ఎండ మండిపోతుంటే శరీరం పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఏమీ ఉండదు. అందుకే ఈ సమయంలో చర్మానికి కాస్త హాయిగా ఉండే దుస్తులను ఎంపిక చేసుకోవడం ఎంతో ముఖ్యం. గాలి ప్రసరించే వస్ర్తాలు కాకుండా పాలిస్టర్ తరహాలో సింథెటిక్ దుస్తులు ధరించడం వల్ల చెమటపోసి, చర్మం అలర్జీలకు గురవుతుంది. అందుకే ఈ సమయంలో శరీరానికి ఎలాంటి వస్ర్తాలు హాయిగా అనిపిస్తాయో తెలుసుకోవడం, వాటిని ఎంచుకోవడం ఎంతో ముఖ్యం.
వేసవిలో ధరించే బట్టల్లో మనకు తెలిసిందయితే ప్రధానంగా నూలు. ఇది గాలి ప్రసారానికి దోహదం చేసి చర్మం వేడెక్కకుండా కాపాడుతుంది. అందులోనే మరో రకం ‘మల్మల్’. ఇది బెంగాల్ ప్రాంతంలో ‘ఓవెన్ విండ్’గా ప్రసిద్ధి. అంటే గాలిని నేసినట్టుగా ఉంటుందని భావన.
ఎండకాలానికి సరిపోయే మరో రకం వస్త్రం ‘చందేరీ’. చక్కటి మెరుపుతో తేలికగా ఉండే ఇది మధ్యప్రదేశ్ రాష్ర్టానికి చెందిందే అయినా మన దగ్గరా బాగా ఫేమస్. శరీరానికి అతుక్కుపోకుండా రెపరెపలాడే ఈ వస్ర్తాన్ని వేడుకలప్పుడు చక్కగా ధరించవచ్చు.
‘లినెన్ కాటన్’ కూడా ఈ మధ్య మనకు సుపరిచితమైంది. చీరలు, చుడీదార్లతోపాటు మగవాళ్ల చొక్కాలూ ఈ వస్త్రంతో రూపొందుతున్నాయి. గాలి చొరబడేలా ఉండే నేత ఈ వస్త్రపు ప్రత్యేకత. అంతేకాదు, ఇది మెత్తగా ఉండి చెమటనూ పీలుస్తుంది.
కలపగుజ్జుతో చేసే ‘టెన్సెల్’ రకం బట్ట కూడా ఎండల్లో మనల్ని చల్లగా ఉంచుతుంది. ఉక్కపోతను తగ్గించి చెమట త్వరగా ఆరిపోయేలా చేస్తుంది.
చేనేత వస్ర్తాల్లో ప్రాముఖ్యం పొందిన ఖాదీ కూడా వేసవిలో చర్మానికి మంచి నేస్తం. నూలు వడికి చేసే ఖాదీ ఈ సమయంలో చర్మానికి ఎంతో సౌకర్యంగా ఉంటుంది. కాబట్టి వీటిలో మీకు నచ్చిన వాటిని ధరించి ఎండల్లో చల్లచల్లగా గడిపేయండి!