దైనందిన జీవితంలో మంచి, చెడు తెలుసుకోవడానికి పురాణ కథలు ప్రేరణగా నిలుస్తాయి. రామాయణ, మహాభారతంలోని దృష్టాంతాలు ఉదహరిస్తే నీతి, నిజాయతీ పిల్లల బుర్రకెక్కుతాయని పెద్దలు ఆ కథలే చెబుతుండేవారు. ఇప్పుడు కథలు ఎక్కడివి? డిజిటల్ మానియాలో కొట్టుకుపోతున్నారంతా! కానీ, ఈ సాంకేతిక ప్రపంచంలో పాటించాల్సిన విధులు, తెలుసుకోవాల్సిన పరిమితులు, పొంచి ఉన్న ప్రమాదాల గురించి ఎన్ని హెచ్చరికలు జారీ అవుతున్నా.. పెడచెవిన పెడుతున్నారు. అందుకే ఈ ప్రయత్నం. రామాయణ పాత్రలతో డిజిటల్ అక్షరాస్యత పెంచుకుందాం..
రాముడుధర్మానికి ప్రతిరూపం. ఆయనలా నీతిగా, నిజాయతీగా ఉండాలంటే.. డిజిటల్ అట్రాక్షన్‌కు గురికాకూడదు. శూర్పణఖ అట్రాక్ట్ చేయడానికి వచ్చినా.. రాముడు విముఖత ప్రదర్శించాడు! రాముడు ఫేక్‌న్యూస్ నమ్మేవాడు కాదు. వనవాసం తొలినాళ్లలో భరతుడు దండెత్తడానికి వస్తున్నాడని లక్ష్మణుడు చెప్పినా.. రాముడు గుడ్డిగా నమ్మలేదు. భరతుడు వచ్చింది తనను తీసుకెళ్లడానికే అని నిజం తర్వాత తేటతెల్లమైంది. రాముడు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడు. ఆచితూచి స్పందిస్తాడు. డిజిటల్ భాషలో చెప్పాలంటే రామయ్య ఎథికల్ డిజిటల్ సిటిజన్ అన్నమాట! సోషల్ మీడియా దునియాలో మనం అలా ఉండాలంటే.. నిజ జీవితంలో శ్రీరాముడు పాటించిన విధానాలు ఫాలో అవ్వడమే! హేట్ స్పీచ్ చేయొద్దు, ఫేక్ న్యూస్ నమ్మొద్దు.
డేటా భద్రం
సీతమ్మ తల్లే రామచంద్రుడి ప్రాణం! మాయా బంగారు లేడిని పట్టుకునేందుకు రాముడు వెళ్లగానే.. సీతమ్మ భద్రత గాల్లో దీపంగా మారింది. ఇదే అదునుగా రావణుడు ఆ తల్లిని అపహరించాడు. మళ్లీ సీతమ్మను పొందడానికి రామచంద్రుడు యుద్ధమే చేయాల్సి వచ్చింది! ఈ దృష్టాంతాన్ని నేటి డిజిటల్ యుగానికి అన్వయించుకుంటే.. మన డేటా ప్రైవసీ సేఫ్టీ ఎంత ముఖ్యమో తెలుస్తుంది. కాస్త ఏమరుపాటుగా ఉన్నా.. మన డేటా సైబర్ రావణుల చేతికి చిక్కడం ఖాయం. ఫొటోలు, లొకేషన్, వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికైనా సులభంగా అందుబాటులో ఉంచితే అది ఓ డిజిటల్ లంకకు మార్గం వేసినట్లే. సోషల్ మీడియాలో ‘ఓవర్ షేరింగ్’ చేస్తే సైబర్ స్టాకింగ్‌కు దారితీస్తుంది. ‘నేను ఇప్పుడు వెకేషన్లో ఉన్నాను’ అని లొకేషన్ ట్యాగ్‌తో పోస్ట్ చేస్తే, దొంగ రావణులకు మీ ఇల్లు ఖాళీగా ఉందని తెలిసిపోతుంది. ఇంకేముందీ.. మీ ఇల్లు గుల్ల చేస్తారు. సో.. మీ డేటా లేదా డబ్బు చోరీకి గురికాకుండా.. ప్రైవసీ మెయింటేన్ చేయండి. మన డేటాని రక్షించేందుకు స్ట్రాంగ్ పాస్వర్డ్, టూ-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ వాడాలి.
పారాహుషార్
రావణాసురుడు మాయావి, మోసం చేయడంలో నిపుణుడు. ఈ ఆన్లైన్ లోకంలో సైబర్ రావణులు ఎవరంటే స్కామర్స్, హ్యాకర్స్! ఫిషింగ్ మెయిల్స్, సోషల్ ఇంజనీరింగ్, ఆన్లైన్ గ్రూమింగ్.. ఇవన్నీ రావణుడి ట్రిక్స్ లాంటివే. అందుకే, ఆన్లైన్లో ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మేయకండి. లింక్స్ క్లిక్ చేసేటప్పుడు, మెయిల్స్ ఓపెన్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. రావణుడి మాయలో పడకుండా చూసుకోండి! ఫిషింగ్ లింక్స్, ఇ-మెయిల్స్‌ని గుర్తించండి. ఉదాహరణకు, మీరు లాటరీ గెలిచారు, ఈ లింక్ క్లిక్ చేయండి అని వచ్చే మెసేజ్‌లు రావణుడి మాయలే. ఇలాంటి లింక్స్ క్లిక్ చేస్తే మీ డేటా గోవిందా! అనుమానాస్పద ఇ-మెయిల్స్‌ని ఓపెన్ చేయకండి!
ప్రైవసీ సేఫ్టీ లైన్
లక్ష్మణుడు సీతమ్మను రక్షించేందుకు గీసిన రేఖ గుర్తుందా? ఇది ఆన్లైన్లో మన ప్రైవసీ సెట్టింగ్స్ సేఫ్టీ లైన్ అన్నమాట. రావణుడు లాంటి సైబర్ క్రిమినల్స్ లోపలికి రాకుండా రక్షణ వలయంలా పని చేస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే.. లక్ష్మణుడు గీసిన గీత మన డిజిటల్ ప్రైవసీ సెట్టింగ్స్‌ను గుర్తుచేస్తుంది. ఎవరికైనా మన అకౌంట్లకు యాక్సెస్ ఇవ్వడమంటే ఆ రేఖ దాటి రావడం లాంటిది. ప్రతి యాప్‌లో ప్రైవసీ సెట్టింగ్స్ అప్డేట్ చేసుకోవాలి. ‘ఒకసారి క్లిక్ చేస్తే ఏమవుతుంది?’ అనే నిర్లక్ష్యం మన డేటా భద్రతను చంపేస్తుంది. ఎవరు మీ ఫోటోలు చూడొచ్చు, ఎవరు మీ పోస్టులు చూడొచ్చు అనేది కంట్రోల్ చేయండి. ఎవరికీ అనవసరమైన ఇన్ఫర్మేషన్ షేర్ చేయకండి.
మన ఎథికల్ హ్యాకర్
సముద్రం దాటి, లంకకు చేరి సీతమ్మ జాడ కనిపెట్టిన హనుమ నుంచి స్ఫూర్తి పొందాలి. ఈ డిజిటల్ యుగంలో మనల్ని రక్షించే ఎథికల్ హ్యాకర్స్ కూడా హనుమలాంటి వాళ్లే! హానికరమైన సైట్స్, హ్యాకర్స్ని గుర్తించి, సైబర్ సెక్యూరిటీని బలోపేతం చేస్తారు. మీ డేటా భద్రత కోసం యాంటి వైరస్ సాఫ్ట్వేర్ వాడాలి. నార్టన్, మెకాఫీ లాంటి యాంటి వైరస్ టూల్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇవి మీ డివైజ్‌ని మాల్వేర్, వైరస్ల నుంచి కాపాడతాయి.
టార్చ్ బేరర్
లంకాధిపతి తమ్ముడు విభీషణుడు తప్పు చూసి సైలెంట్‌గా ఉండలేదు. మనం కూడా ఆన్లైన్లో ఏవైనా తప్పులు, బుల్లీయింగ్, మోసాలు చూస్తే నిశ్శబ్దంగా ఉండకూడదు. వెంటనే రిపోర్ట్ చేయాలి. సైబర్ హెల్ప్‌లైన్స్‌ను సంప్రదించాలి. మనం స్పందిస్తేనే.. ఇంకొకరికి రక్షణ కలుగుతుంది. సోషల్ మీడియాలో ఎవరైనా అసభ్యకరమైన కామెంట్స్ చేస్తే, ఫేక్ అకౌంట్స్ నుంచి స్కామ్ మెసేజ్‌లు వస్తే వెంటనే రిపోర్ట్ చేయాలి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో రిపోర్ట్ ఆప్షన్ వాడాలి. రామాయణంలో విభీషణుడిలా ధర్మానికి కొమ్ముకాస్తే, ఆన్లైన్ కమ్యూనిటీ సేఫ్‌గా ఉంటుంది.
లంక.. ఓ డార్క్ వెబ్
రావణుడి లంక ఆన్లైన్ లోకంలో డార్క్ వెబ్‌కి సింబల్. డార్క్ వెబ్ అంటే ఇంటర్నెట్లోని అన్‌సేఫ్, ఇల్లీగల్ కార్నర్స్ అన్నీ అక్కడే ఉంటాయి. ఇవి లంకంత ప్రమాదకరమైనవి. హ్యాకింగ్ టూల్స్, చైల్డ్ పోర్నోగ్రఫీ, అక్రమ లావాదేవీలు అన్నీ ఇక్కడే చోటు చేసుకుంటాయి. వాటికి దూరంగా ఉండటమే మన డిజిటల్ భద్రతకు మంచిది. ఇల్లీగల్ కంటెంట్ యాక్సెస్ చేసి లంకలో ప్రవేశిస్తే.. ఆ డార్క్ వెబ్‌లో మీ డేటా, డివైజ్ రిస్క్‌లో పడొచ్చు.
అనిల్ రాచమల్ల
వ్యవస్థాపకులు
ఎండ్‌నౌ ఫౌండేషన్