
తెలంగాణలో ప్రాంతీయ అస్తిత్వ స్పృహ గత శతాబ్ది చివరి దశకంలోనే (తిరిగి) మొలకెత్తింది. స్పష్టమైన లక్ష్యంతో రాజకీయ ఉద్యమం మొదలైన తర్వాత, అది అస్తిత్వవాదంగా సాహిత్యంలో స్థిరపడింది.
ప్రత్యేక రాష్ట్ర సాధనోద్యమం తొలిదశ నుంచి ఆత్మగౌరవ పోరాటాల స్ఫూర్తితో భాషాసాహిత్య సాంస్కృతిక పోరాటాలు కూడా సాగుతూ వచ్చాయి. ఇవి రెండూ పరస్పరం ప్రభావితం చేసుకొంటూనే, పరస్పర పోషకంగా జమిలిగా సాగాయి. భావజాల ప్రసార మాధ్యమాలుగా భాషా సాహిత్య సాంస్కృతిక రంగాలు గుణాత్మక పాత్రలు పోషించాయి.
అవహేళనలకు, వివక్షకు గురైన తెలంగాణ భాష.. ఉద్యమాల ఫలితంగా ఆత్మగౌరవంతో నిలిచి గెలిచింది. భావవ్యాప్త దశలోనే అనివార్య పరిస్థితుల్లో తెలంగాణ భాషలోని కొన్ని రచనలను నాటి పాలకులు పాఠ్యాంశాల్లో చేర్చాల్సి వచ్చింది. రాష్ర్టావతరణ అనంతరం ఇక్కడి సాహిత్య ప్రక్రియల విస్తృతి, సాహిత్య సాంస్కృతిక సంపన్నత ప్రతిఫలించేవిధంగా, అన్ని తరగతుల పాఠ్యాంశాలు తీర్చిదిద్దబడినాయి. తెలంగాణ భాషకు తనదైన వ్యాకరణం ఉన్నదని, ఇక్కడి జాతీయాలు, నుడికారాలు కూడా సొగసైనవేనని భాషావేత్తలు విశ్లేషించి నిరూపిస్తున్నారు. తెలంగాణ పదకోశాలు, ఇతర నిఘంటువులు రూపొందాయి. మరుగున పడుతున్న పద సంపదను రాబోయేతరాలకు అందించడంలో ఇవెంతో ఉపయోగపడతాయి. కొందరు తెలంగాణేతరులు అవమానించిన ఈ భాష, నేడు సినిమా నాయికా నాయకుల భాషగా మారిందంటే, దానికి కారణాలు స్పష్టమే. ఉద్యమ నేపథ్యంలోనే, భాషకు సంస్కృతికి ఉన్న అవినాభావ బంధం సామాన్య ప్రజలకు తెలిసివచ్చింది. ఆధిపత్య భావజాల దృష్టితో కాకుండా, భాషా శాస్త్రీయ దృష్టితోనే భాషలను పరిశీలించాలనే అవగాహన వ్యాపించింది.
ఉద్యమ పరిణామ క్రమంలోనే, విస్మరణ, వివక్ష, వక్రీకరణలకు గురైన చరిత్ర, సాహిత్య సాంస్కృతిక మూలాల వైపు విమర్శకుల, పరిశోధకుల దృష్టి మరలింది. నాటి చరిత్రకారుల అలక్ష్యం, నిరాసక్తత, ఉదాసీనత, అజ్ఞానాల మూలంగా ఉపేక్షింపబడిన వివిధ సాహిత్యరంగాల మీద, నవ్య తెలంగాణ చరిత్ర నిర్మాణ దృష్టితో పరిశోధనలు మొదలైనాయి. మరుగునపడిన ప్రాచీన, ఆధునిక కవుల రచనలు వెలుగులోకి తేబడినాయి. నాటి చరిత్రకారులు విస్మరించిన ఇక్కడి తత్వ, సంకీర్తన, యక్షగాన కవుల రచనల మీద పరిశోధనలు జరిగాయి, జరుగుతున్నాయి.
ఆంధ్ర సాహిత్య చరిత్రకారులు చూడలేకపోయిన, చూడ నిరాకరించిన, ఉపేక్షించిన, ఇతరేతర కారణాలతో వక్రీకరించిన అనేక అంశాలను బయటపెట్టి, అసలైన నిజాలను సాక్ష్యాధారాలతో పరిశోధకులు ప్రదర్శిస్తున్నారు. సాహిత్యచరిత్రలోని తెలంగాణకు సంబంధించిన ఖాళీలను పూరిస్తున్నారు. ఆంధ్ర సాహిత్యచరిత్రకారులు చేసిన దోషాలనే, ఆంధ్ర చరిత్రకారులు కూడా చేశారు. అలాంటి లోపాలను, దోషాలను, ఇక్కడి సామాజిక రాజకీయ చరిత్ర పరిశోధకులు సవరిస్తున్నారు.అనేక రూపాల సాక్ష్యాధారాల పూర్వకంగా తెలుగు భాషాసంస్కృతుల మూల భూమి తెలంగాణ అని నిరూపణయింది. తెలుగుకు, ప్రాచీన భాషగా గుర్తింపు లభించడంలో మన పరిశోధకుల కృషి పేర్కొనదగినది. ఆంధ్ర సాహిత్యచరిత్ర పరిణామ క్రమం, తెలంగాణకు పూర్తిగా వర్తించదన్న తెలివిడి విస్తృతంగా వ్యాపించింది. ‘నిజాం రాజుల కాలమంతా చీకటి యుగమే’ అనే నిరాధార ఆరోపణలను పరాస్తం చేస్తూ, నిజాలను నిగ్గు తెలుస్తూ, ధనాత్మక, రుణాత్మక అంశాల మీద అర్థవంతమైన చర్చలు జరిగాయి. గత శతాబ్ది పూర్వార్ధంలో, ఆధునికత వైపు అడుగులు వేస్తున్న తెలంగాణ రాజకీయ, సామాజిక, సాంస్కృతిక పరిణామాల మీద పరిశోధనలు జరిగాయి. ఆధునిక చైతన్యాన్ని ప్రోది చేయడంలో గ్రంథాలయ, సంస్కరణ, దళిత బహుజన ఉద్యమాల, పుస్తకమాలల పాత్రను, విశేషమైన తోడ్పాటును పరిశోధకులు తెలియజెప్పారు. హైదరాబాద్ రాష్ట్ర దశ నుంచి, ఆంధ్రప్రదేశ్ అవతరణ వరకు, ఆ తర్వాత జరిగిన కుట్రలను, కుతంత్రాలను బయటపెడుతూ, ఆధునిక తెలంగాణ చరిత్రను పునర్నిర్మించుకోవాల్సిన అవసరాన్ని తెలుపుతూ వచ్చిన రచనలు ప్రత్యేకమైనవి.
తెలంగాణ సాయుధ పోరాటం నాటి ఉద్యమపాటలు ప్రధాన సాహిత్య స్రవంతిలో సాహిత్యంగా పరిగణింపబడలేదు. పద్యం నుంచి గేయానికి మరలడానికే ఇక్కడి కవులకు చాలాకాలం పట్టింది. 1950ల నుంచి 1960 ప్రాంతం వరకు పద్యం, గేయం సమాంతరంగా కొనసాగాయి. గత శతాబ్దపు అరవయ్యవ దశకపు చివరి దశలోనే గేయగంధి వచనం వెనుకబడి వచనకవిత్వం స్థిరపడింది. నాటికి సుమారుగా నాలుగు దశాబ్దాల ముందుగానే ఆంధ్రలో వచనకవిత్వం ప్రారంభమైంది. ఒక్క ఇరవయ్యవ శతాబ్దపు ఇరు ప్రాంతాల సాహిత్య పరిణామ దశలను పరిశీలించినా, ఇరు ప్రాంతాల సాహిత్య పరిణామక్రమం భిన్నమైందని తేలికగానే తెలిసిపోతుంది.
తెలంగాణను పాలించిన రాజవంశాల క్రమంలో కొందరు, శతాబ్దాల వారీగా మరికొందరు పరిశోధకులు, ప్రముఖ కవుల రచనలను సేకరించడానికి, వారి ప్రాశస్త్యాన్ని వివరించడానికి ప్రయత్నించారు. వీటి ఆధారంగా, ప్రక్రియాపరంగా ఇక్కడి కవిత్వ (సాహిత్య) పరిణామదశలు, వాటికి కారణాలు, నేపథ్యాలు స్పష్టం కావలసి ఉన్నది.
ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమీ, తెలుగు అకాడమీ విలువైన పరిశోధనా గ్రంథాలను, అనేక మోనోగ్రాఫ్లను ముద్రించాయి. తెలంగాణ తేజోమూర్తుల ప్రభలను నలుమూలలకు వ్యాప్తి చేయడంలో, వివిధ దృశ్య, శ్రవ్య, ప్రదర్శనాకళలను నవజీవంతో నింపడంలో భాషా సాంస్కృతిక వ్యవహారాలశాఖ చేస్తున్న కృషి కూడా గుర్తించదగినది.
గత వెయ్యేండ్ల రాజకీయ పరిణామక్రమాన్ని విశ్లేషించి, నిర్దిష్ట దశలను నిర్ధారిస్తూ సమగ్ర సాహిత్య చరిత్ర నిర్మాణం జరుగవలసి ఉన్నది. ఇప్పటికే ఆ దిశగా కొందరు కృషిచేశారు, చేస్తున్నారు. ఈ కృషి మరింత లోతుగా, విస్తృతంగా, వేగంగా జరుగాల్సిన ఆవశ్యకత ఉన్నది.