పడక గది పచ్చగా కళకళలాడాలంటే.. కుండీల్లో మొక్కలను పెంచుకోవాల్సిందే! కాకుంటే.. మొక్కలు ఆరోగ్యంగా పెరగాలంటే సూర్యరశ్మి కావాల్సిందే! అలాంటప్పుడు సూర్యరశ్మి అవసరం లేని మొక్కలను ఎంచుకుంటే చాలు. కొన్ని మొక్కలు తక్కువ కాంతిలోనే చక్కగా పెరుగుతాయి. కాబట్టి, బెడ్రూములోనూ వాటిని భేషుగ్గా పెంచుకోవచ్చు.
ఫిలోడెండ్రాన్ ప్లాంట్ : గాలిని శుద్ధి చేయడంలో ఈ మొక్క సమర్థంగా పనిచేస్తుంది. కాలుష్యం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇల్లు కట్టుకున్నవారికి ఈ మొక్క వరంలాంటిదే! దీన్ని కుండీలో పెంచుకొని.. పడగ గదిలో ఓ మూలన పెట్టేస్తే చాలు. తగినంత సూర్యరశ్మి లేకున్నా.. చక్కగా పెరుగుతుంది. గాలిని శుద్ధి చేస్తుంది. దీన్ని పెంచడం కూడా చాలా సులభం. చీడపీడలు సోకే అవకాశం కూడా ఉండదు. తగినన్ని నీళ్లు పోస్తే సరిపోతుంది.
సింగోనియం ప్లాంట్ : దీనికే ‘యారోహెడ్’ అని పేరు. ఈ మొక్క ఆకులు బాణపు తలల్లా ఉంటాయి. కాబట్టే.. ఆ పేరొచ్చింది. ఇవికూడా సులభంగా పెరుగుతాయి. ఆక్సిజన్‌ను పుష్కలంగా అందిస్తుంది. గాలిని శుద్ధి చేస్తుంది. చిన్నచిన్న కుండీల్లోనూ చక్కగా పెరుగుతాయి. పడక గదికి కొత్త అందాన్ని తీసుకొస్తాయి.