జీవితమే ఓ ప్రయాణం. అందులో ఎన్నో మలుపులూ మైలురాళ్లూ ఉంటాయి. ఈ ప్రయాణాన్ని సౌకర్యవంతంగా మార్చుకునేందుకు కొందరు పేద మహిళలు తమ బండిని తామే నడుపుకొనే ఆలోచనలు సాగిస్తున్నారు. కోరుకున్న గమ్యానికి మనల్ని చేర్చే ఆటో, బైక్‌ల డ్రైవింగ్ నేర్చుకుని జీవనోపాధి సాధించాలని ఆశపడుతున్నారు. ఆంధ్రమహిళా సభ ప్రాంగణంలో ‘మూవింగ్ బౌండరీస్’ పేరుతో మోవో సంస్థ ఉచితంగా నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో భాగమవుతూ తమ లక్ష్యాలకు బాటలు వేసుకుంటున్నారు.‘ఈ శిక్షణ మా జీవితంలో ఓ మలుపు.. రేపు మాదే గెలుపు’ అంటూ ఉత్సాహంగా చెబుతున్న ఈ మహిళలతో జిందగీ మాటా మంతీ!
Moving Boundaries | ఇంటిపట్టున ఉండి పిల్లల్ని చూసుకోవడం ఒక బాధ్యత. ఇల్లు గడవడానికి సాయంగా ఉండటం మరో బాధ్యత. తొలిదాన్ని విజయవంతంగా పూర్తిచేస్తూనే సంపాదనకు సాయంగా ఉండాలని ఆశపడుతున్న చాలామంది మహిళలు డ్రైవింగ్ వైపు మొగ్గు చూపుతున్నారు. తమ స్తోమతకు అవసరాలకు తగ్గట్టు పనులు పూర్తిచేసుకునేలా ఆటో, బండి నేర్చుకుంటున్నారు. జరీన, నవీన, ఫర్హద్ … ఇలా ఎందరో ఈ దోవలో తమ విజయాన్ని వెతుకుతున్నారు. ఆశలే వీళ్ల ఇంధనం. ఆశయమే వీరి గమ్యస్థానం. ‘డ్రైవింగ్ నేరుస్తాం.. సాధికారత సాధిస్తాం’ అంటూ ఈ కొత్త డ్రైవరమ్మలు మునుముందుకు సాగుతున్నారు.
పరదాలు దాటి రహదారులవైపు నడుస్తున్నది పాతబస్తీ జీవితం. ఇరుకైన వీధులు, శిథిలమైన ఇళ్లు, బ్యాంక్ బ్యాలెన్స్ లేని బతుకులు మారాలని పాతబస్తీ ఆడబిడ్డ జరీనా బేగం కలలు కంటున్నది. చార్మినార్‌కు మూడు కిలోమీటర్ల దూరంలోని డబీర్‌పురాలో ఉంటున్నదామె. తనకు ఇరవై ఏండ్ల క్రితం పెండ్లయ్యింది. ఇంటిపట్టునే జీవితం. ఇద్దరు పిల్లలు. వాళ్లాయన ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని నడుపుకొస్తున్నాడు. పిల్లలు పెద్దవాళ్లవుతున్నారు. పై తరగతులకు పోతున్నకొద్దీ చదువుల భారం పెరుగుతున్నది. చన్నీళ్లకు వేన్నీళ్లు తోడైనట్టు సాయిబు సంపాదకు బూబమ్మ ఆదాయం తోడైతేనే పిల్లల చదువులు గట్టెక్కుతాయనుకున్నది.
పిల్లలు తమలా పేదరికంలో ఉండొద్దని కోరుకున్నది. మంచి చదువుతో వాళ్ల భవిష్యత్‌ని తీర్చిదిద్దడం కోసం తాను ఏదో ఒక పని చేయాలనుకున్నది. చిన్న వ్యాపారం చేయడానికి కావాల్సిన పెట్టుబడైనా ఆమెకు పెద్ద మొత్తమే. పెట్టుబడి లేనప్పుడు ఉద్యోగమైనా చేయాలి. ఆ ఉద్యోగానికి కూడా ఏ స్కిల్ లేదు. అందుకే ఆటో డ్రైవింగ్ నేర్చుకుని సంపాదించాలనుకుంది. ‘కార్ డ్రైవింగ్ నేర్పేవాళ్లు ఉన్నారు. కానీ, ఆటో డ్రైవింగ్ నేర్పేవాళ్లు ఉన్నారా?’ అని ఆరాతీస్తే ‘మూవింగ్ బౌండరీస్’ గురించి తెలిసింది. ఆ అడ్రస్ పట్టుకుని కూకట్పల్లి హౌజింగ్ బోర్డ్ కాలనీలోని ఆంధ్రమహిళా సభ ప్రాంగణానికి వచ్చింది. ఆటో డ్రైవింగ్ నేర్పడమే కాదు, ఫీజుగా పైసా కూడా తీసుకోమని మూవింగ్ బౌండరీస్ నిర్వాహకులు చెబితే ఆమె సంతోషంగా చేరిపోయింది.
‘ఆడవాళ్లు ఆటో నడపడం నేర్చుకుని ఏం చేస్తారు?’ బంధువులే కాదు బయటి వాళ్లూ అడుగుతారు. అలాంటి వాళ్లకు ‘మగవాళ్లతో పోటీపడకపోయినా మాకు అవకాశం ఉన్నంతవరకు ఆటోని ఆదాయ వనరుగా మార్చుకుంటాం’ అని సమాధానం చెబుతున్నది ఫర్హద్ బేగం. గోల్కొండలో ఉండే తాను ఇంటి పనులు పూర్తి చేసుకుని, పిల్లల్ని స్కూల్‌కి పంపిన తర్వాత డ్రైవింగ్ స్కూల్‌కి బయలుదేరుతుంది. ఆటో డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత ఏం చేస్తావంటే?… ‘నా ఇద్దరు పిల్లల్ని ఆటోలో తీసుకుపోతాను. వాళ్ల ఫీజు మిగులుతుంది. ఇంకో నలుగురు పిల్లల్ని కూడా ఎక్కించుకుపోతాను. ఆదాయం వస్తుంది’ అని భవిష్యత్ ప్రణాళిక చెప్పింది. ఆటో ఎందుకు నేర్చుకోవాలనిపించింది అని అడిగితే… ‘మా మరిది స్కూల్ ఆటో నడుపుతాడు. మా ఆయన బైక్ మీద కూరగాయలు అమ్ముతాడు. నాకు డ్రైవింగ్ రాకపోబట్టే కదా ఏ పనీ చేయలేకపోతున్నాను. సంపాదించలేకపోతున్నా. అందుకే ఆటో నేర్చుకోవాలనుకున్నా’ అని చెబుతుందామె. తనలా ఆటో నేర్చుకోవడం కోసం వచ్చిన మహిళలతో కలిసి సరదాగా డ్రైవింగ్ నేర్చుకుంటున్నది.
డాక్టర్ భార్య డాక్టర్, లాయర్ భార్య లాయర్‌గా పని చేస్తున్నారు. డ్రైవర్ భార్య డ్రైవర్‌గా ఎందుకు పని చేయకూడదు?… ఆ పని చేసి చూపిస్తానంటున్నది బాన్సువాడ ఆణిముత్యం ముత్యపు నవీన. వైశ్య కుటుంబంలో పుట్టిన నవీనకు వ్యాపారం వెన్నతో పెట్టిన విద్య. పెళ్లికి ముందు కిరాణాషాప్ నడిపింది. పెళ్లయిన తర్వాత లేడీస్ ఎంపోరియం పెట్టింది. హోల్‌సేల్ షాపుల నుంచి సరుకు తెచ్చుకోవడానికి ట్రాన్స్పోర్ట్ సమస్యలు పడలేక ఆటో కొనుక్కుందామనుకుంది. తన భర్త డ్రైవరే. కానీ, ఆయన కారు ఊళ్లమీదకు పోతే ఎప్పుడో వస్తుంది. అప్పటిదాకా ఎదురుచూడకుండా తానే సరుకులు తెచ్చుకోవాలని ఆటో నేర్చుకుంటున్నది. ‘ఆటో కొన్న తర్వాత చీరల వ్యాపారం కూడా మొదలుపెట్టి బస్తీలకు పోయి అమ్ముతా. మాకు నలుగురు ఆడపిల్లలు ఉన్నారు. ఇద్దరం రెండు చేతులా సంపాదించి, వాళ్లని ప్రయోజకులయ్యేలా చదివిస్తాం’ తన ఆలోచనలను పంచుకుంటున్నది నవీన.
‘డ్రైవింగ్ చేయడానికి డ్రైవింగ్ లైసెన్స్ కావాలని చాలామందికి తెలుసు. కానీ, నేర్చుకోవడానికి లెర్నింగ్ లైసెన్స్ ఉండాలని కొంతమందికి తెలియదు. మా దగ్గరికి వచ్చినవాళ్లకు మొదట డ్రైవింగ్ లైసెన్స్‌కి అర్హతలు, రోడ్లపక్కన ఉండే సూచికలు, హెచ్చరిక చిహ్నాల గురించి అవగాహన ఉండాలని చెబుతాం. లెర్నింగ్ లైసెన్స్ తెచ్చుకోమంటే పోయినవాళ్లు మళ్లీ తిరిగి వస్తారో? రారో? ఇంట్లో వాళ్ల సహకారం లేకపోవడం, బయటివాళ్ల మాటలు వాళ్లకు ఆటంకాలు కావచ్చు. తొలి ప్రయత్నమే డెడ్ ఎండ్‌గా మారకుండా, లెర్నింగ్ లైసెన్స్ కోసం అయిదు రోజులపాటు అవగాహన కల్పిస్తాం. కావాలంటే లెర్నింగ్ లైసెన్స్ కోసం సహకరిస్తాం. అది చేతికి వచ్చిన తర్వాత డ్రైవింగ్ సీట్లో కూర్చోబెట్టి లెర్నింగ్ లెసన్స్ మొదలుపెడతాం. 15 నుంచి 50 రోజుల్లో ఆటో రివర్స్ డ్రైవింగ్ కూడా నేర్చుకుంటారు. ఆ తర్వాత లైసెన్స్ తెచ్చుకుంటారు’ అని మూవింగ్ బౌండరీస్ ఇన్స్ట్రక్టర్ శ్వేత చెబుతున్నది. జరీనా లాగే ఆటో నడపడం నేర్చుకోవడం కోసం వచ్చినవాళ్లంతా భయంలేకుండా సరదాగా డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు.
ఇన్స్ట్రక్టర్ చెప్పినట్లు ఒకరి తర్వాత ఒకరు ట్రయల్స్ వేస్తున్నారు. హైదరాబాద్ రోడ్ల మీద కార్ నడిపే ఆడవాళ్లు కనిపిస్తారు. ఆటో నడిపేవాళ్లు, ఆటో డ్రైవింగ్ నేర్చుకుంటామనేవాళ్లు చాలా తక్కువ. అయినా ఆటో డ్రైవింగ్ ఎందుకు నేర్పిస్తున్నారని అడిగితే.. ‘కార్ కొనే స్తోమత ఉన్నవాళ్ల కోసం డ్రైవింగ్ స్కూల్స్ ఉన్నాయి. విడిగా నేర్చుకోవాలనుకున్నా అవి అందుబాటులో ఉంటాయి. కానీ పేదవాళ్ల కోసం మేం పనిచేస్తున్నాం. తమకాళ్ల మీద తాము నిలబడాలనుకునే దిగువ మధ్యతరగతి వాళ్లు ఆటో స్టీరింగ్ పట్టాలని ఆసక్తిగా ఉన్నారు. వాళ్ల ఉత్సాహానికి మా ప్రోత్సాహం తోడై ఎంతోమంది సక్సెస్‌ఫుల్‌గా ఆటోలు నడుపుతున్నారు’ అని మోవో వ్యవస్థాపకురాలు జై భారతి అన్నారు. హైదరాబాద్‌లో మొదలైన మూవింగ్ బౌండరీస్ తెలంగాణలోని పట్టణాలు దాటి, భారతదేశంలోని మెట్రో సిటీల దాకా విస్తరించింది.
మొగుడే చక్రం తిప్పాలనుకుంటే చాలా తిప్పలుంటాయి. కాబట్టి ఆడవాళ్లకు కూడా చక్రంపై సవారీ నేర్పిస్తే మగవాళ్ల జీవితం కూడా హ్యాపీగా ఉంటుందంటున్నారు అశోక్. ఓ ఎఫ్ఎంసీజీ కంపెనీలో మార్కెటింగ్ మేనేజర్‌గా పనిచేస్తున్న ఆయన తరచుగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ‘ఇంట్లో అవసరం అనగానే క్షణాల్లో వాలిపోలేను. పిల్లల్ని స్కూల్ దగ్గర దింపడం, తీసుకురావడం నా ఉద్యోగానికి కొంచెం ఇబ్బంది. అయినా సర్దుకుంటున్నాం. ఏదైనా ఫంక్షన్ ఉంటే పిల్లలు, భార్యని తీసుకుపోవడం కోసం డ్యూటీ పక్కన పెట్టి రావాల్సి వస్తుంది. అదే తనకు డ్రైవింగ్ వచ్చి ఉంటే పిల్లలతో తను ఫంక్షన్లకు పోతుంది. నేను ఇంటికి చేరకముందే వాళ్లు ఇంటికి చేరుకుంటారు.
నా మీద ఆధారపడకుండా తనే షాపింగ్‌కి పోవచ్చు. బైక్ డ్రైవింగ్ నేర్చుకుంటానంటే పోదాం పదా అంటూ బైక్ మీద తీసుకొచ్చాను’ అని అశోక్ అంటే.. ‘మొదట్లో మా ఆయనే నన్ను బైక్ మీద తీసుకువచ్చారు. ఇప్పుడు నేను ఆయన్ని ఇంటి దాకా వెనుక కూర్చోబెట్టుకుని తీసుకుపోతున్నాను’ అంటూ సంతోషం పంచుకుంటున్నది అశోక్ భార్య శిల్ప. డ్రైవింగ్‌ని కేవలం సంపాదన కోసమే కాదు జీవితావసరాల కోసం కూడా నేర్చుకోవాలని మరి కొంతమంది మహిళలు చెబుతున్నారు. మూవింగ్ బౌండరీస్లో డ్రైవింగ్ నేర్చుకుంటున్న వాళ్లందరి నేపథ్యాలు వేరైనా భవిష్యత్ లక్ష్యం ఒకటే… రహదారే ఆశల వారధి. కొత్త ఆశలకు రహదారులు వేసుకుంటున్న వాళ్ల ప్రయాణం సురక్షితంగా గమ్యం చేరాలని ఆశిద్దాం!
– నాగవర్ధన్ రాయల
– అనుమల్ల గంగాధర్