‘ఉక్కపోస్తుంది ఏసీ గదిలో కారణం తెలిసింది కవిత రాయలేదు ఇవ్వాళ’ అన్న సినారె కవిత రాయని రోజు, రాయని క్షణం లేదు. ప్రయాణంలో ఉన్నా, పరదేశంలో ఉన్నా నిరంతరం రాస్తూనే ఉండేవారు. అనేకసార్లు సినారె రాసిన కవితలను తన ఆత్మీయులకు, తనతో ఉన్నవారికి వినిపించేవారు. కొన్నిసార్లు అప్పుడే కొత్తగా కవిత రాసిన చిన్న పిల్లవాడిగా కనిపించేవారు, వినిపించేవారు. అలా ఆయన కవిత్వంతోపాటు సినీగీతాలు వినే అవకాశం నాకు, మా ఎం. నారాయణశర్మకు ఎన్నోసార్లు కలిగింది.
ఆయన పుట్టిన ఊరు హనుమాజీపేటకు సినారె వచ్చినప్పుడు వారిని కలిసేందుకు అందరం వెళ్లేవాళ్లం. అనేక విషయాలు, చిన్ననాటి ముచట్లతోపాటు తాను కొత్తగా రాసిన వాటిని మాకు వినిపించేవారు. అలా విన్నవాటిలో ‘ఓఁ.. ఒసేయ్ రాములమ్మ’ సినీ గీతమూ ఉంది. స్వయంగా ఒక మహాకవి రాసిన గీతం ఆయన ముఖతః వినడానికి మించిన అదృష్టం మరొకటి ఉంటుందా! ఈ పాట వినిపించి సినారె అడిగిన ప్రశ్న గురించి, వారి వివరణ గురించి తరువాత చెబుతాను.
1997లో దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన విప్లవ చిత్రం ‘ఒసేయ్ రాములమ్మ’. రాములమ్మగా విజయశాంతి ఇందులో ప్రధానపాత్రను పోషించింది. సినారెతో పాటు ఇందులో పాటలు రాసిన కవులందరూ ప్రసిద్ధులూ, ప్రజాకవులు కావడం ఇందులోని విశేషం. ఈ సినిమాలో ఇది పెద్ద పాట కూడా. ఆ పాటను… వెనుకున్న విశేషాలను చూద్దాం!
పల్లవి
అతను: ఓ ముత్యాలరెమ్మ, ఓ మురిపాలకొమ్మ
ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి బొమ్మ
ఓ రాములమ్మా.., రాములమ్మా..
ఆమె: ఏం సూపులోయమ్మ, వేగు సుక్కలేనమ్మ
సిరినవ్వులోయమ్మ, చంద్రవంకలేనమ్మ
ఓ రాములమ్మా, రాములమ్మా
సినారె పాటను ఎత్తుకోవడమే అద్భుతంగా ఉంటుంది. రాములమ్మ లేలేత అందాన్ని, రూపాన్ని పల్లవిలో కవి ఎంత అందంగా చెప్పారో చూడండి. ఇది సినిమా టైటిల్ సాంగ్ కూడా. ఇందులోని నాయిక భూస్వాముల ఆగడాలకు వ్యతిరేకంగా పోరాడే స్త్రీ. సినారె మాటల్లోనే చెప్పాలంటే ఆమె అణచివేతకు గురైన అట్టడుగు వర్గాల ప్రతినిధి. పదమూడేండ్ల వయసులో గర్భవతైన రాములమ్మను చంపమని దొర ఆదేశిస్తాడు. తప్పించుకున్న రాములమ్మను దళిత దంపతులు రక్షిస్తారు. తిరిగి మళ్లీ కొత్త జీవితం ప్రారంభిస్తున్న తనపై అత్యాచారం చేయబోయిన పట్వారి కొడుకును రాములమ్మ చంపుతుంది. తరువాత కొమురన్న సాయంతో నక్సలైట్లలో చేరుతుంది. స్థూలంగా ఇదీ సినిమా కథ.
చరణం
అతను: నువ్వు కడవమీద కడవపెట్టి కదిలితేనమ్మా
బృందం: ఓ… ఒసేయ్ రాములమ్మ
ఆమె: కరిమబ్బు వరిదుబ్బు కన్నుగలిపేనమ్మ
బృందం: ఓ… ఒసేయ్ రాములమ్మ
తలపైన కడవ పెట్టుకుని చిన్నారి రాములమ్మ కదులుతూ వస్తూవుంటే ఆమె అందానికి ఆకాశంలోని నీలిమబ్బులు, భూమి చేలలోని వరి దుబ్బలు కండ్లప్పగించి చూస్తున్నాయట. అంతేకాదు… ఎగురుతూ దుంకుతూ ఆడుతూ పాడుతున్న చిన్నారిని చూస్తే ‘ఎగిరే దుంకే జింకపిల్ల పాదాలకు జంకుపుట్టెనమ్మ’ అంటారు. మరో చరణంలో రాములమ్మ అందమైన మోమును వర్ణిస్తూ ‘పరిగెత్తే పాయలో పైపైకి తేలే నురగలాగా, పచ్చిపాల నిగ్గులాగా’ ఉందన్న కవి ఊహ ఎంత బాగుంది కదా! ఇది కవి సినారె అమాయకమైన రాములమ్మను చిత్రిస్తూ గీసిన అక్షర చిత్రం. అంతేకాదు నాయికను కవిగా, వ్యక్తిగా దీవిస్తూ… ‘నువ్వు పచ్చగుండాలె, నువ్వు పదిలంగుండాలె/ భూమి తల్లి సాక్షిగ సేమంగుండాలె” అంటారు.
పైన నేను పేర్కొన్నట్టు ఈ పాట వినిపించి మమ్మలి సినారె అడిగిన విషయాన్ని చూద్దాం. ‘ఇందులో ఒక చక్కని జాతీయం లాంటి వాక్య ప్రయోగం చేశాను’ అన్నారు. నిజాం ప్రాంత పరిస్థితులను చెప్పారని ఒకరం అంటే, మరొకరు నక్సలైటు ఉద్యమం గురించి చెప్పారని, ఇంకొకరు అట్టడుగు వర్గాల పీడనను చిత్రించారని, ఆ నేపథ్యంగా జరిగిన ప్రతిఘటనను చెప్పారని ఇలా అనేక రకాలుగా చెప్పాం. అప్పుడు సినారె నవ్వుతూ..
‘సూరీడే నీ వంక తేరి సూసెనమ్మా
అడుగేస్తే నేలంత అద్దమాయెనమ్మా’ అన్న పంక్తులను వినిపించి, అప్పుడే స్నానం చేసి ఆమె నడిచి వస్తుంటె అప్పటి రాములమ్మను, ఆమె స్వచ్ఛమైన వ్వక్తిత్వాన్ని ఇలా చిత్రించానని, రాములమ్మ అడుగులతో తడిసిన నేల అద్దంలా మెరిసిందని చెప్పానని అన్నారు. దీనిని ‘పాటలో ఏముంది, నా మాటలో ఏముంది’ రెండో భాగంలో “ఆమె స్వచ్ఛమైన వ్యక్తిత్వానికి కవితా రూపంగా చేసిన చిత్రణ ఇది” అని పేర్కొన్నారు సినారె. ఈ పాటలో చిన్నారిని, ఆమె ఎదిగిన విషయాన్ని కూడా కవి చెబుతారు.
చరణం:
పసిడివన్నె ఒంటిమీద..
పాడుసూపు పారకుండ
పసుపు పూసినారె అమ్మలూ
చిట్టి వయసు పారిపోయూ
చిగురు వయసు చేరెనని
చీరకట్టినారె కొమ్మలూ
అంటూ పల్లెలో అమ్మాయి రజస్వల అయినప్పుడు జరిగే ముచ్చటను చెబుతారు. తరువాత ఆనవాయితీ ప్రకారం దొర ఆశీస్సుల కోసం వెళ్లిన రాములమ్మపై అతని కన్నుపడుతుంది. మూడుకుంచాల వడ్లకు పొంగిపోయి పనికి కుదురుకుంటుంది. నిజాం కాలాన్ని, ఆనాటి వెట్టి చాకిరినీ ప్రత్యక్షంగా చూసిన సినారె దానిని ఇలా చెబుతారు.
…? పత్తిపాక మోహన్