ఒకప్పుడు పత్రికలు, టీవీ చానెల్స్ మాత్రమే వార్తలకు వేదికలు. ఇప్పుడు మొబైల్ చేతిలో ఉన్న ప్రతి ఒక్కరూ ‘పబ్లిషర్” అయిపోయారు. సోషల్ మీడియా ఎవరూ ఊహించని స్థాయిలో మారింది. ఇంట్లో ఉన్నా, బయట తిరుగుతున్నా, ఆలోచనలను, ఫొటోలను, వీడియోలను ఒక్క క్లిక్‌తో ప్రపంచంతో పంచుకుంటున్నారు. అంతేకాదు.. మరోవైపు ఎవరికి వారే ‘మేమే ప్రజల గొంతుక’ అని చెప్పుకొంటున్నారు. సమాచారం వేగంగా వ్యాప్తి చెందేలా చేస్తున్నారు. అభిప్రాయాల్ని బలంగా రుద్దుతున్నారు. దీన్నే స్వేచ్ఛగా అభివర్ణిస్తున్నారు. కానీ, స్వేచ్ఛ పేరుతో ఫేక్ న్యూస్ రాజ్యమేలుతున్నది. ఆన్లైన్లో దూషణలు, ఇన్ఫ్లూయెన్సర్ విజిలాంటిజం ఇవన్నీ సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో…
‘సోషల్ మీడియా ఫ్రీడమ్’ నియంత్రణలో ఉండాలన్న వాదన బలంగా వినిపిస్తున్నది.
మన అభిప్రాయాలు పంచుకునే స్వేచ్ఛ సోషల్ మీడియా ఇచ్చింది. కానీ, ఈ స్వేచ్ఛను సరిగ్గా ఉపయోగించాలి. ఇతరుల హక్కులను గౌరవించాలి. కానీ, కొందరు ఇన్ఫ్లూయెన్సర్లు, కంటెంట్ క్రియేటర్లు ఈ స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారు. ఆన్లైన్ విజిలాంటిజం అంటూ వ్యక్తులు, సంస్థలపై ఆరోపణలు చేస్తున్నారు. ఎలాంటి నిజ నిర్ధారణ లేకుండా దాడికి పాల్పడుతున్నారు! ఒకప్పుడు గానీ.. ఇప్పుడు గానీ.. విలేకరులు ప్రత్యేక నియమావళి ఆధారంగా వార్తలు రాస్తుంటారు. కానీ, ఇప్పుడు కొందరు డిజిటల్ జర్నలిస్టులు, కంటెంట్ క్రియేటర్లు కేవలం వైరల్ కావడానికి సంచలనాలు వెదుకుతున్నారు. నిర్ధారణ లేకుండా ఆరోపణలు చేస్తున్నారు.
జనాలపై వీధిలోనే తీర్పులు ఇచ్చేస్తున్నారు.. ఇలా ఇన్ఫ్లూయెన్సర్లు తమ ఫాలోవర్లకు న్యాయం చేస్తున్నామని చెప్పుకొంటున్నారు. తప్పు చేసిన వాళ్లను వదిలిపెట్టమని వీడియోలు పెడుతున్నారు. అయితే, ఆ విషయం నిజమా కాదా అని ధ్రువీకరించే ప్రయత్నం కూడా చేయడం లేదు. దీనివల్ల సమాంతర న్యాయ వ్యవస్థ ఏర్పడుతుంది. అది చట్టం మీద కాక, ప్రజల అభిప్రాయం మీద పనిచేసే పరిస్థితికి దారితీస్తుంది. దీనివల్ల మూక వేధింపులు (మాబ్ హరాస్మెంట్), పరువు నష్టం (రెప్యూటేషన్ డ్యామేజ్) లాంటి సమస్యలు వస్తాయి. ఒక వ్యక్తి మీద తప్పుడు ఆరోపణ వస్తే అది అతని కుటుంబాన్ని, జీవితాన్నీ తీవ్రంగా దెబ్బతీస్తుందని గ్రహించడం లేదు.
ఇప్పుడు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యేది నిజం కాదు.. ఆసక్తికరమైనదే. ఫొటోషాప్ చిత్రాలు, అర్థం లేని ప్రచారాలు ఇవే ట్రెండ్ అవుతున్నాయి. సింపుల్‌గా చెప్పాలంటే.. సామాజిక మాధ్యమాలు ఫేక్ న్యూస్ అడ్డాలుగా మారిపోయాయి. ఎవరైనా ఓ డాక్టర్ చేసిన వీడియో చూశాం అనుకుందాం.. దాంట్లో చెప్పిన విషయం నిజమా, అబద్ధమా అని తెలుసుకునే లోపు అది లక్షల మందికి చేరిపోతున్నది. ఉదాహరణకు వృద్ధులపై కరోనా గతంలో కంటే ప్రమాదకరంగా ప్రభావం చూపుతుందని ఎవరో వీడియో చేస్తే చాలు.. అది క్షణాల్లో వైరల్ అయిపోతున్నది. ఈ తరహా ఫేక్‌న్యూస్ కారణంగా సామాజిక ఉద్రిక్తతలు, రాజకీయ విభేదాలు, ఆర్థిక మోసాలు జరిగే ప్రమాదం ఉంది. ఏదైనా రాజకీయ పార్టీ గురించి తప్పుడు ప్రచారం జరిగితే.. ఒక్క ఓటుతో ప్రజా నిర్ణయం మారిపోవచ్చు. ఎలాంటి నియంత్రణ లేకపోవడం వల్ల.. సామాజిక మాధ్యమాల్లో షాకింగ్, లౌడ్ కంటెంట్ మాత్రమే ముందుకొస్తున్నది. దీనివల్ల సమాజానికి తీవ్రమైన హాని కలుగుతున్నది.
చివరగా, స్పాన్సర్డ్ కంటెంట్, రాజకీయ మోటివ్ ఉన్న పోస్టులకు అది ఎలాంటి సమాచారమో తెలుపుతూ మాండేటరీ డిస్క్లోజర్స్ ఉండాలి. దీనివల్ల ఏది నిజమో, ఏది ప్రచారమో తెలుసుకునే అవకాశం ఉంటుంది.
చట్టానికి సోషల్ మీడియా అతీతం కాదు, అలా ఉండకూడదు కూడా! ఇది అద్భుతమైన స్పేస్. దీన్ని గౌరవిస్తూ మరింత పెంపొందించుకోవాలి. నిర్లక్ష్యం చేయకూడదు. రెగ్యులేషన్ అంటే సెన్సార్షిప్ కాదు, అకౌంటబిలిటీ. ఇన్ఫ్లూయెన్సర్లు, జర్నలిస్టులు అందరూ స్వేచ్ఛను ఆస్వాదించాలి, కానీ దాన్ని దుర్వినియోగం చేయకూడదు. దీనికోసం ప్రభుత్వాలు, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్, క్రియేటర్స్, సమాజం అందరూ కలిసి ఒక ఆరోగ్యకరమైన డిజిటల్ ఎకో సిస్టమ్‌ను నిర్మించాలి.
సోషల్ మీడియాను నియంత్రించడం అంటే స్వేచ్ఛను హరించడం కాదు.. బాధ్యతను జోడించడం! హేట్ స్పీచ్, ఉద్రిక్తతలు రెచ్చగొట్టే కంటెంట్, వ్యక్తిగత దూషణలు, తప్పుడు సమాచారం.. స్వేచ్ఛ పేరుతో ఇలాంటి కంటెంట్ ఇస్తామంటే అడ్డు చెప్పాల్సిందే. ట్రోలింగ్, షేమింగ్… ఇవన్నీ చూసి బాధపడే వాళ్లు ఎవరో కాదు, మనలాంటి వాళ్లే. ఇలాంటి సందర్భాల్లో నియంత్రణ అవసరం. అయితే, ఇది సెన్సార్షిప్ కాకూడదు.. స్వేచ్ఛ, బాధ్యత మధ్య సమతుల్యం ఉండాలి. సోషల్ మీడియా సాధికారత సాధనంగా ఉండాలి. అంతేతప్ప అరాచకానికి ఆయుధంగా మారకూడదు.
– అనిల్ రాచమల్ల వ్యవస్థాపకులు ఎండ్‌నౌ ఫౌండేషన్