మహిళలకు రంగురంగుల దుస్తులంటే ఇష్టం. వాటిమీదికి మ్యాచింగ్ నగలు ఉంటే మరీ ఇష్టం. అలాగని ప్రతి కట్టుకూ ఆకట్టుకునే నగల సెట్టు కొనడం అందరికీ సాధ్యమయ్యే పనికాదు! అందుకే, ఇంద్ర ధనుస్సు వన్నెలన్నీ ఏరుకొని తమలో పొదుగుకున్న జువెలరీని సిద్ధం చేసుకుంటే సరి! మల్టీకలర్ ఆభరణాలు ఇప్పుడు ట్రెండ్. అంటే ఒకే నగలో రకరకాల రత్నాలు ఉంటాయన్నమాట. రంగురాళ్ల మెరుపులు సంతరించుకున్న ఈ నగలపై జవరాళ్లు మోజుపడుతున్నారు. ఆధునిక మగువలు ఇష్టంగా సొంతం చేసుకుంటున్న మల్టీకలర్ జువెలరీ విశేషాలివి..
ఇంట్లో శుభకార్యం, గుడిలో రాములోరి కల్యాణం, ఆఫీస్లో వీకెండ్ పార్టీ.. సందర్భానికి తగ్గట్టుగా కట్టూబొట్టూ నడిపిస్తారు మహిళలు. ఓసారి పట్టుచీరకు, ఇంకోసారి జార్జెట్ శారీకి, మరోసారి లాంగ్స్కర్ట్కు ఓటేస్తారు. అయితే ఆహార్యం ఏదైనా.. వాటి మీదికి ఈ మల్టీకలర్ జువెలరీ అందంగా అమరుతాయి. సాధారణ నగల్లాగే వీటిలోనూ కంఠాభరణాలు, ఉంగరాలు, చెవి కమ్మలు.. ఇలా ఒక్కటేమిటి మహిళలు ధరించే అన్నిరకాల నగలూ అందుబాటులోకి వచ్చేశాయి. పసిడి నగలు మాత్రమే కాదు.. వెండి, జిర్కోనియం, ప్లాటినమ్ లాంటి లోహాలతో చేసిన ఆభరణాలూ సిద్ధంగా ఉంటున్నాయి.
నవరత్నాలు పొదిగిన ఉంగరాలు, గొలుసులు చాలాకాలం నుంచీ ప్రాచుర్యంలో ఉన్నవే. ఇవి తొమ్మిది రకాల రత్నాలతో, తొమ్మిది రంగులతో పసందుగా కనువిందు చేస్తాయి. ఈ మల్టీకలర్ జువెలరీ వీటికి మించిన రంగు హంగులను కలిగి ఉంటున్నాయి. రెయిన్ బో జువెలరీ ఎంచుకున్న ఇంతి.. ప్రకృతి కాంతలా మెరిసిపోవడం ఖాయం. భారీ ఆభరణాల నుంచి సన్నని గొలుసుల వరకు రకరకాల పరిమాణాల్లో ఇవి పడతులను పడగొడుతున్నాయి. ఆసక్తి, ఓపిక ఉన్నవాళ్లు రంగురంగుల పూసలు తెచ్చుకొని నచ్చిన రీతిలో హారాలు గుచ్చుకోవచ్చు. వాటిని ధరించి మరింత ఇంపుగా వయ్యారాలు పోవచ్చు.