వహ ణ, వస్తువు, దృక్పథం ఉండాలి. ప్రతి కవి తన కవితకు ఒక విలక్షణమైన నిర్మాణాన్ని రూపొందించుకోవాలి. ఇటువంటి నిర్మాణపు లక్షణాలతో ఆధునిక కవులు చాలా ఎక్కువగా వచన కవిత్వం రాస్తున్నారు. చుట్టూ ఉన్న సమాజంలో, ప్రపంచంలో జరుగుతున్న విషయాల గురించి తమ భావాల ను, అనుభూతులను ‘వచన కవిత్వం’ రూపంలో వ్యక్తీకరిస్తున్నారు. 1960 దశకంలో వచన కవిత్వానికి కుందుర్తి ఎక్కువ ప్రచారం కలిగించారు. ఆ తర్వాత వచన కవిత్వం ఇప్పుడు ఒక విరాట్ స్వరూపాన్ని సంతరించుకున్నది.
-ముదిగంటి సుజాతారెడ్డి , 99634 31606