Micro Cheating | మైక్రో చీటింగ్.. చిన్నగా మొదలై, బంధాలను బలహీన పరుస్తున్నది. పచ్చటి కాపురాల్లో నిశ్శబ్దంగా చిచ్చుపెడుతున్నది. భాగస్వామి తెలిసీతెలియకుండా చేసే చిన్నచిన్న పొరపాట్లే.. పెద్దపెద్ద సమస్యలుగా మారుతున్నాయి. కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాయి. అసలు.. ఏమిటీ మైక్రో చీటింగ్!? దీనివల్ల కాపురాలు ఎందుకు కూలుతున్నాయి?
అన్ని విషయాలనూ భార్యతో పంచుకునే భర్త.. కొన్నిటిని మాత్రం ఆమెకు అస్సలు తెలియనివ్వడు. పొద్దంతా ప్రేమగా మెలిగే భార్య.. రాత్రిపూట ఎవరితోనో చాటింగ్ చేస్తుంటుంది. మాజీ భాగస్వామితో మళ్లీ టచ్‌లోకి వచ్చేవారు కొందరైతే.. ఆఫీస్ కొలీగ్స్‌తో రాసుకుపూసుకు తిరిగేవారు మరికొందరు. ఇలా, భాగస్వామిని పూర్తిగా నిర్లక్ష్యం, మోసం చేయకుండా.. చిన్నచిన్న తప్పులు చేస్తుండటమే.. ‘మైక్రో చీటింగ్’. ఇది అక్రమ సంబంధం అంత స్పష్టంగా ఉండదు. భావోద్వేగాల పరంగా.. మోసపూరితంగానూ కనిపించదు. కానీ, ఈ తరహా చిన్నచిన్న మోసాలు.. ఇప్పుడు చాపకింద నీరులా వ్యాపిస్తున్నాయి. ఎన్నో కాపురాలను కూలుస్తున్నాయి. నిజానికి ఇలాంటి వాళ్లంతా తాము హద్దు దాటుతున్నామని గ్రహించడం లేదని నిపుణులు చెబుతున్నారు. చాలామందికి చెడు ఉద్దేశాలు కూడా ఉండవని అంటున్నారు. కానీ, ఇలాంటి చిన్నచిన్న తప్పులతోనే దంపతుల మధ్య నమ్మకం, భావోద్వేగ భద్రత దెబ్బతింటున్నాయి. దీర్ఘకాలంలో విడాకులకూ దారితీస్తున్నాయి. ఈ క్రమంలో ఏఏ విషయాలు మైక్రో చీటింగ్స్ కిందికి వస్తాయో మానసిక నిపుణులు చెబుతున్నారు.
☞ మాజీ భాగస్వామితో మళ్లీ టచ్‌లోకి రావడం. వారితో రహస్యంగా మాట్లాడటం.
☞ భాగస్వామికి అసౌకర్యంగా అనిపించేలా సంభాషించడం, సామాజిక మాధ్యమాల్లో చాటింగ్ చేయడం.
☞ భాగస్వామితో కాకుండా వేరేవ్యక్తితో సరసాలాడటం.
☞ ఆఫీస్ కొలీగ్స్‌తో అతి సన్నిహితంగా మెలగడం.
☞ ఇతరులకు విలువైన వస్తువులు బహుమతిగా ఇవ్వడం. పదేపదే ఆర్థిక సాయం చేయడం.
☞ భాగస్వామితో కాకుండా వేరేవారితో నమ్మకంగా ఉండటం.
☞ డేటింగ్ సైట్లలో చేరడం.
☞ ఇతరుల పట్ల లైంగిక ఆసక్తి చూపడం
భాగస్వామి ‘మైక్రో చీటింగ్’ చేస్తున్నారని గుర్తించడం కొంచెం కష్టమే! ఎందుకంటే.. ఇందులోని చాలా విషయాలు బయటికి మామూలుగానే కనిపిస్తాయి. లోతుగా అర్థం చేసుకున్నప్పుడే.. అసలు సంగతి బయటపడుతుంది. ఉదాహరణకు, మీ భాగస్వామి కొన్నిరోజులుగా ఒక్క సహోద్యోగితోనే ఎక్కువ సమయం గడుపుతున్నారని మీకు తెలిస్తే.. అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ, లంచ్ బ్రేక్‌లో వారిద్దరే కలిసి భోజనం చేస్తున్నారనీ, ఆఫీస్‌కు ‘పికప్-డ్రాపింగ్’ చేస్తున్నారని కూడా తెలిస్తే.. మీ నమ్మకం సడలడం మొదలవుతుంది. ఇక ఆఫీస్ లేని సమయంలోనూ తనతో చాటింగ్ చేయడం, తనకు సంబంధించిన విషయాలను మీ దగ్గర దాచిపెట్టడం లాంటివి గమనిస్తే.. భాగస్వామి ‘మైక్రో చీటింగ్’ చేస్తున్నాడని అర్థం చేసుకోవచ్చట. అయితే, ‘మైక్రో చీటింగ్’ ప్రవర్తనల వల్ల పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ప్రభావితమవుతారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ తరహా భావోద్వేగపరమైన ఇబ్బందులను ఆడవాళ్లే ఎక్కువగా అనుభవించవచ్చని వెల్లడిస్తున్నాయి. ఇలాంటి విషయాలపై ఇద్దరూ కలిసి చర్చించుకుంటే.. సమస్య పరిష్కారం అవుతుందని అంటున్నారు.
చివరిగా.. ‘మొక్కై వంగనిది మానై వంగునా!?’ అనే సామెత పెద్దలకూ వర్తిస్తుంది. ‘మైక్రో చీటింగ్స్’ చేస్తున్నవారిని మొదట్లోనే గుర్తించాలి. చిన్నచిన్నగా మోసం చేయడం మొదలైనప్పుడే.. వారి ఆగడాలను అరికట్టాలి. అప్పుడే బంధాలు విచ్ఛిన్నం కాకుండా ఉంటాయి.