ఒకప్పుడు అదో మారుమూల ప్రాంతం. స్థానికులకు తప్ప మరెవరికీ పెద్దగా తెలియని ప్రదేశం. కానీ, ప్రస్తుతం అక్కడి పరిస్థితి మారింది. ఓ జలపాతం.. ఆ ప్రాంతం రూపురేఖలనే మార్చేసింది. ప్రకృతి అందాల మధ్య జాలువారుతూ.. వేలాది మందిని అకడికి రప్పిస్తున్నది. రాష్ట్ర నలుమూలల నుంచి పర్యాటకులను ఆకర్షిస్తూ.. వారి మనసుల్లో చెరగని ముద్రవేస్తున్నది. అదే.. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలోని జిట్టగూడెం శివారులో ఉన్న మల్లన్న గండి.
జిట్టగూడెం గ్రామపంచాయతీ పరిధిలో.. రెండు గుట్టలను కలుపుతూ సుమారు 0.4 టీఎంసీల నీటి సామర్థ్యంతో మల్లన్న గండి రిజర్వాయర్ నిర్మితమైంది. స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి, వర్ధన్నపేట నియోజకవర్గాల పరిధిలోని ప్రజలకు సాగు, తాగునీటి అవసరాలను తీర్చడంలో ఈ రిజర్వాయర్ కీలకం. అయితే, ఇప్పుడు నీటి అవసరాలు తీర్చే జలాశయంగానే కాకుండా.. పర్యాటక ప్రదేశంగానూ రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నది. వర్షాకాలంలో అందమైన జలపాతంగా రూపుదాల్చి.. ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటున్నది.

మల్లన్న గండి వైపు ఉన్నవన్నీ మారుమూల పల్లెలే! స్థానికుల జీవనాధారం వ్యవసాయమే! గతంలో ఈ గ్రామాలన్నీ నిర్మానుష్యంగా కనిపించేవి. కానీ, ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జలపాతం అందాలను చూసేందుకు వస్తున్న పర్యాటకులతో.. ఈ మారుమూల పల్లెలన్నీ సందడిగా మారుతున్నాయి. ఆదివారాలు, ప్రత్యేక సెలవు దినాల్లో బైక్‌లు, కార్లతోపాటు టూరిస్ట్ బస్సుల్లోనూ సందర్శకులు వేలాదిగా తరలివస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాతోపాటు హైదరాబాద్, ఖమ్మం, నల్లగొండ తదితర జిల్లాల నుంచి విద్యార్థులు, కుటుంబాలు పెద్ద సంఖ్యలో మల్లన్న గండికి తరలివస్తున్నారు. జలపాతం వద్ద జలకాలాడుతూ.. రిజర్వాయర్ పరిసరాల్లో కేరింతలు కొడుతూ ఉల్లాసంగా గడుపుతున్నారు. కొందరు కుటుంబ సమేతంగా వచ్చి పచ్చని చెట్ల కింద వంటలు చేసుకుని, వనభోజనాలు చేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రకృతి ఒడిలో సేద తీరుతున్నారు.

నిత్యం పని ఒత్తిడి, ఉరుకుల పరుగుల జీవితాలతో సతమతమయ్యే వారికి.. మల్లన్న గండి ఓ చిన్నపాటి విహార కేంద్రంలా మారింది. నగరాల్లోని కాలుష్యం, రణగొణధ్వనికి దూరంగా.. పచ్చని పంట పొలాలు, చెట్లు, గుట్టలు, జలపాతాన్ని చూస్తూ స్వచ్ఛమైన గాలిని ఆస్వాదిస్తున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి కొద్దిసేపు ప్రకృతి మధ్య
గడపడం ద్వారా మానసికంగా రిఫ్రెష్ అవుతున్నామని పర్యటకులు అంటున్నారు.

హైదరాబాద్ నుంచి మల్లన్న గండి 132 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రాజధాని నుంచి వెళ్లేవారు.. వరంగల్ హైవేలో 122 కిలోమీటర్లు ప్రయాణించి స్టేషన్ ఘన్పూర్ వరకూ వెళ్లాలి. అక్కడి నుంచి ఎడమవైపు తిరిగి.. కొత్తపల్లి, తాటికొండ గ్రామాల మీదుగా మరో 10 కిలోమీటర్లు వెళ్తే.. మల్లన్న గండికి చేరుకోవచ్చు.

మల్లన్న గండి జలపాతాన్ని చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు వస్తున్నారు. అయితే, సరైన సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి, ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి. పర్యాటకులకు వసతులు కల్పించాలి. రిజర్వాయర్ వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి, పోలీస్ బందోబస్తు కల్పించాలి.
– బానోత్ బాలు, జిట్టగూడం సర్పంచ్
– చిలగాని విజయ కుమార్ స్టేషన్‌ఘన్‌పూర్