ఉరూజ్ అస్ఫక్.. యూట్యూబ్‌లో ఓ కామెడీ సంచలనం. ఇడెన్‌బర్గ్ కామెడీ అవార్డ్స్ వేదిక మీద పురస్కారాన్ని అందుకున్న తొలి భారతీయురాలు కూడా. ముంబై జీవితంలోని చీకటి వెలుగులతో హాస్యాన్ని పండిస్తారామె. మగవాళ్లకు పీరియడ్స్ వస్తే ఎలా ఉంటుంది.. అనే కోణంలో రూపొందించిన షో యూట్యూబ్‌లో లెక్కలేనన్ని క్లిక్కులు సాధించింది. తన నానమ్మ క్యాబ్‌లో ఎక్కడికో వెళ్తున్నప్పుడు.. ఆ డ్రైవర్‌తో సాగించిన సంభాషణను కూడా హాస్య స్ఫోరకమైన కామెడీ స్కిట్‌గా తీర్చిదిద్దారు. ‘యాప్స్ కనుక మనుషులైతే..’ పేరుతో వచ్చిన సెటైరికల్ కామెడీ సంచలనం సృష్టించింది.
అస్ఫక్ దుబాయ్‌లో పుట్టారు. పన్నెండేండ్ల వయసులో ఇండియాకు తిరిగొచ్చారు. స్కూల్ డేస్ నుంచీ ‘పంచ్ పటాకా’ అని పేరు తెచ్చుకున్నారు. జోకులు వేయడం మొదలుపెడితే.. వినేవాళ్ల పొట్ట చెక్కలు కావాల్సిందే. ‘ఎంత నవ్వితే అంత ఆరోగ్యం అంటారు. నలుగురికీ ఆరోగ్యాన్ని పంచడానికి మించిన గొప్ప వృత్తి ఏం ఉంటుంది. అందుకే, స్టాండప్ కమెడియన్‌గా స్థిరపడాలని నిర్ణయించుకున్నా’ అంటారామె.