సామాజిక మాధ్యమాల ప్రభావమో.. సమాజాన్ని మరింతంగా అవగాహన చేసుకోవాలన్న ఆలోచనో.. ఈ మధ్య ట్రావెలర్లు పెరుగుతున్నారు. అందులోనూ ఒంటరిగా ప్రయాణిస్తూ.. విభిన్న ప్రాంతాలను ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. అయితే, ఇలా సోలోగా ట్రావెల్ చేసేవాళ్లు ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. లేకుంటే, లేనిపోని ఇబ్బందుల్లో పడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
ట్రావెలర్లు తమ పర్యటనకు సంబంధించిన ప్రతి విషయాన్నీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా చేయడం.. కొత్త సమస్యలను కొని తెచ్చుకున్నట్టే! ముఖ్యంగా సోలో ట్రావెలింగ్ చేస్తున్న మహిళలు మరింత జాగ్రత్తగా ఉండాలి. మీరు ఒంటరిగా ప్రయాణిస్తున్నట్టు బయటివారికి తెలియకపోవడమే మంచిది.
కొందరు ఎక్కడికి వెళ్లినా కొత్త స్నేహాలను ఏర్పరుచుకుంటారు. అయితే, ఒక మహిళగా ఒంటరిగా ప్రయాణం చేస్తున్నప్పుడు మరింత సురక్షితంగా ఉండాలన్న సంగతి గుర్తుంచుకోవాలి. కొత్తగా పరిచయమైన వ్యక్తులకు మీ ప్రయాణాల గురించి, మీరు ఎక్కడ ఉంటున్నదీ చెప్పాల్సిన అవసరం లేదు. ప్రయాణాల్లో కలిసే వ్యక్తుల్లో మంచివారితోపాటు చెడ్డవాళ్లూ ఉంటారన్న విషయం మర్చిపోవద్దు.
ప్రయాణాల్లో పరిచయమైన వ్యక్తులు ఆహ్వానించే పార్టీలకు వెళ్లకపోవడమే మంచిది. కొత్త వ్యక్తులు ఎవరైనా అనుమానాస్పదంగా, అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్నట్టు అనిపిస్తే.. అలాంటివారికి దూరంగా ఉండండి.
మీరు సందర్శిస్తున్న పరిసరాల గురించి కనీస అవగాహన కలిగి ఉండాలి. ఆయా ప్రాంతాల చరిత్ర.. ముఖ్యంగా, నేర చరిత్ర గురించి క్షుణ్నంగా తెలుసుకోండి. వీలైతే.. స్థానిక భాష కొంతైనా నేర్చుకోండి. దీనివల్ల ఎదుటివాళ్లు ఏం మాట్లాడుకుంటున్నారో.. మీరు అర్థం చేసుకోవచ్చు. మీ భద్రతను ప్రభావితం చేసే స్థానిక సంఘటనలు, వాతావరణ సూచనలనూ తెలుసుకోండి.
మీరు ఏయే ప్రాంతాలను సందర్శిస్తున్నారో.. ఏ రోజు ఎక్కడ ఉంటారో మీ కుటుంబసభ్యులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉండండి.