ఇంటి అలంకరణలో ఫొటోలు, ఫ్లవర్ వాజ్‌లు, వస్తువులు ఎంత ముఖ్యపాత్ర పోషిస్తాయో.. గోడకు వేసే రంగులు కూడా అంతే ముఖ్యమని గ్రహించాలి. బెడ్రూమ్లో వేసే రంగుల కాంబినేషన్ అభిరుచులను తెలియజేయడమే కాదు.. నిద్ర నాణ్యతను కూడా శాసిస్తుందని పలు అధ్యయనాల్లో తేలింది. పడక గదిలో రెండు రంగుల కాంబినేషన్ వేసుకుంటే.. ఉభయ కుశలోపరిగా ఉంటుందని నిపుణులు సెలవిస్తున్నారు. ఆ రంగుల హంగులు దంపతుల్లో నవీన ఉత్సాహాన్ని కలిగిస్తాయని సెలవిస్తున్నారు.
లావెండర్, హాఫ్ వైట్ కాంబినేషన్ పెయింట్లు పడక గది లుక్‌ను సమూలంగా మార్చేస్తుంది. లావెండర్ రంగు కొత్త ఆలోచనలు రేకెత్తిస్తుంది. కలర్ సైకాలజీ ప్రకారం ఈ రంగు మనసుకు ప్రశాంతతను కలిగిస్తుంది. హాఫ్వైట్తో ఈ రంగు జతకడితే.. ఉడుకు నెత్తురును మరింత ఉద్రేకపరుస్తుందట.
తెలుపు, నీలం రంగుల కాంబినేషన్ ఎప్పుడూ హైలైట్‌గానే నిలుస్తుంది. హై గ్లో నేవీ బ్లూ పెయింట్ పడక గది లుక్‌ను మార్చేస్తుంది. గోడలకు తెల్లరంగు వెల్లె వేస్తే.. గది విశాలంగా కనిపిస్తుంది. వైట్ అండ్ బ్లూ షేడ్స్ కలగలిపి వేస్తే.. శృంగార భావనలు పెరుగుతాయట.
మిల్కీ వైట్ రంగు వేసిన గోడలకు పీచ్ కలర్ జోడిస్తే గదంతా ఆకర్షణీయంగా మారుతుంది. గోడలకు పీచ్ రంగు వేసినప్పుడు పిల్లర్స్ ప్లేస్‌లో తెల్లరంగు వేస్తే లుక్ అదిరిపోతుంది. ఈ జోడు రంగులు ఆ గదిలో నిద్రించే జోడీని మాయ చేస్తాయట.
లైమ్ గ్రీన్, పింక్ కలర్స్ కాంబినేషన్ రిచ్ లుక్ ఇస్తుంది. గ్రీన్ ప్రశాంతమైన అనుభూతిని అందిస్తే, గులాబీ రంగు శృంగారానికి సిద్ధం అవ్వమని ప్రేరేపిస్తుంది.
బర్గండి, లేత గోధుమ కలర్ కాంబినేషన్ గదిని ప్రకాశవంతంగా మారుస్తాయి. ఈ కాంబో తాజా భావనలు కలిగిస్తుంది. రొమాంటిక్ ఫీలింగ్స్‌కు ఊతమిస్తుంది.