మొదటితరం జెన్-జీ బ్యాచ్ పెండ్లీడుకొచ్చింది.వీరిలో చాలామందికి ఆదాయం రావడం కూడా మొదలైంది. ఇప్పటిదాకా ట్రెండ్స్ వెనుక పరిగెత్తిన ఈ కుర్రకారు.. ఇక నుంచైనా ఆర్థిక క్రమశిక్షణను అలవాటు చేసుకోవాలి. లైఫ్‌స్టయిల్‌ను ఎంజాయ్ చేస్తూనే.. ‘పొదుపు మంత్రం’ కూడా జపించాలి. ముఖ్యంగా,‘పెండ్లి’ అనే పెద్ద నిర్ణయం తీసుకునే ముందే.. ఆర్థికంగా స్థిరపడాలి.
‘బడ్జెట్’ బాట..
సంపాదన పెరగడం ముఖ్యం కాదు. దాన్ని ఎలా ఖర్చు పెడుతున్నామనేదే ముఖ్యం. అందుకే, జీతాన్ని, ఆదాయాన్ని 50-30-20 భాగాలుగా విభజించుకోండి. అందులో 50 శాతం ఇండ్ల అద్దె, ఇంటి సామగ్రి, బిల్లులు, ఈఎంఐలు లాంటి తప్పనిసరి ఖర్చులకు వినియోగించుకోండి. తర్వాతి 30 శాతం కోరికల కోసం. అంటే, వీకెండ్ ప్లాన్స్, కొత్త గ్యాడ్జెట్స్, కెఫేలు, ట్రెండీ దుస్తులు, ప్రయాణాలు చేయడానికి కేటాయించుకోండి. చివరి 20 శాతం పొదుపు, మదుపు కోసం. పెండ్లికి ముందే ఈ 20శాతం ఆదాయాన్ని కచ్చితంగా సేవింగ్, ఇన్వెస్ట్ చేయడం అలవాటు చేసుకోండి.
అప్పులకు ఒప్పకండి.. జెన్-జీని ఎక్కువగా
ఆకర్షిస్తున్నది.. ‘బై నౌ! పే లేటర్’ ఆఫర్లు. ‘ఇప్పుడు కొనండి,ఆ తర్వాతే చెల్లించండి’ అంటూ ఊరిస్తున్న ఆఫర్లకు దూరంగా ఉండండి. అకౌంట్లో డబ్బు లేనప్పుడు వస్తువులు కొనడం మానేయండి. అలాగే, క్రెడిట్ కార్డ్ బిల్లులను కూడా ప్రతినెలా పూర్తిగా చెల్లించండి. ఇక ఏవైనా పర్సనల్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్ ఉంటే.. పెండ్లికి ముందే వాటిని తీర్చేయడానికి
ప్రయత్నించండి.
‘లైఫ్స్టయిల్క్రీప్’కి బ్రేక్..
జీతం పెరిగేకొద్దీ దానికి తగ్గట్టుగా ఖర్చులు, లగ్జరీలను పెంచేయడమే ‘లైఫ్‌స్టయిల్ క్రీప్’. అంటే, ప్రమోషన్ రాగానే.. అవసరం లేకపోయినా ఐఫోన్ కొనడం. ఖరీదైన బైక్‌కు మారడం లాంటివి చేయడం. నిజానికి ఆదాయం పెరిగితే పెంచాల్సింది ఖర్చుల్ని కాదు.. పెట్టుబడుల శాతాన్ని!
‘నిధి’ అత్యవసరమే..
జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఉద్యోగం మారినా, ఏదైనా అనుకోని ఖర్చు వచ్చినా.. ఇబ్బంది పడకుండా ఉండాలి. అందుకోసం నెలవారీ ఖర్చులకు కనీసం 6 నుంచి 9 నెలలకు సరిపడా డబ్బును ఎమర్జెన్సీ ఫండ్ కింద దాచుకోండి. దీనివల్ల పెండ్లి తర్వాత కూడా మానసిక ప్రశాంతత ఉంటుంది.
మీ కాంపౌండ్లోనే..
జెన్-జీకి ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్.. ‘సమయం’. చిన్న వయసులోనే పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే.. ‘కాంపౌండింగ్’ ద్వారా అది పెద్ద మొత్తంగా మారుతుంది. సేవింగ్స్ అకౌంట్లో డబ్బులు దాచడం కాకుండా.. SIP ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో, స్టాక్స్, పీపీఎఫ్‌లాంటి వాటిలో పెట్టుబడి పెట్టండి.