మంచి ప్రతిభ కనబరిచిన వారికే ఇప్పుడు పాఠశాలల్లో అడ్మిషన్. తల్లీతండ్రీ కూడా డిగ్రీలు పాసై ఉంటేనే బళ్లో చేరిక. అప్పుడు కూడా వాళ్లు పెట్టిన పరీక్షల్లో నెగ్గితేనే తరగతి గదికి తలుపులు తెరుచుకునేది. కానీ లద్దాఖ్‌లోని ఆ పాఠశాలలో అడ్మిషన్ పొందేందుకు అర్హత, పరీక్షల్లో ఫెయిల్ అవ్వడమే! అదీ కాదంటే బడి మానేసి ఉండాలి. అలాంటి పిల్లల్ని చేర్పించుకొని వాళ్ల పరాజయానికి కారణాలు విశ్లేషిస్తారు. ఆ తర్వాత పిల్లలే తమ గెలుపు దారులు మలచుకొనేలా శిక్షణనిస్తారు. ప్రపంచంలోనే విభిన్నమైన కాన్సెప్ట్‌తో పనిచేస్తున్న ఈ పాఠశాల స్థాపన వెనుక ప్రముఖ విద్యావేత్త, ఆవిష్కర్త సోనమ్ వాంగ్‌చుక్ కృషి ఉంది.
Sonam Wangchuk India 2
-30 డిగ్రీల సెల్షియస్లోనూ తరగతి గదులు వెచ్చగా ఉండేలా పిల్లలు చక్కగా చదువుకోగలిగేలా దీన్ని ఏర్పాటుచేశారు. అందుకే ఈ ప్రాంతంలో చలికాలంలో కూడా తెరిచి ఉండే ఏకైక బడి ఇది. అక్కడి ప్రభుత్వ పాఠశాలల టీచర్లకూ ఇక్కడే శిక్షణా తరగతులు నిర్వహిస్తారు.
హిమాలయ పర్వత సానువుల్లో ఏడాదిలో చాలా రోజులు మంచుదుప్పటి కప్పుకొనే ఉంటుందా ప్రాంతం. ఎత్తయిన చెట్లు, శీతల పవనాలు, కనుచూపు మేర విశాలంగా కనిపించే ఎగుడు దిగుడు కొండలు… లద్దాఖ్‌ను ఓ విశిష్ట ప్రదేశంగా మార్చేశాయి. అయితే అక్కడ చదువులు మాత్రం ఈ చోటులాగే ఆహ్లాదంగా ఉండవు. ర్యాంకులతో దూసుకుపోవడం సంగతి పక్కనపెడితే అసలు పాస్ అవ్వడమే గగనం. కచ్చితంగా ఇరవై ఏండ్ల క్రితం లద్దాఖ్ బళ్లలో పదోతరగతి ఉత్తీర్ణత శాతం కేవలం 5. గడ్డకట్టే చలి, నీళ్ల కొరత, అక్కడి జీవనశైలి-సంస్కృతులకు దూరంగా ఉండే సిలబస్‌లు… కారణాలు అనేకం.
ఆయా పరిస్థితుల్ని విశ్లేషిస్తూ, పిల్లల సమగ్ర అభివృద్ధిని ఉద్దేశిస్తూ సోనమ్ వాంగ్‌చుక్ ఆధ్వర్యంలో మరికొందరు ఆ ప్రాంతపు విద్యార్థుల భాగస్వామ్యంతో, 1988 సంవత్సరంలో రూపుదిద్దుకున్నదే స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ మూమెంట్ ఆఫ్ లద్దాఖ్ (ఎస్ఈసీఎంవోఎల్) స్కూల్ ప్రాజెక్టు. ఇది అక్కడి విద్యార్థుల జీవితాల్లో అద్భుతాన్ని ఆవిష్కరించింది. ప్రముఖ బాలీవుడ్ సినిమా త్రీ ఇడియట్స్‌లో కొత్తరకం విద్యాసంస్థను నడిపే అమీర్‌ఖాన్ పాత్రకు స్ఫూర్తి సోనమ్ వాంగ్‌చుక్ అవ్వడానికి నేపథ్యం ఈ పాఠశాలే!
అంతా విభిన్నమే…
సాధారణ బళ్లలో ఉండే మెరిట్ బేస్ అన్నది ఇక్కడ పూర్తి భిన్నం. పరీక్షల్లో ఫెయిల్ అయిన లేదా డ్రాపవుట్లుగా ఉన్న విద్యార్థుల్ని ఇక్కడ చేర్పించుకుంటారు. ముఖ్యంగా బోర్డు పరీక్షల్లో నెగ్గని పిల్లలకు ప్రాధాన్యమిక్కడ. సముద్ర మట్టానికి సుమారు 11,500 అడుగుల ఎత్తులో, హిమాలయ పర్వతాల మధ్య లేహ్ పట్టణ సమీపంలో ఉందీ పాఠశాల. ఇక్కడ కరిక్యులమ్ ఇదీ అంటూ నిర్దిష్టంగా ఏమీ ఉండదు. సైన్స్, సోషల్లాంటి సబ్జెక్టులు కూడా నిజజీవితం ఆధారంగానే నేర్పుతారు.
పరిసరాల పరిరక్షణ, మొక్కల పెంపకం, జంతువుల సంరక్షణ, లద్దాఖ్ సంస్కృతిని ప్రతిబింబించే ఆటలు పాటల్లాంటివి అందులో ఉంటాయి. నలుగురిలో మాట్లాడటం, సమస్యలకు పరిష్కార మార్గాలు చూపడం, వినూత్న ఆలోచనలను పంచుకోవడం, బృంద చర్చలు లాంటివి ప్రాక్టికల్‌గా నేర్చుకుంటారు. ఇంటర్న్‌షిప్‌లు, క్షేత్రస్థాయి పర్యటనల ద్వారా బయట నిజంగా ఎలాంటి అవసరాలు ఉంటాయి అన్నది గ్రహిస్తారు. అనుభవపూర్వక విద్య అన్నది ఇక్కడి కాన్సెప్ట్ కావడంతో పిల్లలు ప్రతిదాన్నీ ఉత్సాహంగా నేర్చుకుంటారు. చక్కగా గుర్తు పెట్టుకుంటారు.
ఇక, 20 ఎకరాల సువిశాల ప్రాంగణం ఈ బడి సొంతం. మొత్తం సౌర విద్యుత్తుతో నడిచేలా దీన్ని నిర్మించారు. అంటే లైట్లు, వంటతోపాటు భవంతులను వెచ్చబరిచేందుకూ ఇదే మూలాధారం.-30 డిగ్రీల సెల్షియస్లోనూ తరగతి గదులు వెచ్చగా ఉండేలా పిల్లలు చక్కగా చదువుకోగలిగేలా దీన్ని ఏర్పాటుచేశారు. అందుకే ఈ ప్రాంతంలో చలికాలంలో కూడా తెరిచి ఉండే ఏకైక బడి ఇది. ప్రభుత్వం, స్థానిక సంస్థలు, ప్రజల భాగస్వామ్యంతో నడుస్తున్న ఈ బడిలోనే అక్కడి ప్రభుత్వ పాఠశాలల టీచర్లకూ శిక్షణా తరగతులు నిర్వహిస్తారు. స్థానిక విషయాల ఆధారంగా పాఠ్యపుస్తకాలను రూపకల్పన చేసేందుకూ ఇది సహకరిస్తున్నది.
మొత్తానికి ఈ బడి, దానివల్ల చదువుల్లో వచ్చిన మార్పుల కారణంగా ఇరవై ఏండ్ల క్రితం 5 శాతంగా ఉన్న పదో తరగతి ఉత్తీర్ణత శాతం, ఇప్పుడు 75కి చేరింది. ఈ విద్యా విధానాన్ని విశ్వవిద్యాలయ స్థాయికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో హిమాలయన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ స్టడీస్‌కు శ్రీకారం చుట్టారు వాంగ్‌చుక్. మంచు స్తూపాల నిర్మాణం ద్వారా వేసవిలో లద్దాఖ్ నీటి ఎద్దడిని తీర్చిన ఆయనలాగే మరెందరో ఆవిష్కర్తలు ఇక్కడినుంచి రావాలన్నది దీని స్థాపన వెనుక ఉద్దేశం. అదీ నెరవేరితే ఆ యూనివర్సిటీ భారత్‌కు ఓ విలువైన ఆస్తిగా మారనుంది.
Sonam Wangchuk 2 Arvind Jai