Avani Reddy | ఎంత గొప్పగా తయారు చేసిన వస్తువైనా సరైన ఆదరణ లేకపోతే ఆ కళ రాణించదు. మనం వద్దనుకున్న కళలను విదేశీయులు కోరుకోవడం గమనించింది ఆ యువతి. చదువుకునే వయసులోనే ఆంత్రప్రెన్యూర్ అవతారమెత్తింది. మారుమూల గ్రామాల్లో తయారైన ఉత్పత్తులను గ్లోబల్‌స్థాయిలో విక్రయించాలనే సంకల్పంతో ‘ఆహార్యాస్’ పేరుతో ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది దేప అవని రెడ్డి. ఉత్పత్తిదారులు తయారు చేసిన వస్తువులను గ్లోబల్ మార్కెట్లో విక్రయించి వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్న అవని రెడ్డి జిందగీతో ముచ్చటించింది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే…
మాది నల్లగొండ. నేను పుట్టకముందే అమ్మానాన్న హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. అయినా కూడా పండుగలప్పుడు సొంతూరికి తప్పకుండా వెళ్తుంటాం. ఈ విధంగా గ్రామీణ సంప్రదాయాలంటే ఇష్టం ఏర్పడింది. చిన్నప్పటినుంచి కళలంటే ఇష్టం. నేను డిగ్రీ చదివేటప్పుడు ఎంఎస్ఎంఈ ప్రాజెక్టులు చేసేదాన్ని కూడా. అందులో భాగంగా యూరప్‌లో బిజినెస్ కోర్సు చేసే అవకాశం రావడంతో అక్కడికి వెళ్లాను. ఆ ఆరు నెలల కాలం నన్ను ఎంతగానో మార్చింది. యూరప్ వెళ్లకముందు ఉద్యోగం చేయకుండా ఆంత్రప్రెన్యూర్‌గా ఎదగాలనే లక్ష్యం ఉండేది. కానీ, ఏ రంగంలోకి వెళ్లాలో తెలిసేది కాదు. యూరప్‌లో మెట్రో ప్రయాణం చేస్తున్న సమయంలో చాలామంది నేను వేసుకున్న దుస్తులు, చేసుకున్న అలంకరణను ఆసక్తిగా చూసేవాళ్లు. వాటి గురించి అడిగి మరీ తెలుసుకునేవారు. అలా వాళ్ల ఆసక్తిలోంచి మొదలైంది ‘ఆహార్యాస్’ మన ఉత్పత్తులను గ్లోబలైజేషన్ చేస్తే బాగుంటుందని భావించి దీనికి శ్రీకారం చుట్టాను.

2025లో ఇది ప్రారంభించినప్పుడు నాకు ఎలాంటి అనుభవం లేదు. గ్రామీణ స్థాయిలో ఉత్పత్తులను గ్లోబల్ స్థాయిలో పరిచయం చేయాలన్నది మాత్రమే నా ఆలోచన. అందుకోసం క్షేత్రస్థాయిలోకి వెళ్లాం. తాము తయారు చేసిన ఉత్పత్తులను ఎలా అమ్ముకోవాలో తెలియని పరిస్థితిలో చాలామంది కళాకారులు ఉన్నారు. దానికితోడు కనీసం తమ వస్తువుకు గిట్టుబాటు ధర కూడా అడగలేని స్థితిలో ఉన్నవాళ్లూ తారసపడ్డారు. మేము వాళ్లదగ్గరికి వెళ్లి ‘మీ వస్తువులను లాభాలకు అమ్మిపెడతాం, మాకివ్వండి’ అని అడిగితే మమ్మల్ని అనుమానంగా చూశారు. శాంపిల్ ఇచ్చేందుకు కూడా ముందుకు రాలేదు. చేసేదేమీ లేక వాళ్ల దగ్గర డబ్బులు పెట్టి కొన్ని వస్తువులను కొని, వాటిని ఆహార్యాస్ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లో పెట్టి అమ్మాం. అలా వచ్చిన డబ్బులు వాళ్లకు ఇవ్వడంతో మాపై నమ్మకం కలిగింది. ఇలా ఏడాదిపాటు మా కసరత్తు సాగింది. తెలంగాణలోని పెడన, భూదాన్ పోచన్‌పల్లి, సిద్దిపేట గొల్లభామ చీరలతో పాటు జైపూర్, ఢిల్లీ, ముంబై ప్రాంతాలకు వెళ్లి మరీ మా ఆలోచనలు ప్రాక్టికల్‌గా వాళ్లతో పంచుకున్నాం. ప్రారంభంలో లాభాలు ఆశించకుండా చేయడంతో దాదాపు రూ.3 లక్షల వరకు అప్పు చేయాల్సి వచ్చింది. అయినా కూడా వెనక్కి తిరిగి చూడకుండా ప్రయత్నిస్తూ వచ్చాం. చివరికి సక్సెస్ అయ్యాం.
తెలంగాణలో స్టార్టప్‌లు ప్రారంభం కావడానికి కేటీఆర్ గారే ముఖ్య కారణం. కొత్త ఆవిష్కరణలతో ముందుకొచ్చే యువతకు ఆయన ఎంతో తోడ్పాటు అందిస్తుంటారు. వారిని ఒక్కసారైనా కలవాలని రెండు నెలలనుంచి ప్లాన్ చేసుకున్నాం. అనుకోకుండా ఇటీవల కలిశాం. మా ఆవిష్కరణ గురించి అడిగి తెలుసుకున్నారు. ఇంత చిన్న వయసులో చాలా గొప్ప కాన్పెప్ట్‌తో పనిచేస్తున్నారని అభినందించారు. ఆయన మాటలు మేము మరింత ఉత్సాహంగా పనిచేయడానికి ఊతమిచ్చాయి.
ఆహార్యాస్ పరిచయం అయిన తర్వాత చాలామంది చేనేత కార్మికులు, కళాకారుల జీవితాలు మారిపోయాయి. గతంలో నెలకు ఆరు, ఏడు ఆర్డర్లకే పరిమితమైన వారు నేడు బల్క్ ఆర్డర్లతో నెలంతా బిజీగా గడుపుతున్నారు. చిన్నారి అనే మహిళ కొండపల్లి బొమ్మలు చేస్తూ శిల్పారామంలో స్టాల్‌పెట్టి విక్రయించేది. ఇంటిల్లిపాది కష్టపడినా అనుకున్నంత లాభం వచ్చేది కాదు. ఒకానొక సందర్భంలో శిల్పారామంలోని స్టాల్ తీసేద్దాం అనుకున్నారట. ఆ సమయంలో మేము ఆమెకు ఓ భరోసా ఇచ్చాం. ఆమె తయారు చేసే బొమ్మలకు ఇప్పుడు మంచి గిరాకీ ఉంది. గతంలో రూ.15వేలు మాత్రమే సంపాదించుకున్న చిన్నారి ఆహార్యాస్ వల్ల నెలకు రూ.60 వేల వరకు సంపాదిస్తున్నది. మరో మహిళ లావణ్య వెదురుపై కళాఖండాలు వేస్తుంటుంది. కానీ, ఆదాయం అంతంత మాత్రంగానే ఉండేది. ఆహార్యాస్ వేదికగా ఆమె పెయింటింగ్స్ ఇప్పుడు ఆఫ్రికా వరకు చేరాయి. ఇలాంటి గ్రామీణ కళాకారులు ఎందరో తయారు చేసిన వస్తువులను గ్లోబల్ స్థాయిలో విక్రయిస్తున్నాం. మరో విషయం ఏమంటే ఇతర మార్కెట్లలో ఒక వస్తువు అమ్మితే వచ్చిన లాభంలో 30 శాతం వరకే తయారీదారునికి ఇస్తుంటారు. మేం మాత్రం లాభాల్లో సింహభాగం కళాకారులకు చెందేలా చూస్తున్నాం.
ఆహార్యాస్ ప్రారంభించిన కొత్తలో నా కుటుంబంతోపాటు నాకు తోడుగా నిలిచింది నా టీం మాత్రమే. మా బంధువైన రాహుల్ దీనికి కో ఫౌండర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఏవైనా సమస్యలు తలెత్తితే ఆయనే చూస్తుంటాడు. మరో ఐదుగురు చదువుకుంటూనే మాతో కలిసి పనిచేస్తున్నారు. ప్రారంభంలో నెలలో నాలుగైదు ఆర్డర్లు మాత్రమే వస్తుండేవి. ప్రస్తుతం దాన్ని అదిగమించాం. బల్క్ ఆర్డర్లు వస్తున్నాయి. మా వెబ్సైట్లో చీరలు, కుర్తాలు, బొమ్మలు, స్టేషనరీ ఇలా 75కు పైగా రకాలు ఉన్నాయి. వీటిని 300 మందికి పైగా కళాకారులు తయారు చేస్తున్నారు. అందులో తెలంగాణకు చెందిన వారు 150 మందికిపైగా ఉన్నారు. ఒకప్పుడు ‘చీరల వ్యాపారం చేస్తుందటా’ అని వెక్కిరించిన వాళ్లే.. ఇప్పుడు నా ఎదుగుదల చూసి మెచ్చుకుంటున్నారు. ఈ ఏడాది కోటి రూపాయల టర్నోవర్ చేయాలన్న లక్ష్యంతో పని చేస్తున్నాం. భవిష్యత్తులో ఆహార్యాస్ని దేశమంతా విస్తరించాలన్నదే నా ధ్యేయం.
– రాజు పిల్లనగోయిన
– కె.సాయిబాబా