మానవ మేధస్సుకు అర్థం కానిది మాయ.శాస్ర్తానికి అంతుచిక్కనిది బ్రహ్మపదార్థం.కానీ, సైన్స్ పరిధి పెరిగే కొలది.. మాయలన్నీ పటాపంచలు అవుతున్నాయి. బ్రహ్మపదార్థం లోగుట్టు బయటపడుతున్నది.టెక్నాలజీలో వస్తున్న మార్పులు పరిశోధనల్లో ముందడుగుకు కారణం అవుతున్నాయి. శాస్త్రవేత్తల నిరంతర అధ్యయనం ప్రపంచాన్ని కొత్తగా అర్థం చేసుకోవడానికి ఉపకరిస్తున్నది.అంతరించిపోయిన మానవ కుటుంబాల గురించి తెలుసుకోవడం కావచ్చు.. ప్రాచీన అవశేషాల ఆధారంగా వారి జీవన విధానాన్ని అంచనా వేయడమే అవ్వొచ్చు.. మంచు మనిషి ఎలా జీవించాడు? రోమన్ కట్టడాలు అంత పటిష్ఠంగా ఎందుకు ఉంటాయి? మమ్మీలను భద్రపరచటానికి ఈజిప్షియన్లు ఏం చేసేవాళ్లు?ఇలాంటి కుతూహలాన్ని రేకెత్తించే ప్రశ్నలకు నేటి సైన్స్ పకడ్బందీగా సమాధానాలు రాబడుతున్నది. మనిషికి పందిగుండెను అమర్చడం, అసలు చెవిని పోలిన కొత్త చెవిని 3డీ ప్రింటింగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేపట్టడం, స్టీలు కంటే దృఢమైన పదార్థాన్ని కనుగొనడం ఇవన్నీ రాబోయే రోజుల్లో సైన్స్ అధిరోహించనున్న శిఖరానికి సోపానాలే!
గతాన్నిఅర్థం చేసుకోవడంలో సైన్సు విప్లవాత్మకంగా మారుతున్నది. ఎముకలు, దుమ్ములో దాగి ఉండే డీఎన్ఏ ద్వారా అద్భుతమైన రహస్యాలు వెల్లడవుతున్నాయి. అలాగే కృత్రిమ మేధ ద్వారా మరుగునపడిన స్క్రిప్టులను అర్థం చేసుకోగలుగుతున్నారు. పళ్లు, వంటపాత్రలలో అవశేషాలను, భవన నిర్మాణ ఉత్పత్తులను రసాయనిక విశ్లేషణ చేయటం ద్వారా అప్పటి ప్రజలు తిన్న ఆహారం, ఇంటి నిర్మాణ పద్ధతులను అంచనా వేయగలుగుతున్నారు.
200 ఏళ్ల తర్వాత తీరిన కోరిక
జర్మన్ స్వరకర్త, పియానిస్టు, పాశ్చాత్య స్వరకర్తలందరిలోకి ప్రసిద్ధుడైన లుడ్విగ్ వాన్ బీథోవెన్ 1827లో కన్నుమూశాడు. అప్పటికి ఆయన వయసు 56 ఏళ్లు. మరణానికి పదేళ్ల ముందునుంచి అతను తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నాడు. వినికిడి లోపం, జీర్ణాశయ సమస్యలు, కాలేయ సమస్యలను ఎదుర్కొన్నాడు. దశాబ్దకాలం పాటు చెవిటివానిగానే మిగిలిపోయాడు. ప్రజల మధ్య ప్రదర్శనలు ఇవ్వటం మానేసి కంపోజింగ్‌లో మునిగిపోయాడు. ఆ సమయంలో రూపంలోనూ, ఆవిష్కరణలోనూ చిరకాలం నిలిచిపోయేలా సంగీతాన్ని ఆవిష్కరించాడు.
అయితే ఇక్కడ బీథోవెన్ గురించి మనం చెప్పుకొంటున్న విషయం సంగీత రంగంలో ఆయన గొప్పతనం గురించి కాదు! 1802లో బీథోవెన్ తన సోదరులకు ఓ లేఖ రాశాడు. తను మరణించిన తర్వాతైనా తన అనారోగ్యానికి సరైన కారణం కనుగొనవలసిందిగా అందులో అభ్యర్థించాడు. తనకు వైద్యం చేసిన డాక్టర్ గురించి చెప్పుకొచ్చాడు. ఎంతో వేదన నిండిన ఈ లేఖను బీథోవెన్ మరణించిన తర్వాత ఆయన ఇంట్లో కనుగొన్నారు. ఈ మూడు పేజీల లేఖలో.. తాను ఏకాంతంగా గడపటానికి కారణం ఏమిటో తెలుసుకుని ప్రపంచం తనను అర్థం చేసుకోవాలని బీథోవెన్ ఆశించాడు.
ఆస్ట్రియా రాజధాని వియన్నా దగ్గర్లోని హైలిగన్ గ్రామం పేరుమీదుగా ఈ లేఖకు ‘హైలిజన్ స్టాన్ టెస్టమెంట్’ అని పేరు పెట్టారు. బీథోవెన్ వేసవి సమయంలో ఈ ఊళ్లో గడపడం గమనార్హం. ఈ సంగతి అలా ఉంచితే, బీథోవెన్ అభ్యర్థనను గౌరవించటానికే అన్నట్టు, ఆయన మరణించిన 200 ఏళ్ల తర్వాత శాస్త్రవేత్తలు భద్రపరిచిన అతని జుట్టు నుంచి డీఎన్ఏను సేకరించారు. ఈ పరిశోధనలో ఆయన మరణానికి కచ్చితమైన కారణాలను తేల్చలేకపోయారు. కానీ, ఆ జన్యు సమాచారం ఆధారంగా బీథోవెన్ ఆటో ఇమ్యూన్ కండిషన్, ఉదరకుహర వ్యాధి (సెలియాక్ డిసీజ్), చక్కెర స్థాయులు పడిపోవటం (లాక్టోజ్ ఇంటోలరెన్స్), పేగుల సమస్య (ఇరిటెబుల్ బోవెల్ సిండ్రోం)తో బాధపడి ఉంటాడని గుర్తించారు. అంతే కాకుండా వాళ్ల కుటుంబంలో వివాహేతర సంబంధం చోటు చేసుకుని ఉండొచ్చని అనుమానం వ్యక్తంచేశారు.
మమ్మీలను ఎలా భద్రపరిచారు?
ఈజిప్షియన్లు చనిపోయిన వారిని భద్రపరచటానికి పగిలిపోయిన కుండలతోపాటు కొన్ని పదార్థాలను వాడేవారని శాస్త్రవేత్తలు ఇటీవల గుర్తించారు. ఆ పదార్థాల్లో మిగిలిపోయిన సేంద్రియ అవశేషాలను పరిశోధించి ఈ విషయాన్ని గుర్తించారు. మృత శరీరాల నుంచి దుర్గంధం వ్యాపించకుండా, పార్థివ దేహాలను ఫంగస్, బ్యాక్టీరియాల బారినపడకుండా పరిరక్షించేందుకు రకరకాల పదార్థాలను వాడేవారని గ్రహించారు. ఆ పదార్థాలు ప్రధానంగా మొక్కల నుంచి తీసిన నూనెలు.. జూనిడోపర్, సైప్రస్, సీడర్లతోపాటు పిస్టాచియా చెట్టు, జంతువుల కొవ్వు, లక్క అని నిర్ధారణకు వచ్చారు. వీటిని కేవలం ఈజిప్టు నుంచే కాకుండా దూరప్రాంతాల నుంచి కూడా తెప్పించుకునేవారని గుర్తించారు. చనిపోయిన వారిని ఎంబామ్ చేయటానికి ఈజిప్షియన్లు ఏం చేసేవారో ఇప్పుడు తెలుసుకోవడం ఓ గొప్ప ముందడుగుగానే భావిస్తున్నారు.
ప్రాచీన అవశేషాల నిర్ధారణ
2008లో స్పెయిన్‌లోని సెవియా నగరంలో ఐదువేల సంవత్సరాల నాటి అస్థిపంజరాన్ని ఒక సమాధి నుంచి వెలికితీశారు. ఆ సమాధిలో క్రిస్టల్ బాకు, ఇతర కళాఖండాలను కూడా గుర్తించారు. అస్థిపంజరం విడిభాగాల ఆధారంగా అది పురుషునిదా, స్త్రీదా అని అంచనా వేయటానికి సంప్రదాయ పద్ధతులను అనుసరించారు. పురుషుడిగా భావించారు. కానీ, తాజాగా టూత్ ఎనామిల్‌ను ప్రధానంగా లింగ నిర్ధారణకు ఉపయోగపడే అమెలోజెనిన్ ఆధారంగా ఆ అవశేషాలు మహిళవి అని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. చరిత్ర పూర్వ సమాజాలను అర్థం చేసుకోవటానికి భవిష్యత్తులో ఈ విధానం బాగా ఉపకరిస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
Deer Tooth Pendant
రోమన్ కాంక్రీట్ పటిష్ఠత వెనక..
రోమన్ సామ్రాజ్యం పటిష్ఠమైన భవన నిర్మాణాలకు పెట్టింది పేరు. కొన్ని దశాబ్దాల పాటు భూకంపాలను, ప్రకృతి విపత్తులను తట్టుకొని చెక్కుచెదరకుండా నిలవటం వాటి ప్రత్యేకత. ఇందులో ఉండే రహస్యాలను శోధించాలని సెంట్రల్ ఇటలీలోని సిటీవాల్ నుంచి 2000 సంవత్సరాల కిందటి కాంక్రీటు నమూనాలను సేకరించారు. ఒక బృందం దీనిపై అధ్యయనం చేపట్టింది. కాంక్రీటులోని తెల్లటి అచ్చులు (లైమ్ క్లాస్ట్)దాని పటిష్ఠతకు కారణమని గుర్తించారు. అంతకుముందు ఈ తెల్లటి పదార్థం ప్రత్యేకతను శాస్త్రవేత్తలు అంతగా పట్టించుకోలేదు.
కృత్రిమమేధతో స్క్రోల్స్ అధ్యయనం
దాదాపు రెండువేల సంవత్సరాల క్రితం వెసూవియస్ అగ్నిపర్వతం బద్దలైనప్పుడు సుమారు 1100 నమూనాలు (స్క్రోల్స్) భూమిలో కూరుకుపోయాయి. అగ్నిపర్వతం బూడిదలో కూరుకుపోయిన వాటిని తర్వాత రోజుల్లో బయటకు తీసి శాస్త్రవేత్తలు వాటిపైన అధ్యయనం చేపట్టారు.‘హెర్య్యూలియన్ స్క్రోల్స్’గా వాటిని పిలుస్తారు. శాస్త్రవేత్తలు అధ్యయనం చేపట్టిన అత్యంత ప్రాచీనమైన వస్తువులుగా ఇవి గుర్తింపు పొందాయి. వాటిపైన లిపి, నమోదైన అంశాలు ఇప్పటివరకూ మిస్టరీగా ఉన్నాయి. ఇటీవల నెబ్రాస్కా యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ విద్యార్థి దానిని ఛేదించాడు. కృత్రిమేధ, కంప్యూటర్ టోమోగ్రఫీ ఆధారంగా పురాతన గ్రీకు భాషలో రాసిన ఆ పదాన్ని గుర్తించి 40వేల డాలర్ల బహుమతిని కూడా అందుకున్నాడు. రాబోయే రోజుల్లో కృత్రిమమేధ సాయంతో ఆ స్క్రోల్స్ అన్నిటినీ అధ్యయనం చేయవచ్చని శాస్త్రవేత్తలు ఆశాభావంతో ఉన్నారు.
మంచు మనిషి అసలు రూపం
ఓట్జీ.. ప్రకృతి సిద్ధంగా తయారైన మమ్మీ. కొన్ని వేల ఏళ్ల క్రితం నివసించిన మనిషి.. మమ్మీ అది. చరిత్రకారుల మంచుమనిషిగా వ్యవహరిస్తారు. 1991 సెప్టెంబరులో ఈడ్జల్ ఆల్ప్స్ పర్వతశ్రేణిలో ఆస్ట్రియా, ఇటలీ సరిహద్దుల మధ్య ఈ మమ్మీని కనుగొన్నారు. అతని కడుపులో అవశేషాల ఆధారంగా మంచుమనిషి చేసిన చివరి భోజనం ఏమిటి? అతను ఎక్కడనుంచి వచ్చాడు? అనేది గుర్తించారు. అతను వాడిన ఆయుధాల ద్వారా కుడిచేతి వాటం కలవాడిగా నిర్ధారణకు వచ్చారు. అతని రూపాన్ని బట్టి పురాతన వ్యక్తులు ఎలా ఉంటారనేది అంచనా వేశారు. కానీ, డీఎన్ఏ ద్వారా కొత్తగా చేపట్టిన అధ్యయనంలో ఓట్జీ భౌతిక స్వరూపం ఇంతకుముందు శాస్త్రవేత్తలు అంచనా వేసిన దానికి భిన్నంగా ఉంది. అంతకుముందు చామనచాయతో, పూర్తి జుట్టు, గడ్డం ఉన్న వ్యక్తిగా భావిస్తే… ప్రస్తుతం నల్ల చర్మం, నల్ల కళ్లతో బట్టతల ఉన్నవాడిగా అంచనా వేశారు.
అత్యంత ప్రాచీన కంఠాభరణం
పురాతత్వ శాస్త్రవేత్తలకు అప్పుడప్పుడు తవ్వకాల్లో ఎముకలతో రూపొందించిన సాధనాలు, చేతితో చేసిన కళాఖండాలు కనిపిస్తాయి. అప్పటివాళ్లు వాటిని ఎలా ఉపయోగించారనేది తెలుసుకోవటం అసాధ్యంగా కనిపిస్తుంది. గతేడాది సైబీరియాలోని డేనిసోవా గుహలో దుప్పి ఎముకతో తయారుచేసిన కంఠాభరణాన్ని (లాకెట్) కనుగొన్నారు. డీఎన్ఏ పరీక్ష ఆధారంగా వాళ్లు.. 19 వేల నుంచి 25 వేల సంవత్సరాల కిందట దానిని ఒక మహిళ ధరించి ఉండొచ్చని అంచనా వేశారు. ఆ మహిళ ఉత్తర యూరేషియన్ ప్రాంతపు వ్యక్తిగా భావిస్తున్నారు. జన్యుపరంగా తొలి అమెరికన్లతో సంబంధం ఉన్న మనిషిగా పరిగణిస్తున్నారు.
అదరహో ఇజ్రాయెల్
ఇజ్రాయెల్ పేరు చెబితే ప్రస్తుతం యుద్ధ సంక్షోభంలో చిక్కుకున్న పశ్చిమాసియానే గుర్తుకువస్తుంది. కానీ, ఆ దేశ శాస్త్రవేత్తలు ఈ ఏడాది కొన్ని పరిశోధనల్లో ముందడుగు వేసి ప్రపంచం దృష్టిని ఆకర్షించారు.
గుండెకు చికిత్స… క్యాన్సర్ ముప్పు: గుండె జబ్బు నుంచి బయటపడిన వారికి క్యాన్సర్ ముప్పు అధికంగా ఉంటుందని టెల్ అవీవ్ యూనివర్సిటీ, షీబా మెడికల్ సెంటర్ శాస్త్రవేత్తలు గుర్తించారు. చికిత్స జరిగిన గుండె చిన్నపాటి బుడగలను విడుదల చేస్తుంది. ఇవి శరీరంలో క్యాన్సర్ సెల్స్ వృద్ధిచేస్తాయి. అయితే కొన్ని ఔషధాల ద్వారా ఎస్వీలను ప్రవేశపెట్టి, పరిశోధకులు జంతువుల్లో క్యాన్సర్ ట్యూమర్ ఎదుగుదలను 30 శాతం వరకు తగ్గించగలిగారు. ఈ పరిశోధన గుండెజబ్బు ఉన్నప్పటికీ క్యాన్సర్ బారిన పడకుండా కాపాడేందుకు దోహదం చేస్తుందని విశ్వసిస్తున్నారు.
పచ్చదనంతో మంచి జీవితం: గుండెజబ్బులు ఉన్నవాళ్లు ఆ తర్వాత 12 ఏళ్లపాటు మొక్కలు, పచ్చదనం అధికంగా ఉండే ప్రదేశాల్లో నివసించినప్పుడు వారిలో మరణాలు 7 శాతం తక్కువగా ఉంటాయని టెల్ అవీవ్ యూనివర్సిటీ పరిశోధనలో వెల్లడైంది. బైపాస్ సర్జరీ నుంచి కోలుకోవటానికి రోగి పరిసరాల్లో ఉండే స్వచ్ఛమైన గాలి, శారీరక శ్రమ, ప్రశాంతమైన వాతావరణం, నాణ్యమైన జీవనశైలి దోహదం చేస్తాయని, ఇలాంటి పరిస్థితులు లేనప్పుడు వారు త్వరగా మరణిస్తారని అధ్యయనంలో పేర్కొన్నారు.
కాండిడాతో పోరాటం: వైజ్మెన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పరిశోధకులు ఈస్ట్‌లో కొత్త జాతిని కనుగొన్నారు. ఈ పరిశోధన ప్రమాదకరమైన కాండిడా ఆల్బికన్స్తో పోరాటానికి ఉపయోగపడుతుందని పరిశోధకులు భావిస్తున్నారు. కాండిడా జాతుల కారణంగా దీనివల్ల ఏటా రెండు లక్షల మరణాలు సంభవిస్తున్నాయి. ఎలుకల చిన్నపేగుల్లో ఈ ఈస్ట్ రోగ నిరోధక శక్తి అణచివేసే పరిస్థితుల్లో ఉంటుందని కనుగొన్నారు. ఇది మనుషుల్లో కాండిడా జాతులతో పోరాటానికి ఉపయోగపడుతుందని అభిప్రాయపడుతున్నారు.
టెస్టోస్టిరాన్ తగ్గితే ఆందోళన: టెస్టోస్టిరాన్ పురుషుల లైంగిక హార్మోన్. ఇది తగ్గితే ఆందోళన అధికమవుతుందని బెన్-గురియన్ యూనివర్సిటీ పరిశోధకులు గుర్తించారు. మాలిక్యులర్ సైక్రియాట్రీలో ప్రచురించిన అధ్యయనంలో ఈ రెండిటికి సంబంధం ఉందన్న విషయాన్ని ప్రకటించారు. ఎలుకలపై చేపట్టిన పరిశోధనల్లో మెదడులోని కీలకమైన గ్రాహకం టాచికెనిన్ 3 (టీఏసీఆర్3) అనేది మానసిక స్థితికి, టెస్టోస్టిరాన్‌కు అనుసంధానం చేస్తుందని గుర్తించారు. మైక్రోపెనిస్, క్రిప్టోచిడిసిజమ్ తదితర అసాధారణ సమస్యలను ఎదుర్కొనే వ్యక్తులు ఆందోళన, కుంగుబాటు సమస్యలను ఎక్కువ ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు.
కాకులు చురుగ్గా: జనావాసాల్లో ఉండే కాకులు బాగా చురుగ్గా ఉంటాయట. కాకులు, రింగ్నెక్ చిలుకలు మనుషులు లేనిచోట్లలో తక్కువ చురుగ్గా ఉంటాయని టెల్ అవీవ్ యూనివర్సిటీ పరిశోధకులు గుర్తించారు. ఈ పక్షులు.. మనుషులు వదిలేసిన ఆహారంపై ఎక్కువ ఆధారపడతాయి. వారు అందుబాటులో లేని సమయాల్లో కాకులు అరవటం, రామచిలుకల కిచకిచలు దాదాపు సగానికి సగం తగ్గిపోతాయని పరిశోధకులు పేర్కొన్నారు. దీన్నిబట్టి పట్టణాల్లో నివసించే జంతువులు, పక్షులు మానవులపై ఆధారపడుతూ జీవవైవిధ్యాన్ని ఎలా కాపాడుతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు.
డాల్ఫిన్ల రక్షణలో ఏఐ: కృత్రిమమేధ (ఏఐ)ను ఉపయోగించి నౌకల శబ్దం.. డాల్ఫిన్ల కమ్యూనికేషన్ వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశంపై హైవా యూనివర్సిటీలోని చార్నీ స్కూల్ ఆఫ్ మెరైన్ సైన్సెస్ పరిశోధకులు అధ్యయనం చేశారు. నౌకల శబ్దం వాటి సంభాషణలో మార్పు తెస్తుందని గుర్తించారు. వాటి ప్రవర్తన, వలసలపైన ప్రభావం చూపుతుంది. దీనివల్ల ఎదురయ్యే పరిణామాలు ఎలా ఉంటాయనేది ఇంకా అధ్యయనం చేయవలసి ఉంది.
అద్భుతాలు… ఆశ్చర్యాలు
శాస్త్రవేత్తల పరిశోధనలు కొన్నిసార్లు ఆశ్చర్యానికి గురిచేస్తాయి. అద్భుతం అనిపిస్తాయి. మొదటిసారి బాహ్యప్రపంచానికి తెలిసినప్పుడు నిజం కాదేమో? అసలు ఇదెలా సాధ్యమన్న అనుమానం కూడా వస్తుంది. అలాంటి కొన్ని అరుదైన అద్భుతాల గురించి తెలుసుకుందాం.
మనిషికి పందిగుండె: జన్యుపరంగా మార్పుచేసిన పందిగుండెను యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్ మెడికల్ సెంటర్ వైద్యులు మొట్టమొదటిసారిగా ఒక మనిషికి అమర్చారు. అతనికి మనిషి గుండెను అమర్చటం వీలుకాకపోవడంతో వైద్యులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైనా రోగి రెండు నెలలు మాత్రమే జీవించగలిగాడు. పందిగుండెలో వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల అతను మరణించాడని గుర్తించారు. భవిష్యత్తులో చేపట్టే శస్త్రచికిత్సల్లో దీన్ని అధిగమించవచ్చని భావిస్తున్నారు. ‘జీనోట్రాన్స్ప్లాంటేషన్’- అవయవాలు లేదా కణజాలాన్ని ఒక జీవి నుంచి ఇంకో జీవికి అందించటం అనేది వైద్యరంగంలో కొత్త విషయం కాదు. కానీ గ్రహీతల్లో అవయవ తిరస్కరణ ముప్పు అధికం. ఇలా తిరస్కరించటాన్ని తాజాగా వచ్చిన జీన్ ఎడిటింగ్ సాంకేతికత ద్వారా చక్కదిద్దవచ్చు. మానవ అవయవాలు కొరతగా ఉన్న పరిస్థితుల్లో ఇలా ఇతర జంతువుల అవయవాలను మార్పిడి చేయటం వల్ల భవిష్యత్తులో ప్రయోజనం కలుగుతుందని వైద్య నిపుణులు భావిస్తున్నారు.
త్రీ డి బయోప్రింటెడ్ చెవి: టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియాలోని ఇయర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు మొట్టమొదటి క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా 3-డి బయోప్రింటెడ్ చెవిని మనిషికి అమర్చారు. బాధితుడి చెవి కార్టిలేజ్ నుంచి తీసుకున్న కణాలతోనే ఈ త్రీ డి చెవిని అభివృద్ధి చేయడం విశేషం. పుట్టుకతో చెవి ఏర్పడకపోవటం, చెవి నిర్మాణం తేడాగా ఉన్నవాళ్లకు దీనివల్ల ప్రయోజనం కలుగుతుంది. చెవి మార్పిడికి ఇప్పటివరకూ సింథటిక్ పదార్థం ఉపయోగించి పునర్నిర్మించేవాళ్లు. అది అంత అనువుగా ఉండేది కాదు. కొత్త విధానంలో బయో సింథటిక్ పదార్థంతోపాటు, మానవ కణజాలాన్ని ఉపయోగించి రూపొందిస్తున్నారు. 3 డి ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించటం వైద్యరంగంలో ఓ ముందడుగు.
కండరాల బలహీనత మూలం: కేంద్ర నాడీ వ్యవస్థలో కండరాల బలహీనత (మల్టిపుల్ స్ల్కీరోసిస్) ప్రపంచవ్యాప్తంగా 2.8 మిలియన్ల మందిని ప్రభావితం చేస్తున్నది. వివిధ వైరస్ల వల్ల ఇది ఏర్పడుతుందని అంచనా వేశారు. కానీ, అవి ఏమిటనేది ఇప్పటివరకూ శాస్త్రవేత్తలు కనుగొనలేకపోయారు. 20 ఏళ్ల సుదీర్ఘ పరిశోధనల అనంతరం, దాదాపు పది మిలియన్ల మందిని అధ్యయనం చేసిన తర్వాత అది 95 శాతం మందిలో ఎప్స్టీన్- బార్ట్ వైరస్ వల్ల వస్తుందని గుర్తించారు. బయోటెక్నాలజీ కంపెనీ మోడ్రనా దీనికి వ్యాక్సిన్‌ను కనుగొంది. ఇప్పటికే మానవ ట్రయల్స్‌లో వినియోగించారు. ఇది విజయవంతమైతే వైద్యరంగంలో విప్లవాత్మకమైన మార్పుగా చెప్పొచ్చు.
తెల్ల ఖడ్గమృగాల సంరక్షణ: కెన్యా శాస్త్రవేత్తలు ఐవీఎఫ్ పద్ధతిలో దక్షిణ తెల్ల ఖడ్గమృగాన్ని సృష్టించగలిగారు. ముందుగా ఖడ్గమృగం పిండాన్ని అదే జాతికి చెందిన మరో జీవిలో ప్రవేశపెట్టారు. అది విజయవంతంగా గర్భం ధరించింది. దీనితో క్రమంగా అంతరించి పోతున్న తెల్ల ఖడ్గమృగాల జాతిని కాపాడుకోవచ్చని భావిస్తున్నారు.
గ్రాఫీన్ అద్భుతం: ప్రయోగశాలలో సంశ్లేషణ చేసిన కార్బన్ రూపం గ్రాఫీన్‌ను మొట్టమొదట 2004లో కనుగొన్నారు. ఈ ప్రయోగానికి నోబెల్ బహుమతి కూడా లభించింది. గ్రాఫీన్ విశిష్ట లక్షణాలు అందరినీ ఆకర్షించాయి. అది ప్రపంచపు మొట్టమొదటి 2డీ పదార్థం. ఇది వేడిని, విద్యుత్తును తట్టుకోగలదు. మానవుల వెంట్రుక కంటే పదిలక్షల వంతు పల్చగా ఉంటుంది. కానీ, స్టీల్ కంటే దృఢంగా ఉంటుంది. అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో, బౌల్డర్, చైనాకు చెందిన క్వింగ్ డావో యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు సంయుక్తంగా పరిశోధన నిర్వహించి తాము మరో కార్బన్ రూపాన్ని కనుగొన్నామని ప్రకటించారు. దానికి ‘గ్రాఫైన్’ అని పేరు పెట్టారు. 1987 నుంచి సిద్ధాంతపరంగా అటామిక్ బాండ్స్ ఇతర ప్రాపర్టీలలో కనిపించే పదార్థానికి స్వల్ప వ్యత్యాసంతో ఉంటుంది. కాకపోతే ఇది అత్యున్నతమైన సెమీకండక్టర్, అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ కండక్టర్ అని ‘వచ్చే తరానికి అద్భుతం’ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒకసారి దాన్ని భారీ మొత్తంలో రూపొందించటం ప్రారంభిస్తే అది ఈ రంగం రూపురేఖలనే మార్చివేస్తుందని చెబుతున్నారు.
జేమ్స్‌వెబ్ టెలిస్కాప్ చిత్రాలు jameswebb telescope అది పెద్ద టెలిస్కోప్‌గా పేరొందిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ (జేడబ్ల్యుఎస్టీ) భూమి నుంచి పదిహేను లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించి విశ్వానికి సంబంధించిన రంగుల చిత్రాలను అందించింది. ఇందులో స్టీఫెన్ క్వింటెట్ అనే ఐదు నక్షత్రాల సమూహానికి సంబంధించి దాదాపు 150 మిలియన్ పిక్సెల్స్ చిత్రాలు ఉన్నాయి. నక్షత్రమండలాలు ఒకదానితో మరొకటి ఎలా అనుసంధానం అవుతాయో చెప్పటానికి ఈ చిత్రాలు ఉపయోగపడతాయి. సౌర కుటుంబానికి ఆవల ఉండే వాస్ప్-96బి గ్రహం వాతావరణంలో నీరు ఉందని గుర్తించారు. నాసా హబుల్ టెలిస్కోప్ ద్వారా 1995లో గుర్తించిన ‘పిల్లర్స్ ఆఫ్ క్రియేషన్’కు సంబంధించిన చిత్రాలను వెబ్ టెలిస్కోప్ ద్వారా గమనించి విడుదల చేశారు. ఇప్పుడు 3డీ టెక్నాలజీ ద్వారా రూపొందించిన చిత్రాలను నాసా విడుదల చేసింది. ఆసక్తిగలవారు https://chandra.harvard.edu వెబ్‌సైట్‌ను సందర్శించి దీని గురించి లోతుగా తెలుసుకోవచ్చు.
గ్రహాంతర జీవుల అన్వేషణలో ఏఐ: గ్రహాంతర జీవులను కనుక్కోవడానికి శాస్త్రవేత్తలు ఒక కృత్రిమమేధ (ఏఐ) నమూనాను రూపొందించారు. జీవ సంబంధ అంశాలకు, నిర్జీవ అంశాలకు మధ్య ఉండే వ్యత్యాసాన్ని నూటికి 90 శాతం వరకు ఈ ఆల్గారిథమ్ గుర్తించగలదట. ఈ నమూనాతో గ్రహాంతర జీవుల బయోకెమిస్ట్రీని, భూమిపైన వారు జీవించడానికి ఉన్న అవకాశాలను విశ్లేషించవచ్చు.
రోగ నిర్ధారణలో నెలసరి రక్తం: స్త్రీలలో రుతుస్రావం సమయంలో విడుదలయ్యే రక్తాన్ని రోగనిర్ధరాణ సాధనంగా ఉపయోగించుకోవచ్చని శాస్త్రవేత్తలు అంచనాకు వచ్చారు. ఈ ఏడాది తొలిరోజుల్లో అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) కొత్త శానిటరీ పాడ్‌కు ఆమోదం తెలిపింది. దీనికి క్యూపాడ్ అని పేరు పెట్టారు. సేంద్రియ పద్ధతిలో పండించిన కాటన్‌తో దీన్ని రూపొందించారు. వీటి ద్వారా సేకరించిన రక్తంతో, ఏఐసీ బయోమార్కర్ ద్వారా మూడు వారాల్లోపు స్త్రీలలో సగటు బ్లడ్‌షుగర్ స్థాయిని అంచనా వేయవచ్చట. బయోటెక్నాలజీ సంస్థ క్యూవిన్ ఈ ఏఐసీ పరీక్ష చేపట్టింది. ‘నెలసరిలో విడుదలయ్యే స్రావం వైద్యపరంగా పనికివచ్చే చాలా సమాచారాన్ని అందిస్తుంది’ అంటాడు క్యూవిన్ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు సారా నసేరి. ఆ ఫలితాలను ఇతర వ్యాధుల చికిత్సకు వాడుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.
జన్యు వైవిధ్యం గుర్తింపు: మానవ జన్యు క్రమం కనుక్కోవడం పూర్తయింది. జెనెటిక్ కోడ్‌ను రూపొందించేందుకు ‘ద హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్టు’ (1990-2003)ను చేపట్టారు. సాంకేతిక పరిమితుల వల్ల కేవలం 92 శాతం జినోమ్లను మాత్రమే కవర్ చేయగలిగారు. పొడవైన, పునరావృతమైన డీఎన్ఏలను క్రమం చేయటం వీలు కాలేదు. ఇప్పుడు ఆధునిక గణన సాంకేతికతను ఉపయోగించి శాస్త్రవేత్తలు మిగిలిన ఎనిమిది శాతాన్ని పూర్తి చేయగలిగారు. దీనివల్ల వ్యాధులను మనం అర్థం చేసుకునే తీరు, మానవ జన్యు వైవిధ్యాన్ని గుర్తించటం వీలవుతుంది.
…? డాక్టర్ పార్థసారథి చిరువోలు