నడక గొప్ప వ్యాయామం అని అందరూ చెప్పే మాటే! పరగడపున నడిస్తే మేలా? సాయంత్రం వెళ్తే మంచిదా? రాత్రి వేళ సాగిస్తే ప్రయోజనమా? ఈ ప్రశ్న తలెత్తితే.. సరైన సమాధానం దొరుకుతుంది. కానీ, ఆ జవాబు అందరికీ ఆమోదయోగ్యం కాకపోవచ్చు. మోదం, ఖేదం సంగతి అటుంచితే.. ఏ వేళలో నడిస్తే ఎలా ఉంటుందో తెలిస్తే… కుదిరిన సమయాన్ని ఎంచుకోవచ్చు!
మార్నింగ్ వాక్..
ప్రతి ఉదయం నడకతో మెదలుపెడితే ఎన్నో ప్రయోజనాలు పొందొచ్చు. మన జీవక్రియలు మెరుగవుతాయి. రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండొచ్చు. పైగా ఉదయం పూట కాలుష్యం కూడా తక్కువగా ఉంటుంది. స్వచ్ఛమైన గాలి లభించే అవకాశాలూ ఉంటాయి. సూర్యోదయాన వేసే ప్రతి అడుగూ సూర్యాస్తమయం వరకు దన్నుగా నిలుస్తుంది. అయితే, ఉదయం నడకకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతుంటాయి. అందులో మొదటిది బద్ధకం. నిద్ర లేవగానే బుద్ధి పదపద అంటున్నా.. మనసు మాత్రం మంచం దిగొద్దని అడ్డుపడుతుంటుంది. ఇలా వారానికి మూడు రోజులు నడక వాయిదాపడుతుంది. నాలుగో రోజు ఉదయాన్నే ఏదో పని తగులుతుంది. ఐదో రోజు రాత్రి ఆఫీస్లో ఆలస్యం అవుతుంది. ఇలా.. వారానికి నాలుగైదు రోజులు కాలు గడపదాటదు. నడక లక్ష్యం నెరవేరదు.
నైట్ వాక్
రాత్రి భోజనం చేసిన తర్వాత చేసే నడక కూడా మేలైనదని చెబుతున్నారు నిపుణులు. పోస్ట్ డిన్నర్ తర్వాత నాలుగు అడుగులు వేస్తే.. రక్తంలో చక్కెర స్థాయులు నియంత్రణలో ఉంటాయి. జీవక్రియలు సాఫీగా సాగి.. జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. ఒత్తిడి తగ్గడంతోపాటు నిద్ర కూడా బాగా పడుతుంది. అయితే, పడుకునే ముందు నడవడం వల్ల.. అడ్రినల్ గ్రంథి ప్రభావితం అవుతుందట. అది శరీరానికి లేని ఉత్సాహాన్ని ఇచ్చి నిద్రను దూరం చేసే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. దీనికితోడు రాత్రుళ్లు డాబా మీదో, వీధిలోనో తప్ప ఎక్కడికో వెళ్లి నడక సాగించలేం. గాలిలో పేరుకుపోయిన కాలుష్యం సమస్యలు కలిగించొచ్చు.
ఏ వేళలో నడిస్తే ఏమవుతుందో తెలిసిందిగా, కాబట్టి.. బద్ధకాన్ని నిద్రపుచ్చి ఉదయాన్నే నడిస్తే ఆరోగ్యంతోపాటు ఉరిమే ఉత్సాహం కూడా పరిగెత్తుకుంటూ మీ చెంతకు వచ్చేస్తుంది.