స్కూల్స్ మొదలయ్యాయి. ఎదిగే పిల్లలకు ప్రత్యేక ఆహారం కావాలి కదా! వాళ్లకు సంపూర్ణ పోషకాలు అందాలంటే లంచ్ బాక్సులో ఏం సర్దాలి?
– ఓ పాఠకురాలు
Schooling | మీరన్నమాట నిజమే. మన అవసరాలు వేరు. పిల్లల అవసరాలు వేరు. వాళ్లకు క్యాల్షియం, ఐరన్ సహా అన్ని పోషకాలూ తగిన మోతాదులో కావాలి. పిల్లలు స్కూల్లో తినడానికి సర్దే బాక్సులో తప్పకుండా వాటిని అందించాలి. అందులోనూ ఇప్పుడు పిల్లలకు రెండు స్నాక్ బాక్సులు పెడుతున్నారు. వాటి ద్వారా సాధ్యమైనంత బలవర్ధకమైన ఆహారాన్ని ఇవ్వాలి. ఉదయం బ్రేక్‌లో పండ్ల ముక్కలు పెట్టొచ్చు. వెళ్లిన రెండు గంటల్లోనే ఈ మొదటి స్నాక్ బాక్స్ ఖాళీ చేస్తారు కాబట్టి, ఏమాత్రం పాడుకావు. కాసేపటికే భోజనం చేస్తారు కాబట్టి, త్వరగా అరిగినా ఇబ్బంది ఉండదు.
ఇక లంచ్‌లో.. ప్రొటీన్, కార్బొహైడ్రేట్స్, కొవ్వులు ఉండేలా చూసుకోవాలి. సోయా పలావ్, రాజ్మాచనా చావల్, పనీర్ పలావ్, పనీర్ రోటీ లాంటివి పెట్టొచ్చు. అంతేకాదు, వారంలో మూడు రోజులు ఆకు కూరలూ ఉండాలి. పుదీనా రైస్, పాలక్ పలావ్, మేతీ రోటీలాంటివి చేయొచ్చు. మల్టీగ్రెయిన్ బ్రెడ్‌లో పనీర్‌ను చిదిమి శాండ్
విచ్‌లా పెట్టొచ్చు. క్యాబేజీ, బీన్స్లాంటి కూరగాయల్ని ఉడికించి ఉప్పు, చాట్‌మసాలా చిలకరించి చపాతీతో రోల్లా చుట్టొచ్చు. పప్పు, పెరుగుతో పిల్లలు ఇష్టంగా తింటారు. ఇలాగే, పనీర్ రోల్ కూడా చేసుకోవచ్చు.
పెరుగన్నంలో దానిమ్మగింజల్లాంటివి కలిపి పోపు పెట్టినా బాగుంటుంది. నూడుల్స్ ఇష్టపడే వాళ్లయితే మిల్లెట్ నూడుల్స్ ఉత్తమం. ఇలా పిల్లలు ఇష్టపడేలా రకరకాల రూపాల్లో చక్కని పోషకాలను టిఫిన్ బాక్స్‌తో అందించవచ్చు. రెండో స్నాక్… అంటే సాయంత్రం తినే స్నాక్ లేదా బస్ స్నాక్ కోసం డ్రై ప్రూట్స్ మంచివి. డ్రై ఫ్రూట్స్ లడ్డు, డ్రై ఫ్రూట్ చిక్కీలాంటివి పెట్టొచ్చు. గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజల్లో నెయ్యి, మిరియాల పొడి కలిపి లేదా నెయ్యి, బెల్లం పొడి జోడించి అందించవచ్చు.
మయూరి ఆవుల ,న్యూట్రిషనిస్ట్
Mayuri.trudiet@gmail.com