“సే నో టూ లిక్కర్!!’ అని ఎవరైనా అంటే.. ‘వీకెండ్లో ఇంకేం మజా ఉంటుంది’ అని నీరసపడే బ్యాచ్ నానాటికీ తగ్గిపోతున్నారట. కారణం.. హ్యాంగోవర్లో తమ భవిష్యత్తు ఆవిరైపోతుందని ఈ తరం మేలుకొంటున్నది. ఓ కొత్త చేంజోవర్ వైపు అడుగులు వేస్తున్నది. ‘మందు మాటే వద్దు గురూ.. సోబర్ డ్రింకే సో బెటరూ’ అంటున్నారు యంగిస్థాన్‌లు. సక్సెస్ఫుల్ ప్రొఫెషనల్ అంటే ఫిట్నెస్, మార్నింగ్ రన్, సోబర్ చిల్లింగ్ అని సాగిపోతున్నారు!!
ఒకప్పుడు వీకెండ్ పార్టీల్లో లిక్కర్ లేకుంటే కిక్కు లేదనుకునే వాళ్లంతా ఇప్పుడు ‘మోడరేషన్’ దిశగా అడుగులు వేస్తున్నారు. ఆల్కహాల్ సోషల్ లైఫ్‌కు మెల్లగా గుడ్‌బై చెబుతున్నారు. కమ్యూనిటీ ఫిట్నెస్ క్లబ్బులు, కొంబుచా నైట్లు, మైండ్‌ఫుల్ మీటప్స్, బ్రీథ్ వర్క్ వర్క్‌షాప్స్… ఇవే ఇప్పుడు నెట్వర్కింగ్ కనెక్షన్స్‌కి కొత్త వేదికలుగా మారుతున్నాయి.
‘మద్యం మానేయడమనేది రిజల్యూషన్ కాదు.. జీవితంలో స్పష్టత కోసం మద్యానికి దూరంగా ఉండటం కాన్షియస్నెస్!!” అంటూ సెన్సిబుల్‌గా మాట్లాడుతున్నారు. కొన్ని సర్వేల ప్రకారం.. యంగ్ మందుబాబుల్లో 71% తాత్కాలికంగా డ్రింక్‌ను మానేశారు. 93% మంది నాన్-ఆల్కహాల్ బేవరేజ్‌లను కొనుగోలు చేస్తున్నారు. ఈ మార్పు ముఖ్యంగా బెంగళూరు, ముంబయి వంటి మెట్రో నగరాల్లో స్పష్టంగా కనిపిస్తున్నది. పలు స్టార్టప్ కంపెనీల్లో ఆల్కహాల్ మానేసి, యోగా, పికెల్‌బాల్ లాంటి యాక్టివిటీలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
అంతేకాదు.. సోషల్ మీడియా ద్వారా హెల్తీ లైఫ్‌ైస్టెల్ ప్రచారం ఈ ట్రెండ్‌ను బలోపేతం చేస్తున్నది. నాన్-ఆల్కహాల్ డ్రింక్‌లు రెస్టారెంట్లు, రిటైల్ షాప్‌లలో అందుబాటులోకి వచ్చాయి కూడా! ఈ మార్పునకు తగ్గట్టుగా గ్లోబల్ బేవరేజ్ సంస్థలు నాన్ ఆల్కహాలిక్ బ్రాండ్స్ తయారీలో నిమగ్నం అవుతున్నాయి. చల్లగా కిక్కు కోసం బీరే తాగక్కర్లేదు.. బవేరియా తాగండంటూ నాన్ ఆల్కహాలిక్ బీర్లు తెస్తున్నాయి! బాగుంది కదా ఈ మార్పు!!