ఎవరో పిలిస్తేనే పెండ్ల్లికి వెళ్లాలన్న రూలేమీ లేదు. టికెట్ కొనుక్కుంటే వెడ్డింగ్ కార్డ్ అందినట్టే. పట్నంలో ఇప్పుడు ఫేక్ వెడ్డింగ్‌ల హడావుడి నడుస్తున్నది! పెండ్లి చేసుకోవాలన్న ఆలోచన కంటే, ఫేక్ వెడ్డింగ్‌లో ఎంజాయ్ చేయాలని జెనరేషన్ జెడ్ ఫిక్సయింది. ఈ ఆసక్తిని క్యాష్ చేసుకునేందుకు ఈవెంట్ మేనేజర్లు ఫేక్ వెడ్డింగ్ పార్టీలకు రా రమ్మని ఆహ్వానిస్తున్నారు.
ప్రవాస భారతీయ విద్యార్థి ప్రపుల్ దాస్ మాక్ షాదీ 2025 పేరుతో కార్నెల్ యూనివర్సిటీలో ఓ తంతు నిర్వహించాడు. అచ్చం మన ఊళ్లల్లో జరిగినంత ముచ్చటగా అమెరికా గడ్డపై తలపెట్టిన భారతీయ పెండ్లికి అందరినీ ఆహ్వానించాడు. పల్లెల్లోనే పెండ్లి వేడుక గంటలకు కుదించుకుపోతే.. వలసపోయిన చోట వివాహ సంబురాన్ని మూడు రోజులు జరిపి.. పెండ్లిలోని తంతులన్నీ పరిచయం చేశాడు. ఓ రోజు హల్దీ పండుగ… రెండో రోజు గోరింటాకు ముచ్చట… మూడో రోజున సప్తపది ఇలాగన్నమాట. అమెరికాలోని ఎన్ఆర్ఐ యువతకు భారతీయ హిందూ వివాహ సంప్రదాయాన్ని పరిచయం చేయడానికి ఈ ఈవెంట్‌ని పకడ్బందీగా నిర్వహించాడు. పెండ్లి కొడుకు, పెండ్లి కూతురు మినహా.. అన్ని కార్యక్రమాలూ సంప్రదాయబద్ధంగా చేపట్టాడు. దీని స్ఫూర్తితో ఇప్పుడు నైట్ పార్టీలకు మాక్ వెడ్డింగ్ థీమ్ విస్తరించింది.
ఢిల్లీలో పార్టీలు, ఈవెంట్స్‌కి మెహ్రౌలీ ఫేమస్. ఆ వీధిలోని ఓ రెస్టారెంట్‌లోని రూఫ్‌టాప్ ఏప్రిల్ 25న ఫేక్ సంగీత్ వేడుకకు వేదికైంది. కుతుబ్ మినార్ కనిపిస్తూ ఉండే రూఫ్‌టాప్‌పై జరిగే సంగీత్ సెలబ్రేషన్‌కి 550 రూపాయలు టికెట్. సోషల్ మీడియాలో ఈ ఫేక్ సంగీత్ ప్రకటన చూసి అవంతికా జైన్ అనే అమ్మాయి కాలేజ్మేట్స్కి షేర్ చేసింది. కాలేజీలో వెడ్డింగ్ థీమ్ పార్టీ చేసుకోవాలని చాలాసార్లు అనుకున్నారట. కానీ, సాధ్యం కాలేదు. ఆ కోరిక తీరే అవకాశం వచ్చిందనుకున్నారు. ఈ పార్టీకి డ్రెస్ కోడ్ తప్పనిసరి అని నిర్వాహకులు కండీషన్ పెట్టారు. సాధారణంగా క్లబ్‌లు, రెస్టారెంట్లలో ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలు ఏర్పాటు చేసే పార్టీలకు కురచ దుస్తులు ధరించి వచ్చే యువతే ఎక్కువగా ఉంటుంది. కానీ పార్టీ కాదు. పేరంటం కదా! అందుకు తగ్గట్టే రావాలని ప్రకటనలోనే హెచ్చరిక కూడా ఉందట. పచ్చని పందిళ్లు వేశారు. మెహందీ ఆర్టిస్టుల్ని రప్పించారు. పెండ్లి సందడిలో గోరింటాకు పండాలంటూ ఈవెంట్ ఆరంభంలోనే అమ్మాయిల చేతులకు మెహందీ పెట్టారు. ఎలాగూ పెండ్లి కూతురు లేదు. ముస్తాబు చేయాలన్న ముచ్చట తీర్చుకోవడం కోసం ఫొటో బూత్‌ని నవ వధువులా సిద్ధం చేశారు. ఈ ఫొటోబూత్లో ఫొటోలు దిగి నెట్టింట సందడి చేశారు అవంతికా, ఆమె స్నేహితులైన ఫేక్ పేరంటాళ్లు! శుక్రవారం సాయంత్రం బాలీవుడ్ పాటలు హోరెత్తిస్తుంటే.. బాజాలతో పోటీపడుతూ జెన్ జెడ్ చిందులేసింది. నిజమైన పెండ్లిలో ఎంత ఆనందమో ఈ నకిలీ పెండ్లిలోనూ అంతే సంతోషాలు ఉన్నాయన్నట్టుగా వేడుక సాగింది. ఇన్‌స్టా రీల్స్‌తో ఫ్రెండ్స్‌ని సర్ప్రైజ్ చేయడానికి ఈ వేడుక బాగా పనికొస్తుందని (ఫేక్) పెండ్లి పెద్దలు (మేనేజర్లు) చెబుతున్నారు.
వీకెండ్లో స్నేహితులతో చుక్క పార్టీ, జనవరి ఫస్ట్‌కి.. న్యూ ఇయర్ డే, ఫిబ్రవరి 14కి వాలెంటైన్స్ డే పార్టీలాగే పెండ్లిళ్ల సీజన్లో ఫేక్ వెడ్డింగ్ పార్టీలు చేసుకుంటున్నారు. ఇదంతా ఎందుకంటే?.. ఉద్యోగాలు చేసుకుంటూ, ఎక్కడో ఊరికి దూరంగా ఉన్న బ్యాచ్‌లర్‌ని పెళ్లికి రమ్మని బొట్టుపెట్టి పిలిచేవాళ్లుండరు. పిలిచినా పోవడం కుదరదు. అందుకే కుదిరితే కప్పు కాఫీ అన్నట్టు, వీలైతే వీకెండ్లోనే పెళ్లి పార్టీ ఉండాలని కోరుకుంటున్నారు. రొటీన్ పార్టీలకు భిన్నంగా ఉండే ఫేక్ వెడ్డింగ్ పార్టీకి ఇష్టమైన వాళ్ల వెంట వెళ్లొచ్చు. ఇష్టపడేవాళ్లను తీసుకుపోవచ్చు. మీరు అబ్బాయి తరఫు వాళ్లా? అమ్మాయి తరఫు వాళ్లా? అని అడిగేవాళ్లెవరూ ఉండరు. వద్దనే వాళ్లు అసలే ఉండరు. పైసలు పెట్టి టికెట్ కొంటే అంతా మనవాళ్లే. ‘బామ్మర్ది పప్పన్నం లేదా’ అని వస్తూపోతూ ఉన్నప్పుడు పెళ్ల్లికాని ప్రసాదుల్ని వేధించే బావల కోసం ఫేక్ వెడ్డింగ్ పార్టీ టికెట్లు కొంటే పార్టీ ఇచ్చిన పేరు, సెలబ్రేట్ చేసుకున్న ఫీలూ దక్కుతుంది. బిజీ లైఫ్‌లో రిలాక్స్‌నిచ్చే వేడుక ఫేక్ వెడ్డింగ్ పార్టీ.
ఇండోర్‌లో గతనెల ఓ వింత పెండ్లి జరిగింది. ఆకాశమంత పందిరి. జిగేల్.. జిగేల్మనే అలంకారాలు, విద్యుద్దీపాలతో మంటపం వెలిగిపోతున్నది. పచ్చని తోరణాల మంటపం అతిథులతో కళకళలాడుతున్నది. వాళ్లు పిల్ల తరఫు వాళ్లు కాదు. పిల్లాడి వాళ్లూ కాదు. వచ్చినవాళ్లంతా ఎవరికివాళ్లే! ఆన్లైన్లో వెడ్డింగ్ ఇన్విటేషన్ కొన్నారు. ముహూర్త సమయం సాయంత్రం ఆరు గంటలకు పెండ్లివారంతా వచ్చారు. వేద మంత్రాలు లేవు. మంగళ సూత్రాలు లేవు. కానీ, మేళతాళాలున్నాయి. ఆపై బారాత్ ఉంది. పప్పన్నంతో మొదలుపెట్టి తిన్నంత తిన్నారు. ఆ తర్వాత అలసిపోయేదాకా ఆడారు. ఈ ఉత్సాహం తెల్లవారిందాకా సందడి సందడిగా సాగింది!
మాక్ వెడ్డింగ్ (ఉత్తుత్తి పెళ్లి) మాట అందరూ కొత్తగా వింటున్నా, మాకు మాత్రం ఇది పాత పండుగే అంటున్నారు ఈవెంట్ మేనేజర్స్. సినిమా షూటింగ్‌లు, వాణిజ్య ప్రకటనల కోసం ఇలాంటి ఉత్తుత్తి పెండ్లిళ్లు చేస్తూనే ఉన్నామంటున్నారు. గత అక్టోబర్‌లో Shangri-La గ్రూప్ ‘బంధన్’ పేరుతో వెడ్డింగ్ సర్వీస్‌ని ప్రారంభించింది. బంధన్ సేవల్ని ప్రకటించే వేడుక కోసం వరుడు, వధువు వేషధారణలో ఇద్దరు మోడల్స్ వచ్చారు. ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ తరుణ్ తహిల్యాని రూపొందించిన పెండ్లి దుస్తుల్లో ఆ జంట చూడముచ్చటగా ముస్తాబైంది. వివాహ వేదికను గొప్పగా డిజైన్ చేశారు. వేదికే కాదు వేడుక కూడా అంతే ఘనంగా నిర్వహించారు. ఇలాంటి ఫేక్ పెండ్లి ముచ్చటకు అతిథులను ఘనంగా ఆహ్వానిస్తున్నారు ఈవెంట్ మేనేజర్లు. మూడు రోజుల పెండ్లి వేడుక నిర్వహించడం నుంచే ఈ ఫేక్ వెడ్డింగ్ కాన్సెప్ట్ వచ్చిందంటున్నాడు జుమ్మా వెడ్డింగ్ ఈవెంట్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు అయాన్. ఈ ఫేక్ పేరంటానికి ఏర్పాట్లను బట్టి టికెట్ ధర అయిదు వందలతో మొదలై మూడు వేల రూపాయల దాకా ఉంటున్నది.
ఈవెనింగ్ పార్టీల నుంచి బర్త్ డే సెలబ్రేషన్స్లోకీ మాక్ వెడ్డింగ్ ట్రెండ్ విస్తరించింది. అన్మోల్ అనే యువకుడు తన పుట్టిన రోజున (ఫేక్) షాదీ జరుపుకొన్నాడు. కేక్ కట్ చేసినంత సింపుల్‌గా తనని తాను పెండ్లి చేసుకున్నాడు. ప్రేమించినవాళ్లని పెండ్లి చేసుకుంటారు. తనను తాను ప్రేమించుకోవాలి. ఆ తర్వాత ఇతరుల్ని ప్రేమించగలమని చెబుతూ పుట్టిన రోజున ప్రేమ సందేశం వినిపించాడు. ఫేక్ వెడ్డింగ్ పిలుపు వస్తే.. ‘పెండ్లి కల వచ్చేసిందే బాలా’ అంటూ కాలేజీ కుర్రకారు హడావుడిగా రెడీ అయిపోతోంది. పెండ్లీడుకొచ్చినా.. పెండ్లికి నో చెప్పే వాళ్లంతా మాక్ మ్యారేజ్‌లకు, ఫేక్ సంగీత్లకు ఉత్సాహంతో ఉరకలేస్తున్నారు. ఈ వేడుకలోనైనా వాళ్ల మనసు మారితే ఏడడుగుల బంధానికి ఒక అడుగు దూరంలో ఉన్నట్టేనని తల్లిదండ్రులూ ఆశపడుతున్నారు.