మనదేశంలో ప్రేమ, పెళ్లి అంటే.. ‘ఒకరి కోసం ఒకరు’ అనే భావన తరతరాలుగా వేళ్లూనుకుపోయింది. ‘ఏడడుగుల బంధం’ అంటే.. జీవితాంతం ఒక్కరితోనే తోడుండటం అనే సాంప్రదాయం బలంగా ఉన్నది. కానీ, మారుతున్న కాలంతోపాటు భారతీయుల ఆలోచనల్లోనూ పెనుమార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా ‘మోనోగమీ’ (ఒక్కరితోనే సంబంధం ఉండటం) అనే పద్ధతి పట్ల.. నవతరంలో క్రమంగా ఆసక్తి తగ్గుతున్నదట. తాజా సర్వే గణాంకాలు ఇదే విషయాన్ని చెబుతున్నాయి. ప్రస్తుతం ఓపెన్ రిలేషన్షిప్స్/ నాన్-మోనోగమీకి చాలామంది ఆమోదయోగ్యం తెలుపుతున్నారట. అయితే, ఈ మార్పు కేవలం మెట్రో నగరాలకే పరిమితం కాలేదు.. చిన్న పట్టణాల్లో కూడా ఇదే ట్రెండ్ కనిపిస్తుండటం ఆశ్చర్యకరం. అసలు మన బంధాల మధ్యకు వస్తున్న ఈ కొత్త ‘ట్విస్ట్’ ఏంటి?
ప్రముఖ ఎక్స్ట్రా మారిటల్ డేటింగ్ ప్లాట్‌ఫామ్ ‘గ్లీడెన్’ దేశవ్యాప్తంగా 1,510 మందిపై జరిపిన సర్వేలో కొన్ని కళ్లు చెదిరే నిజాలు బయటపడ్డాయి. దాదాపు 69 శాతం మంది భారతీయులు ఇప్పుడు ‘ఓపెన్ రిలేషన్షిప్స్’ పట్ల సమాజంలో ఆదరణ పెరుగుతున్నదని అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు ‘వన్ ఉమన్- వన్ మ్యాన్’ అనే కాన్సెప్ట్‌కు ఉన్న క్రేజ్ క్రమంగా తగ్గుముఖం పడుతున్నదని ఈ సర్వే స్పష్టం చేస్తున్నది. సాధారణంగా ఇటువంటి మార్పులు కేవలం మెట్రో నగరాల్లోనే ఉంటాయని చాలామంది అనుకుంటారు. కానీ, ఈ సర్వే ఫలితాలు ఆ అంచనాలను తలకిందులు చేశాయి. ఢిల్లీ, ముంబై లాంటి నగరాలే కాదు.. జైపూర్, పాట్నా లాంటి ద్వితీయశ్రేణి నగరాల్లోనూ ప్రజల ఆలోచనా విధానం మారుతున్నదట. ఢిల్లీలో 80 శాతం మంది ఈ మార్పును అంగీకరిస్తుండగా.. ఆశ్చర్యకరంగా గువాహటిలో 86 శాతం మంది నాన్-మోనోగమీని సమర్థిస్తున్నారు. టైర్-1 నగరాల్లో ఆమోదయోగ్యత 68 శాతంగా ఉంటే, టైర్-2 నగరాల్లో అది 70 శాతంగా నమోదైంది. అంటే, నగరాల మధ్య ఉన్న అంతరం క్రమంగా తగ్గుతూ.. ఓపెన్ మైండెడ్ ఆలోచనలు దేశమంతటా పాకుతున్నాయి.
లైఫ్ స్టయిల్ మారడం, ఎమోషనల్ అవేర్నెస్ పెరగడం.. అలాగే, బంధాల్లో నిజాయతీకి ప్రాధాన్యం ఇవ్వడం లాంటి కారణాల వల్ల ఈ మార్పు వస్తున్నదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. రొటీన్ లైఫ్‌లో వచ్చే అసంతృప్తిని కవర్ చేయడానికి అబద్ధాలు ఆడటం కంటే.. పరస్పర అంగీకారంతో ఎమోషనల్ ఫ్రీడమ్ తీసుకోవడం మంచిదని చాలా జంటలు భావిస్తున్నాయి. కేవలం గొడవలు లేదా రహస్యాల మధ్య బతకడం కంటే, స్పష్టమైన కమ్యూనికేషన్‌తో కూడిన ఓపెన్ రిలేషన్షిప్స్లో ఉండటమే గౌరవప్రదమని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ చిత్రమైన మార్పు గురించి నిపుణులు మాట్లాడుతూ.. మారుతున్న ఈ బంధాల తీరుతెన్నులు మన విలువలను తిరస్కరించడం కాదని, అవి పరిణామం చెందుతున్నాయని అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా.. ఒకరి వ్యక్తిగత స్వేచ్ఛను, అభిప్రాయాలను గౌరవించడం అనేది నాగరిక సమాజ లక్షణం. అయితే, ఈ ఓపెన్ రిలేషన్షిప్స్ వల్ల కుటుంబ వ్యవస్థలపై ఎటువంటి ప్రభావం పడుతుందనేది భవిష్యత్తే తేల్చాలి.