మీనాక్షి తల్లి కొలువైన పుణ్యక్షేత్రం మదురై. కరమున చిలుక కల ఆ హిమగిరి చిలుక సన్నిధికి వెళ్తే ఆ మీనాక్షమ్మ తన కరుణా కటాక్ష వీక్షణాలు చిలకరించడంతోపాటు.. అన్నపూర్ణాదేవి అనుగ్రహాన్నీ అందజేస్తుంది. వీధివీధిలో కొలువైన కోవెళ్లు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచితే.. ఆ వీధి మలుపుల్లో ఉన్న చిరుతిళ్లు సంతోషాన్ని చవి చూడమంటాయి. ఈ పెరుమాళ్ చెల్లెలి ఇంటికి వెళ్తే.. చల్లటి జిగర్తండా ప్రసాదంగా లభిస్తుంది. మదురైలో మధురమైన తీపి పదార్థాలకు కొదువలేదు. అదే సమయంలో అక్కడివారు మమకారంతో వండి వడ్డించే కారం పాకాలు తగలగానే జిహ్వ వహ్వాకారాలు చేస్తుంది. ఎందుకాలస్యం.. మీనాక్షి సాక్షిగా ఆహార విహారం చేసేద్దాం..

Parotta
మదురై మీనాక్షి కోవెల వీధిలో చిరుతిళ్ల కోలాహలం మామూలుగా ఉండదు. ఆ వాడల్లో కీరయ్ వడ బండ్లు కనిపిస్తాయి. ఏ బండి దగ్గరికి వెళ్లినా.. పసందైన రుచి ఖాయం. బియ్యప్పిండి, మినప్పిండి, పాలకూర పేస్టు కలిపి మెత్తగా చేసిన ముద్దలోంచి కొద్ది పిండిని లటుక్కున తెంచేసి, చిటుక్కున ఒత్తేసి చిన్నసైజు పూరీల్లా చేస్తుంటారు. ఇందులోకి ఇచ్చే పచ్చడి రుచి మరింత ప్రత్యేకం. మొదటిసారి చిన్న ముక్క కొరికి తినేస్తాం. రెండోసారికి మిగిలిన వడనంతా నోట్లోకి తోసేస్తాం. కాస్త హాట్ టేస్ట్ చేసిన నాలుకకు.. కొంత తీపి తాకిస్తేనే తృప్తి! అదే బండి మీద రవాపోలి ‘నన్ను కొరికి చూడు’ అని కొరకొరా చూస్తుంది. పొగలు కక్కుతూ వేడిమీదున్న రవాపోలి పంటికిందికి చేరి ముక్కగా విడివడగానే.. జిహ్వాగ్రానికి వేడి తాకుతుంది, ఆ మరుక్షణం అంతకుమించిన తీపి అందుతుంది. హాటు, స్వీటు నీటుగా తినేసిన తర్వాత నాలుగు అడుగులు వేయాలి. అప్పుడే కదా.. ఆ తర్వాత రుచులకు వంతపాడే శక్తి సొంతమవుతుంది.
అలా ఆ వీధుల్లో నడుచుకుంటూ వెళ్తుంటే.. ఓ పరిమళం ‘వారాయ్ నాన్ ఉన్నయ్ తేడి- రారా నీకోసమే ఎదురు చూస్తున్నా’ అని మనల్ని లాగేస్తుంది. బెల్లం పాకం సువాసన అది. ఇక మదురై స్పెషల్ అధిరసం ఆధిపత్యం మొదలవుతుంది. బియ్యప్పిండి, బెల్లం పాకం కలగలిసిన మిశ్రమంతో చేసే వడలు.. మన అరిసెలకు చుట్టాల్లా అనిపిస్తాయి. ఈస్ట్ మాసి స్ట్రీట్‌లో ఉన్న ఎస్వీటీ కొట్టులో ఈ స్వీటు ఫేమస్. ముక్క నోటికి అందగానే ‘లకలకలకలక’ అని రజనీ స్టయిల్లో అనేస్తూ రెండు మూడు లాగించేస్తాం.

Jigar Tanda
దక్షిణాదిలో ఎక్కడికి వెళ్లినా.. ఇడ్లీ, ఉప్మా, దోశ కామన్. కానీ, మదురైలోని యానికల్ వీధిలో ఉన్న ఆశీర్వాదం హోటల్లో వడ ఫేమస్. ఎందుకంత ఫేమసో.. తింటే గానీ తెలియదు. తరచి చూస్తే అక్కడ ఆబగా వడ తినేవాళ్లు, ఆగి ఆగి.. రుచిని ఆస్వాదించేవాళ్లు కనిపిస్తారు. వారితో మనమూ జతకలవడమే! ఎలా తింటారన్నది మీ చాయిస్. అక్కడికి దగ్గర్లోనే ఉంటుంది మీనాక్షి హోటల్. స్వీట్ పనియారం ఇక్కడ ప్రత్యేకం. పూర్ణం బజ్జీలే కానీ.. శనగపిండితో వేయరు. బియ్యప్పిండి, మినప్పిండి, పూర్ణంతో చేసే ఈ వెరైటీ అద్భుతః అనిపించేస్తుంది. మదురై వెళ్లి అక్కడి మురుగన్ టిఫిన్స్‌లో చేయి కడగలేదని తెలిస్తే.. స్థానికులు పెదవి విరిచే ప్రమాదం లేకపోలేదు. అలాంటి అనుభవం మీకు ఎదురుకావొద్దంటే.. వెస్ట్ మాసి స్ట్రీట్‌లో ఉన్న మురుగన్ టిఫిన్స్‌లో ఊతప్పమ్ టేస్ట్ చేయండి. దీనితో వడ్డించే పచ్చళ్లు ఆ ఊతప్పకు అబ్బలా ఉంటాయి. కొబ్బరి, పుదీనా, ధనియా, టమాటా ఇలా నాలుగు పచ్చళ్లతోపాటు సాంబారుతో జతకూడి టేబుల్‌పైకి వచ్చిన ఊతప్పాన్ని చూడటంతోనే జఠరాగ్నికి ఊతం దొరికినట్టు అనిపిస్తుంది. ఒక్కో ముక్కకు ఒక్కో పచ్చడిని అద్దుకోవాలి. ఇక్కడి సాంబారులో చిన్నిచిన్ని ఉల్లిగడ్డలు కట్ చేయకుండానే నేరుగా వేసి ఉడికిస్తారు. ఆ చిట్టి ఉల్లిపాయ నోట్లోకి చేరగానే… పొరలు పొరలుగా విడివడుతూ, సాంబారు రుచిని తెరలు తెరలుగా అందిస్తుంది.
ఇప్పటికే కడుపు నిండిపోయిందని ఆహార యాత్రకు మంగళం పాడేస్తే.. మీ పొట్ట మీరే కొట్టుకున్నవాళ్లు అవుతారు. నాలుగు అడుగులు కాకపోతే.. నలభై అడుగులు వేయండి. అప్పడు వస్తుంది గోపు అయ్యంగార్ టిఫిన్స్. శతాబ్ది చరిత్ర ఉన్న ఈ హోటల్లో వెల్లయ్ అప్పమ్ ఫేమస్. వరిపిండితో చేసే ఈ పదార్థం మన దగ్గర మైదాతో చేసే బోండాకు పితామహుడేమో అనిపిస్తుంది. దీన్ని నంజుకోవడానికి కొబ్బరి పచ్చడితోపాటు పచ్చికారం చట్నీ అందిస్తారు. పచ్చికారం పచ్చడి అద్దుకొని.. అప్పమ్ కొరకగానే ముందుగా కారం నశాలానికి అంటుతుంది.
కట్ట బొమ్మన అంతగా తొడ గొట్టడానికి ఈ చట్నీ టేస్ట్ చేయడమే కారణమేమో అనిపిస్తుంది. ఈ పచ్చడితో అప్పమ్ నోట్లో తైతక్కలాడుతుంటే.. ముక్కుమీద చిరు చెమటలు మెరుస్తాయి. ఇంతలోనే పంటికిందికి చేరే శనగపప్పు దినుసు.. ధిలాసాగా మరోసారి పచ్చడిని నంజుకోమని ప్రోత్సహిస్తుంది. కారం కారంగా పండిన నోరుకు కాఫీతో సంప్రోక్షణ చేస్తే ఆ తృప్తే వేరు. ఆ పక్కనే ఉన్న విశాలం కాఫీ బార్లో ఫిల్టర్ కాఫీ తాగితే మదురై పర్యటనకు మనసైన కొనసాగింపు కుదురుతుంది. ఇడియప్పమ్ (రైస్ నూడుల్స్) రుచి చూడకుండా మదురై దాటితే బాగోదు సుమా! చివరిగా బాదాం జిగురు, చక్కెర పాకం, పచ్చి కోవ, నన్నారి సిరప్ కలగలిసిన జిగర్తండా రెండు గ్లాసులు పట్టిస్తే.. మదురై విహారం పరిసమాప్తం అవుతుంది. ఆ తర్వాత ఏ దేశమేగినా.. మళ్లీ మదురైకి ఎప్పుడెప్పుడు వస్తామా అన్న ఆశ మిగిలిపోతుంది.
…? కణ్వస

Keerai Vada

Sweet

Utappam