ఈ రోజుల్లో యూరిక్ యాసిడ్ సమస్య లేనిది ఎవరికి! అనేకమంది దీనివల్ల సతమతమవుతున్నారు. ఇక ఈ సమస్యతో బాధపడేవారు తినే ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అయితే ‘రోజూ కాఫీ తాగడం యూరిక్ యాసిడ్ కు మంచిదా? కాదా?’ అనే సందేహాలు అందరికీ కలుగుతుంటాయి. కాఫీ తాగడం వల్ల యూరిక్ యాసిడ్ సమస్య వచ్చే ప్రమాదం తగ్గుతుందని పలు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. శరీరంలో ప్యూరిన్లు అనే రసాయనాలు జీర్ణమైనప్పుడు వ్యర్థ పదార్థంగా యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. సాధారణంగా మూత్రపిండాలు దీనిని రక్తం నుంచి వడకట్టి మూత్రం ద్వారా బయటికి పంపుతాయి.
శరీరం ఎకువ యూరిక్ యాసిడ్‌ను తయారుచేసినా, కిడ్నీలు దాన్ని సరిగ్గా బయటికి పంపలేకపోయినా రక్తంలో యూరిక్ యాసిడ్ పేరుకుపోతుంది. దీనివల్ల కీళ్లలో తీవ్రమైన నొప్పి, వాపు, చర్మం ఎర్రబడటం లాంటి లక్షణాలు వస్తాయి. అయితే క్రమం తప్పకుండా కాఫీ తాగేవారిలో గౌట్ వచ్చే ముప్పు తకువగా ఉంటుందని ఇప్పటికే పలు అధ్యయనాలు పేర్కొన్నాయి. కాఫీ తాగడం వల్ల రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయులు తగ్గకపోయినా అది గౌట్ వ్యాధిగా మారకుండా అడ్డుకుంటున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు.
కాగా కాఫీలో ఉండే పాలీఫెనాల్స్, క్లోరోజెనిక్ యాసిడ్, కెఫిన్‌తో పాటు ఇతర సమ్మేళనాలు శరీరం యూరిక్ యాసిడ్‌ను ప్రాసెస్ చేసే విధానాన్ని ప్రభావితం చేస్తాయి. మొత్తంగా.. హై యూరిక్ యాసిడ్ లేదా గౌట్ ఉన్నవారు కాఫీ తాగడం హానికరం కాదు. అయితే కాఫీని పంచదార లేకుండా లేదా తకువ చకెరతో, మితంగా మాత్రమే తీసుకోవాలి. అలాగే సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు కేవలం ఆహార మార్పులపైనే ఆధారపడకుండా వైద్యుడిని సంప్రదించి అవసరమైన మందులు వాడటం తప్పనిసరి.