పెద్ద కంపెనీలో కొలువు, అధిక వేతనం.. కాలేజీ చదువు పూర్తయినవాళ్ల కోరిక. ఇది తీరాలంటే ఎన్నో కష్టాలు తప్పవు. అవన్నీ ఫలించి కొలువు దొరికితే జీవితం సాఫీగా సాగిపోతుందని ఎంతోమంది ఆశ. అలాంటి ఆశలతో సాఫ్ట్వేర్ కంపెనీ అడాబ్లో అడుగుపెట్టిన హర్షాలి కొఠారి ఆలోచన మరోలా ఉంది. ఏడాదికి రూ.32 లక్షల వేతనం ఇచ్చే ఉద్యోగం వదులుకొని, సన్యాసినిగా మారాలనుకుంటున్నది.
హర్షాలి కొఠారి రాజస్థాన్లోని బీవార్లో పుట్టింది. వాళ్ల నాన్న ఆటోమొబైల్ వ్యాపారి. లాక్డౌన్ సమయంలో ఇంటి వద్ద నుంచే పనులు చేస్తూ ఉండేది. ఆ సమయంలో జీవితానికి అర్థమేమిటో తెలుసుకోవాలని ఆమెకు గాఢమైన కోరిక కలిగింది. ఆ సత్యాన్వేషణలో జైన మత పెద్దలను సంప్రదించడం, ఆధ్యాత్మిక విశేషాలను తెలుసుకోవడం మొదలుపెట్టింది.
నెమ్మదిగా ఆమెలో ఉద్యోగం చేయాలనే ఆసక్తి పోయింది. జీవిత సత్యాలను తెలుసుకుంటూ బతకాలనే కోరిక బలమైంది. చివరికి ఉద్యోగాన్ని వదిలిపెట్టాలనుకుంది. ప్రాపంచిక సుఖాలు, వారసత్వంగా వచ్చిన ఆస్తులన్నిటినీ త్యజించి, జైన దీక్ష స్వీకరించాలని హర్షాలి నిర్ణయించుకుంది. చాతుర్మాస వేడుకల సందర్భంలో జైన సాద్విగా మారడానికి నిశ్చయించుకుంది. రానున్న డిసెంబర్ మూడో తేదీన హర్షాలి సన్యాస దీక్ష స్వీకరణకు ముహూర్తం నిర్ణయమైంది.