ఈ సోషల్ మీడియా యుగంలో.. పిల్లల పెంపకం కత్తిమీద సాములా మారుతున్నది. ఫేస్బుక్ పోస్ట్‌లు; ఇన్‌స్టా రీల్స్; స్నాప్‌చాట్ స్ట్రీక్ల మధ్యే నేటితరం పెరుగుతున్నది. స్మార్ట్ గ్యాడ్జెట్లతోనే ఎక్కువ సమయం గడుపుతున్నది. ఈ క్రమంలో పిల్లలపై సోషల్‌మీడియా అనేక రకాలుగా ప్రతికూల ప్రభావం చూపుతున్నది. వారిని లేనిపోని సమస్యల్లోకి లాగుతున్నది. అలాకాకుండా ఉండాలంటే.. పిల్లలకు సామాజిక మాధ్యమాల్లోని మంచీచెడులను విడమరిచి చెప్పాల్సిన అవసరం ఉన్నది.
ఇప్పటితరం పిల్లలు పుస్తకాల కన్నా.. డిజిటల్ గ్యాడ్జెట్లతోనే ఎక్కువగా సమయం గడుపుతున్నారు. కాబట్టి, వారికి డిజిటల్ ఉపకరణాలు, సోషల్‌మీడియాపై చిన్నప్పటి నుంచే అవగాహన కల్పించాలి. ‘అపరిచితులతో అప్రమత్తంగా ఉండాలి’ అని పిల్లలకు ఎలాగైతే నేర్పిస్తామో.. ‘ఆన్లైన్లో అతిగా ఏదీ షేర్ చేయొద్దు!’ అనికూడా చెప్పాలి. పిల్లలకు ఆన్లైన్ వల్ల కలిగే అనర్థాలు అర్థమైనప్పుడు.. వారు మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తారు.
పిల్లల స్క్రీన్ టైమ్ గురించి మాట్లాడే ముందు.. మీ స్క్రీన్టైమ్నూ బేరీజు వేసుకోండి. పిల్లలు మిమ్మల్ని చూడటం ద్వారానే ఎక్కువగా నేర్చుకుంటారు. వారితో ఉన్నప్పుడు మీరు కూడా అదే పనిగా సోషల్ మీడియాలో మునిగి తేలుతుంటే.. వారు ఏం చేస్తారో ఊహించండి?
సోషల్‌మీడియాలో ఏదైనా పోస్ట్ చేయడానికి ముందు.. ఒకటికి పదిసార్లు ఆలోచించేలా పిల్లలకు అవగాహన కల్పించాలి. ఏదైనా ఒక విషయం గురించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి.. ఆ తర్వాత నాలిక కరుచుకుంటే లాభం ఉండదు. ఆ తర్వాత డిలీట్ చేసినా.. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ ఎక్కడో ఒకచోట కనిపిస్తూనే ఉంటాయి.
గోప్యత అంటే.. కేవలం పాస్వర్డ్లు మాత్రమే కాదు. అది పిల్లల వ్యక్తిగత జీవితానికి సంబంధించినది కూడా! టీనేజర్లతో కూర్చుని వారి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్‌లో వారి గోప్యతా సెట్టింగ్‌లను ఒకసారి పరిశీలించండి. ఆన్లైన్ ఖాతాలను ప్రైవేట్‌గా ఉంచుకోవడం, ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తుంటే బ్లాక్ చేయడం, రిపోర్ట్ చేయడం లాంటి వాటిపై వారికి అవగాహన కల్పించాలి.
‘ఫోన్ అస్సలు పట్టుకోవద్దు’ అని చెబితే.. ఈ కాలంలో ఏ పిల్లలూ వినే పరిస్థితి లేదు. అందుకే, డిజిటల్ గ్యాడ్జెట్ల వినియోగానికి కఠినమైన నిషేధాలకు బదులుగా.. ఆరోగ్యకరమైన పరిమితులను సెట్ చేయండి. తినేటప్పుడు, పడుకోవడానికి ముందు, వారానికి ఒకరోజు స్క్రీన్ చూడకుండా పరిమితులు విధించండి. ఇలాంటి నియమాలను రూపొందించడంలో పిల్లల్నీ భాగస్వాముల్ని చేయండి. అప్పుడు వారు వాటిని అనుసరించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
సోషల్‌మీడియాతో మంచి స్నేహాలు, మంచి అలవాట్లూ అలవడుతాయి. కానీ, నిజమైన మానవ సంబంధాల్ని మించింది ఏదీ లేదు. అది ఆన్లైన్లో కన్నా.. ఆఫ్‌లైన్‌లోనే ఎక్కువగా దొరుకుతుంది. ఆరుబయట ఆటలు, అభిరుచులు, కుటుంబంతో సమయం గడపడం, ముఖాముఖి స్నేహాలను ప్రోత్సహించండి. అప్పుడే.. వారికి అసలైన జీవితం అంటే ఏమిటో తెలుస్తుంది.