ఊర్మిళా చౌహాన్.. నడిచినంత మేరా సౌందర్య సామ్రాజ్యమే. ఎక్కడికెళ్లినా రోజాపూల రెడ్ కార్పెట్ స్వాగతాలే. ఈ విజయమేం అయాచితంగా రాలేదు. దాని వెనుక ఎంతో తపన ఉంది. మనుగడ కోసం పోరాటమూ ఉంది. ఎయిర్ హోస్టెస్‌గా గగన విహారం చేసింది. డిజైనర్‌గా ఫ్యాషన్ దారి మార్చింది. మాడల్‌గా ర్యాంప్ వాక్ చేసింది. వెండితెర మీదా తళుక్కున మెరిసింది. ఓ మిత్రురాలి సలహాతో ఫెమినా అందాల పోటీలకు దరఖాస్తు చేసింది. అక్కడే ఆమె జీవితం మలుపు తిరిగింది.
ప్రాథమిక వడపోతను దాటుకుని ‘మిస్ ఇండియా తెలంగాణ’ వరకూ వచ్చింది. ‘చాలామంది పైకి కనిపించే అందానికి మెరుగులు దిద్దుకుంటారు. ఆత్మసౌందర్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. మనసు స్వచ్ఛంగా ఉంటే.. తనువుకూ కొత్త కాంతి వస్తుంది. ఏ బ్యూటీ ట్రీట్మెంట్ కూడా ఆ మెరుపు తెప్పించలేదు’ అంటుంది ఊర్మిళ. ‘నేడు తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్నా. రేపు దేశానికి, ఎల్లుండి ప్రపంచానికి నేను సౌందర్య రాయబారిని కావచ్చు’ అంటున్నప్పుడు చారెడు కళ్లలో అంతులేని ఆత్మవిశ్వాసం. అది చాలు. సగం విజయం సాధించినట్టే.