ఎన్ని చట్టాలు వచ్చినా, ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. ఇప్పటికీ ‘మహిళల భద్రత’ గాలిలో దీపమే! దేశంలో రోజురోజుకూ మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతుండటం.. ఆందోళన కలిగించే అంశమే! ఈ క్రమంలో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఇద్దరు పాఠశాల విద్యార్థులు.. మహిళల భద్రతకు భరోసా ఇచ్చే లక్ష్యంతో ఒక ప్రత్యేకమైన ఆవిష్కరణ చేశారు. ఇంటిగ్రేటెడ్ ఎస్ఓఎస్ (సేవ్ అవర్ సోల్) సేఫ్టీ ఫీచర్‌తో.. సరికొత్త చెప్పులకు రూపకల్పన చేశారు.
ఇవి ఆపదలో ఉన్న ఆడవాళ్లకు అండగా నిలుస్తాయని ఆవిష్కర్తలు అమృత్ తివారీ, కోమల్ జైస్వాల్ అంటున్నారు. ప్రత్యేకంగా రూపొందించిన ఈ చెప్పుల్లో.. కాలికింద ఎస్ఓఎస్ బటన్‌ను ఏర్పాటుచేశారు. ఈ బటన్‌ను ప్రత్యేక యాప్‌ద్వారా ఫోన్‌కు కనెక్ట్ చేస్తారు.
మహిళలు తమకు ఏదైనా ఆపద పొంచి ఉన్నట్టు భావిస్తే.. వెంటనే ఈ బటన్‌ను ప్రెస్ చేస్తే చాలు. యాప్‌లో అప్పటికే సేవ్ చేసి ఉన్న కుటుంబసభ్యులు, స్నేహితుల నెంబర్లకు హెచ్చరిక మెసేజ్‌లు వెళ్తాయి. సందేశం అందుకున్నవాళ్లు వెంటనే అప్రమత్తం అవుతారు. అంతేకాదు.. వారు ఉన్న లొకేషన్‌తోపాటు ఆడియోను రికార్డ్ చేసి మరీ పంపిస్తుంది. అలా.. ఆపదలో ఉన్నవారు ఎక్కడ ఉన్నారో? వారి చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకునే అవకాశం ఉంటుంది.
ఇందులో మరో సేఫ్టీ ఫీచర్.. ఈ చెప్పులు ‘స్టన్ గన్’ మాదిరిగానూ పనిచేస్తాయి. దాడిచేసే వ్యక్తిని అడ్డుకోవడానికి చిన్న విద్యుత్ షాక్‌ను ఇస్తాయన్నమాట. భవిష్యత్తులో.. ఈ చెప్పుల్లో కెమెరాను ఇన్స్టాల్ చేయాలని భావిస్తున్నట్లు ఆవిష్కర్తలు చెబుతున్నారు. తద్వారా బాధితుల చుట్టుపక్కల ఏం జరుగుతున్నదో చూడొచ్చు.