చైత్ర శుద్ధ పాడ్యమినాడు వచ్చే తెలుగు వారి మొదటి పండుగ.. ఉగాది. ఇది వసంత కాలపు వేడుక. గత ప్రళయం పూర్తయిన తర్వాత.. బ్రహ్మ సృష్టిని తిరిగి ప్రారంభించే సమయాన్ని ‘బ్రహ్మకల్పం’ అంటారు. ఇలా ప్రతికల్పంలో మొదట వచ్చే యుగాదినే.. యుగానికి ఆదిగా ‘ఉగాది’ అని వ్యవహరిస్తారు.
ఉగాది చైత్రమాసంలో మొదలవుతుంది. ఆ రోజును తెలుగు సంవత్సరపు మొదటి రోజుగా పరిగణిస్తాం. అరవై వత్సరాలు ప్రభవతో మొదలై, క్షయతో పూర్తవుతాయి. ఉగాది, యుగాది అనే రెండు పదాలూ వాడుకలో ఉన్నాయి. ఉగ అంటే నక్షత్ర గమనం. ఆ నక్షత్ర గమనానికి.. ఆది ‘ఉగాది’. ఆ ప్రకారంగా సృష్టి ఆరంభమైన సుముహూర్తమే ఉగాది. ‘యుగం’ అంటే ద్వయం, జంట అని కూడా అర్థం. ఉత్తర, దక్షిణ ఆయనములనే ఆయన ద్వయ సంయుతం.. ‘యుగం’ (సంవత్సరం). ఆ యుగానికి ఆది (సంవత్సరాది) యుగాది అయ్యింది. తెలుగువారిలా చాంద్రమానాన్ని అనుసరించే మరాఠీలకు కూడా ఉగాది చైత్రశుద్ధ పాడ్యమి నాడే వస్తుంది. వారు సంవత్సరాదిని ‘గుడి పడ్వా’గా (పడ్వా అంటే పాడ్యమి) వ్యవహరిస్తారు.
మన ఉగాది పచ్చడి లాంటిదే తయారుచేసి అదనంగా వాము జోడించి ఆరగిస్తారు. తమిళుల ఉగాదిని (తమిళ) పుత్తాండు అంటారు. ఒకప్పుడు తమిళుల ఉగాది కూడా తెలుగువారిలానే ఏప్రిల్లో వచ్చేది. సిక్కుల కాలమానం ప్రకారం వైశాఖ శుద్ధ పాడ్యమి సంవత్సరాది. సౌరమానం ప్రకారం ఇది ఏటా ఏప్రిల్ 13న, ముప్పై ఆరు సంవత్సరాలకోసారి ఏప్రిల్ 14న వస్తుంది. తెలుగువారి సంక్రాంతి లానే ఇది పంటల పండుగ. బెంగాలీల నూతన సంవత్సరం వైశాఖ మాసంతో మొదలవుతుంది. వారి కాలమానం ప్రకారం చైత్రం ఏడాదిలో చివరిమాసం. దీంతో వైశాఖశుద్ధ పాడ్యమినాడు ఉగాది వేడుకలు చేసుకుంటారు. వ్యాపారులు పాత ఖాతాలను మూసేసి, సరికొత్త పుస్తకాలు తెరుస్తారు.
పంచాంగ శ్రవణం.. నింబకుసుమ భక్షణం
షడ్రుచులతో కూడిన ప్రసాదాన్ని పంచాంగానికి, దేవతలకు నైవేద్యం చేసి తమ భవిష్యత్ జీవితాలు ఆనందంగా సాగాలని ప్రార్థిస్తారు. ఇష్టంగా ఉగాది పచ్చడి తింటారు. కొత్త సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు తెలుసుకునే కార్యక్రమం పంచాగ శ్రవణం. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ ఫలితాన్ని తెలుసుకోవడం ద్వారా గంగాస్నానం చేసినంత పుణ్యాన్ని పొందవచ్చని పెద్దలంటారు. పూర్వం, ఆ ఏడాది పంటలు ఎలా ఉండబోతున్నాయి? ఏరువాక ఎలా సాగాలి? తదితర విషయాలన్నీ తెలుసుకోవడానికి అదో మార్గంగా ఉండేది.
ఇది శోభకృత్ నామ సంవత్సరం. శోభకృత్ అంటే శోభ కలిగించేది అని అర్థం. ప్రకృతితో ముడిపడిన ఈ పండుగ ప్రతి జీవికీ చైతన్యంతో కూడిన ఆనందాన్నిస్తుంది. మనిషి ఆశావాది. మార్పు కోసం ఎదురు చూస్తుంటారు. ఆ దిశగా తొలి అడుగే ఉగాది. కొత్తదనానికి శ్రీకారం, కొత్త వత్సరానికి ప్రారంభం. విజయాలను మూటగట్టి ఇచ్చే ఏడాదిలోకి అడుగు పెడుతున్నామిప్పుడు. శుభం.
– నందిరాజు రాధాకృష్ణ