పిల్లలు ఏదైనా ఇష్టమైన వస్తువునో, ఆటబొమ్మనో చూడగానే.. ఇంటికి రాగానే ఉత్సాహంగా అది కావాలంటూ తల్లిదండ్రులను అడిగేస్తారు. ఆ వెంటనే ‘నో’ అనేస్తారు చాలామంది పేరెంట్స్. అయితే ఆ మాట పిల్లలపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. చిన్నారులు ఇష్టపడే వాటికి మనం అడ్డంకి చెప్పడం వల్ల వాళ్లు నిరాశకు గురవుతారు. కోపంగా చెప్పడం మూలంగా తమను ఎవరూ అర్థం చేసుకోవడం లేదని బాధపడతారు. వద్దనే పదం కాకుండా సున్నితంగా ప్రేమతో చెప్పడం అలవర్చుకోవాలి.
దాంతో చిన్నతనం నుంచే వారికి మంచి స్వభావం పెంపొందుతుంది. హానికరమైన వస్తువేదైనా కావాలని అడిగినపుడు..కోపగించుకోకుండా ఆ వస్తువులకు ప్రత్యామ్నాయాలను ఎంపిక చేసి ఇవ్వండి. అడిగిన వెంటనే వద్దు అనే మాట బదులు ఎందుకు వద్దంటున్నారో సులభమైన వివరణనివ్వండి. కొన్నిసార్లు పిల్లలు పరిమితులు దాటి పరీక్షిస్తారు. అటువంటి సందర్భాల్లో మీరు ప్రశాంతంగా, స్థిరంగా ఉంటే అదే వారికి భరోసానిస్తుంది. నచ్చచెప్పే సందర్భంలో గౌరవప్రదమైన భాషను వాడండి.