‘ల్యాండ్ ఆఫ్ టెంపుల్స్’గా ప్రసిద్ధి చెందిన రాష్ట్రం తమిళనాడు. చోళులు, పాండ్యులు పాలించిన అరవదేశం.. దేవాలయాలతోపాటు భారీ ఆభరణాలకూ ప్రసిద్ధి. దేవతా ప్రతిబింబాలతోపాటు జంతువులు, పక్షులు, పూలు, పండ్లు ఇలా ప్రకృతి రూపాలు ఒదిగి రాజసం ఉట్టిపడే తంజావూరు జువెలరీ మరింత ప్రత్యేకం. సాంస్కృతిక, చారిత్రక ప్రాముఖ్యం కలిగిన తంజావూరు ఆభరణాలు ఈ కాలంలోనూ వన్నె తగ్గలేదు.
భారతదేశంలోని ప్రాచీన కళాత్మక ఆభరణాలలో తంజావూర్ జువెలరీ ప్రత్యేకమైనది. ఈ ఆభరణాల ప్రత్యేక డిజైన్లు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్నాయి. శతాబ్దాల చరిత్ర కలిగిన తంజావూరు నగలు చోళుల కాలం నుంచి ప్రాచుర్యంలో ఉన్నాయి. అందమైన నగిషీలతో రూపుదిద్దుకున్న భారీ నగలను చోళరాజులు ఆలయాల్లోని దేవతా మూర్తులకు సమర్పించేవారు. రాణులు కూడా వీటిని మురిపెంగా ధరించేవారు. ఈ తంజావూర్ ఆభరణాల తయారీ పద్ధతులు తరువాతి కాలంలో విజయనగర రాజుల హయాంలోనూ కొత్తపుంతలు తొక్కాయి. అలా చరిత్రలో సుస్థిరమైన స్థానాన్ని దక్కించుకున్నాయి. నేటికీ అదే స్థాయిలో అమ్ముడవుతున్నాయి.
తంజావూరు ఆభరణాల తయారీలో ఉపయోగించే ప్రధాన ముడిసరుకు బంగారం, వెండి. నగలపై రత్నాలు, రంగురంగు గాజుముక్కలను అమర్చి అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు డిజైనర్లు. పచ్చలు, కెంపులు, నీలాలు, ముత్యాలు, ఇతర విలువైన రాళ్లు ఈ నగలకు అదనపు మెరుపును అందిస్తాయి. ఆకులు, పూల డిజైన్లతో రూపొందిన నగలకు డిమాండ్ ఎక్కువ. దేవతా మూర్తులతో తయారైన నగలకూ ఆదరణ ఉంది. కొన్ని ఆభరణాలు జ్యామితీయ నమూనాలతో ఆకట్టుకుంటాయి.
మోల్డింగ్, ఫిలిగ్రీ, ఎనామెల్ లాంటి పద్ధతుల్లో తయారైనవీ కనిపిస్తాయి. నేటికీ వీటికి ఆదరణ తగ్గలేదు. వివాహాది శుభకార్యాలకు, సంప్రదాయ వస్త్ర శ్రేణికి తంజావూరు నగలు భలేగా నప్పుతాయి. ఖరీదు ఎక్కువే అయినా.. ఇవి అందించే రాజసం, ఆనందం ముందు తక్కువే అనిపిస్తుంది. ఇమిటేషన్, వన్‌గ్రామ్ జువెలరీలోనూ తంజావూరు నగలు అందుబాటులో ఉన్నాయి. ఎందుకు ఆలస్యం ఈ సంప్రదాయ నగలు ధరించి.. ఈ పెండిండ్ల సీజన్లో ప్రత్యేకంగా మెరిసిపోండి.