తల్లికాబోతున్న ఆనందం మూన్నాళ్ల ముచ్చటగా మారింది. అప్పటి దాకా తాను తిన్న అనారోగ్యకర ఆహారమే దానికి కారణమని తెలిసి ఎంతో బాధపడింది. ఇంకోసారి ఈ తప్పు జరగనివ్వకూడదని నిశ్చయించుకుంది. నిపుణుల సలహాలు తీసుకుంటూ, ఆరోగ్యకరమైన వంటలు చేయడం నేర్చుకుంది. తనకోసమే కాదు,తనకు పుట్టిన పాపాయి కోసమూ తయారుచేసిన పదార్థాలతోనే ‘టమ్మీ ఫ్రెండ్లీ ఫుడ్స్’ సంస్థను ప్రారంభించింది శ్రీదేవి ఆశాల. ఆ ఫుడ్ప్రెన్యూర్ తన ప్రయాణాన్ని జిందగీతో పంచుకున్నారిలా…
ఇప్పుడు అందరివీ ఉరుకుల పరుగుల జీవితాలు. కెరీర్ ప్రారంభించినప్పుడు నా పరిస్థితీ అదే. నాన్న ఆశాల శ్యాములు సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్గా పనిచేసేవారు. మాది భువనగిరి దగ్గర బసవాపురం. నాన్న పల్లెటూరి నుంచి వచ్చి చదువుకొని ప్రభుత్వోద్యోగం తెచ్చుకున్నారు. నేనూ చిన్నప్పటి నుంచీ బాగా చదివేదాన్ని. జేఎన్టీయూ హైదరాబాద్ నుంచి ఇంజినీరింగ్ పూర్తవగానే బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా కెరీర్ మొదలుపెట్టాను. అక్కడే మా వారు చిదానందం పరిచయం అయ్యారు. తను డీఆర్డీవోలో సైంటిస్టుగా పనిచేసేవారు. వాళ్లది పోచంపల్లి చేనేత కుటుంబం. ఇద్దరం కెరీర్ మీద బాగా ఫోకస్ చేసి పెద్ద పొజిషన్‌కు చేరాలని కలలు కనేవాళ్లం. ఎప్పుడూ ఉద్యోగానికి సంబంధించి కొత్తగా ఏం నేర్చుకోవాలి, ఏ రంగానికి డిమాండ్ ఉంటుంది, మనకున్న సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి… ఇవే మాట్లాడుకునే వాళ్లం.
మూడు పూటలా వంట చేయడం టైం వేస్ట్ అనిపించేది. అందుకే ఉదయం పాలు సెరియల్స్, కార్న్ఫ్లేక్స్లాంటివి తీసుకునేవాళ్లం. మధ్యాహ్నం రోటీ లేదా అన్నం, ఏదో ఓ కూర మాత్రమే వండుకునేవాళ్లం. రాత్రిపూట బయటే తినేవాళ్లం. చదువుకుంటూ, నేర్చుకుంటూ సమయం గడిపేవాళ్లం. పెళ్లయిన ఏడాదికి నెల తప్పాను. ఏవో కొన్ని కనీస జాగ్రత్తలు మినహా, మిగతా అంతా ఎప్పటిలాగే నడిచింది. అప్పుడే మాకు ఒక షాక్ తగిలింది, మూడో నెలలో అబార్షన్ అయింది. డాక్టర్లు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆ విషయాన్ని మేము జీర్ణించుకోలేకపోయాం. ఇందుకు కారణం మేం తినే అనారోగ్యకర ఆహారం, దారితప్పిన జీవనశైలే అని డాక్టర్లు చెప్పారు.
అదే కనువిప్పు…
మళ్లీ నేను గర్భం ధరించాలంటే ముందు బాగా కోలుకోవాలని వైద్యులు సూచించారు. అప్పుడే కనువిప్పు కలిగింది. మనం కొనుక్కుని తినే ఆహారంలో ఎన్ని రసాయన పదార్థాలు ఉంటాయో తెలుసుకున్నా. ప్రిజర్వేటివ్‌లు, ఆర్టిఫీషియల్ ఫ్లేవర్లు, టేస్ట్ ఎన్హ్యాన్సర్ల గురించి చేదు నిజాలు బయటపడ్డాయి. ఇకనుంచి ఇంట్లోనే తినాలని నిర్ణయించుకున్నాను. వైద్య పుస్తకాలు, న్యూట్రిషనిస్టులు, ఫుడ్ స్పెషలిస్టులు.. ఇలా చాలామంది సాయం తీసుకుని నా ఆహారాన్ని చేసుకున్నాను. రాగులు, జొన్నలు, సజ్జలు, బ్రౌన్‌రైస్, మొలకెత్తిన గింజలతో రకరకాల వంటలు చేశాను. యోగాను జీవనశైలిలో భాగం చేసుకున్నాను. వంట మనిషిని పెట్టుకొని ఏమేం ఎలా వండాలో నేర్పించాను. పెద్దపాప పుట్టాక, ప్యాకేజ్డ్ జోలికి వెళ్లకుండా పిల్లల ఆహారమూ నేనే తయారు చేశాను. బాలింతగా నా జాగ్రత్తలు నేనే తీసుకున్నాను. ప్రసవమయ్యాక కూడా నా ఫిట్నెస్ చూసి ఆఫీసులో అందరూ ఆశ్చర్యపోయారు. ఆ రహస్యం చెప్పమనీ, తమ పిల్లలకూ ఇలాంటి ఆహారం చేసివ్వమనీ అడిగారు.
సులభంగా వండగలిగేలా…
ఉద్యోగం చేస్తూనే రెండోపాపనూ కన్నాను. తనకు రెండున్నరేళ్లు వచ్చేసరికి పదిహేనేళ్ల ఉద్యోగ జీవితం గడిపాను. ఇక పూర్తిగా పిల్లల ఆహారం మీద శ్రద్ధ పెట్టాలని భావించి, రాజీనామా చేశాను. అప్పటికి నేను ఒక జర్మన్ కంపెనీలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో టెక్నాలజీ హెడ్‌గా పనిచేస్తున్నా. ఏడాదికి ముప్పై లక్షల జీతం. రాజీనామా చేసేప్పటికే నా మనసులో ‘టమ్మీ ఫ్రెండ్లీ ఫుడ్స్’ ఆలోచన ఉంది. మాది వ్యాపార నేపథ్యం కాకపోయేసరికి బిజినెస్ పెడతానంటే ఎవరూ ప్రోత్సహించలేదు. అయినా వెనకడుగు వేయకుండా, మేం ఉంటున్న బెంగళూరులోనే తయారీ యూనిట్ ప్రారంభించాను. పోరిడ్జ్ మిక్స్, పాన్కేక్ మిక్స్, హెల్త్‌మిక్స్…లాంటి పేర్లతో ఏడాది పిల్లలు మొదలు పెద్దల దాకా అందరికీ పనికొచ్చే ఉత్పత్తుల్ని తెస్తున్నాం.
Tummy Logo
బెంగళూరు నుంచి హైదరాబాద్..
వ్యాపారంలో మరింత ముందుకు వెళ్లేందుకు సాయపడమని కర్ణాటక ప్రభుత్వాన్ని అడిగాం. ఎలాంటి రంగులూ, ఫ్లేవర్లూ, ప్రిజర్వేటివ్‌లూ లేని ఆరోగ్యకర ఆహారం తయారు చేస్తున్నామనీ చెప్పాం. కానీ అటునుంచి స్పందన రాలేదు. అప్పుడే వీహబ్ గురించి తెలిసింది. ఫోన్ చేయగానే సానుకూలంగా స్పందించారు. హైదరాబాద్ వచ్చి మాట్లాడాను. వాళ్ల ప్రోత్సాహం చూసి మా యూనిట్‌ను బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు తరలించాం. అంతకు ముందు వ్యాపారం అంటే మేమిద్దరమే. కానీ ఇప్పుడు నాకు తోడు వీ హబ్ ఉందన్న ధైర్యం వచ్చింది.
ఆహా.. నలభై లక్షల ఫండింగ్!
ఇటీవల ఆహా వాళ్ల ‘నేను సూపర్ ఉమెన్’ కార్యక్రమంలో పాల్గొన్నా. వీ హబ్‌తో కలిసి ఈ కార్యక్రమం ద్వారా 40 లక్షల ఫండింగ్ తెచ్చుకున్నా. ప్రస్తుతం ఏడాదికి రెండున్నర కోట్ల రూపాయల దాకా టర్నోవర్ సాధిస్తున్నా. నా యూనిట్లో ఆహారం తయారు చేసేవాళ్లందరూ మహిళలే. ఎందుకంటే పిల్లల పొడులు ఎంత మెత్తగా ఉండాలి, ఏ ఆహారం వండితే ఎలా ఉంటుంది.. లాంటివి వాళ్లకే తెలుస్తాయి. ఆరోగ్యకరమైన ఆహారం మీద మరింత అవగాహన కల్పిస్తూ మా ఉత్పత్తుల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తాను. మంచి సమాజం అంటే ఆరోగ్యకరమైన సమాజమే అని నమ్ముతాను!
…? లక్ష్మీహరిత ఇంద్రగంటి