సుస్మిత రాజేంద్ర కనేరి.. కళల ప్రేమికురాలు. అనివార్య పరిస్థితుల్లో తరాలుగా నమ్ముకున్న వ్యాపకానికి దూరం అవుతున్న కళాకారుల పట్ల ఆమెకు ఎనలేని ప్రేమ. అదే గుల్లకారి.కామ్ ఏర్పాటు దిశగా అడుగులు వేయించింది. ఇదో సంప్రదాయ, గిరిజన చిత్రకళల వేదిక. ఆదరణ కరువైపోయి కళా నైపుణ్యం ఉన్న కుటుంబాలు పట్టణాలకు వలస వెళ్తున్నాయి. మిగిలిన ఒకరిద్దరూ కూడా ఉపాధి బాట పడితే.. నూటికి తొంభైశాతం కళలు సమాధికి సిద్ధమైనట్టే. ఈ దుస్థితి సుస్మితను కలవరానికి గురిచేసింది. ఒకవైపు కళా
కారులకు చేతినిండా పనిలేదు.
మరోవైపు నగరవాసులు వైవిధ్యమైన సంప్రదాయ కళలను ఇంటీరియర్ డిజైనింగ్‌లో భాగం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ ఇద్దరి మధ్యా ఓ వంతెన ఏర్పాటు చేస్తే.. కళ బతుకుతుంది. సుస్మిత ప్రయత్నమంతా అందుకే. తను వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజినీర్. తనకు తెలిసిన సాంకేతికతను కళా వ్యాపారానికి జోడించింది. సుస్మిత పుణెలో పుట్టిపెరిగింది. గతంలో కొన్ని స్టార్టప్స్‌కు ప్రాణంపోసింది. ఇది తన తాజా ప్రయత్నం. తమ వెబ్సైట్లో సంప్రదాయ, గిరిజన కళా రూపాలను విక్రయానికి ఉంచింది. విరాళాల రూపంలోనూ ఎవరికి తోచిన సాయం వారు చేయవచ్చు. ‘కళలను బతికించుకోడానికి ఇంతకు మించిన మార్గం కనిపించ లేదు’ అంటుందామె.