భార్యభర్తల మధ్య బంధం.. అకస్మాత్తుగా ముగియదు. అది అసంతృప్తితోనే మొదలవుతుంది. అనుమానంతో బలహీనపడి.. విడాకులతో ముగుస్తుంది. నిజానికి ఈ మార్పు చాలా సూక్ష్మంగా ఉంటుంది. కాలం గడుస్తున్న కొద్దీ.. బంధానికి బీటలు వారడం కనిపిస్తుంది. తాజాగా, జర్నల్ ఆఫ్ పర్సనాలిటీ అండ్ సోషల్ సైకాలజీలో ప్రచురితమైన ఒక అధ్యయనం కూడా ఇదే విషయం చెబుతున్నది. కాబట్టి, బంధం బలహీనంగా మారుతున్నదని తెలిస్తే.. దానికి ఆదిలోనే అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉన్నది.
కాపురం సాఫీగా సాగుతున్న సమయంలో.. కొన్ని అనుకోని మనస్పర్ధలు తలెత్తుతాయి. వారి బంధాన్ని బలహీనం చేస్తాయి. అలాంటి సమయంలో చాలామంది ‘పరిస్థితులు అవే చక్కబడతాయి’ అనే భావిస్తారు. ఆ సమస్యలను, పరిస్థితులను పట్టించుకోవడం మానేస్తారు. కానీ, ఆ చిన్నచిన్న సమస్యలే పెద్దగా తయారవుతాయి. బంధాన్ని విచ్ఛిన్నం చేస్తాయి. అలా కావొద్దంటే.. ముందే మేల్కోవాలి.
భార్యభర్తల మధ్య మనస్పర్ధలు రావడంలో ప్రధాన కారణం.. ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ లోపం. మనసులో ఉన్న భావాలను ఎదుటివారితో పంచుకోలేకపోవడం, ఒకరి మాటలను మరొకరు అర్థం చేసుకోకుండా ఉండటం వల్లే ఈ సమస్యలు వస్తాయి. ఇక ఎదుటివారు చెప్పేది వినకుండా ఒకరికొకరు వాదించుకోవడం వల్ల దూరం మరింత పెరుగుతుంది.
ఉరుకులు పరుగుల జీవితాలు, ఉద్యోగ ఒత్తిడి, పిల్లల బాధ్యతల్లో పడి.. ఒకరి కోసం మరొకరు సమయమే కేటాయించుకోలేక పోతున్నారు. రోజంతా స్మార్ట్ఫోన్లతోనే గడపడం కూడా కొన్ని జంటలను దూరం చేస్తున్నది.
ఒకరికొకరు గౌరవించుకోవడం కూడా ముఖ్యమే! చిన్న చిన్న విషయాలకే భాగస్వామిని విమర్శించడం, ఇతరుల దగ్గర తక్కువ చేసి మాట్లాడటం వల్ల.. ఎదుటివారి ఆత్మగౌరవం దెబ్బతింటుంది. అది బంధాన్ని మరింత బలహీనం చేస్తుంది. అంతేకాకుండా ఒకరి అవసరాలను మరొకరు గుర్తించకపోవడం, కేవలం బాధ్యతగా మాత్రమే కలిసి ఉండటం వల్ల బంధాలు బీటలు వారుతాయి.
భార్యభర్తల మధ్య చిన్నచిన్న తప్పులు దొర్లడం సహజమే! వాటిని అంతే సహజంగా వదిలేయాలి. ఏదైనా గొడవ జరిగినప్పుడు.. ఎవరో ఒకరు తగ్గాలి. గొడవ కన్నా.. తమ బంధమే ముఖ్యమనే సంగతిని గుర్తెరగాలి.
ఎదుటివారు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో అడ్డుపడకుండా ఉండాలి. వారు చెప్పేది పూర్తిగా వినాలి. సగం సమస్యలు అప్పుడే పరిష్కారం అవుతాయి.
ఉద్యోగ బాధ్యతల్లోనే కాదు.. ఇంటి పనిలోనూ భాగస్వామి చేసే పనికి గుర్తింపు ఇవ్వాలి. వారు చేసే చిన్న పనైనా సరే.. మనస్ఫూర్తిగా అభినందనలు తెలపాలి. మీకోసం చేసిన పనికి ‘థ్యాంక్స్’ చెప్పడం.. బంధంలో గొప్ప మార్పును తీసుకొస్తుంది.
నేటితరం డిజిటల్ డిటాక్స్ను అలవాటు చేసుకోవాలి. రోజులో కనీసం 30 నిమిషాలైనా ఫోన్లు పక్కన పెట్టి.. కేవలం ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికే ఆ సమయాన్ని కేటాయించుకోవాలి.