బెల్లం పాకంలో తేలాడుతూ, మెలికలు తిరిగి నోరూరించే జిలేబీని చూస్తే.. లటుక్కున నోట్లో వేసుకోవాలనిపిస్తుంది. ఆలూకర్రీని తురుముకొని మైదా దుప్పటి కప్పుకొని.. సెగలు కక్కే సమోసా తినడం అదృష్టంగా భావిస్తాం. చోరీ చేసైనా కచోరీ తినాలనిపిస్తుంది. అయితే, వీటి విషయంలో జిహ్వచాపల్యానికి వశపడిపోతే, ఆరోగ్యం మూడినట్టే అని హెచ్చరిస్తున్నాయి భారత పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్), భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) సంస్థలు. జిలేబీ, సమోసా, చాట్‌లో ఉపయోగించే పిండిపదార్థాలన్నీ ఎక్కువగా ప్రాసెస్ చేసినవి. వీటిలో కార్బొహైడ్రేట్స్ అధికంగా ఉంటాయని తెలిసిందే. పైగా వీటిని నూనెలో బాగా వేయిస్తారు. అందువల్ల ఈ చిరుతిళ్లలో ట్రాన్స్‌ఫ్యాట్ కూడా అధికంగానే ఉంటుంది. ఎంత తక్కువగా లెక్కించినా ఒక జిలేబీ తింటే 200 నుంచి 300 కేలరీల శక్తి శరీరానికి అందుతుంది.
సమోసాలను అనేక వాయిల్లో నూనెలో వేయిస్తారు. నూనెను పదే పదే వాడుతుంటారు. కచోరీ తయారీలో కూడా అధికంగా ప్రాసెస్ చేసిన పిండిపదార్థాలు, నూనె మళ్లీ మళ్లీ ఉపయోగిస్తుంటారు. కాబట్టి ఈ మూడు స్నాక్స్ తినేవాళ్లు కాస్త జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. ఈ హెచ్చరికలు పట్టించుకోకుండా పదే పదే తిన్నారంటే ఊబకాయం, డయాబెటిస్‌తోపాటు తీవ్రమైన గుండెజబ్బుల బారినపడే ప్రమాదం ఉందని ఐసీఎంఆర్, ఎన్ఐఎన్ హెచ్చరిస్తున్నాయి. అన్ని రకాల సమోసాలు, జిలేబీ, కచోరీ వల్ల ఈ సమస్యలు వస్తాయి. సాదాసీదాగా చేస్తేనే వీటివల్ల ముప్పుందనుకుంటే.. అదనపు రుచి కోసం, నిల్వ కోసం ఈ స్నాక్స్‌లో నానా రకాల రసాయనాలు వాడేస్తున్నారు. వీటిని ఆబగా తింటే ప్రాణాంతకమైన జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. ఈ చిరుతిళ్లను రెగ్యులర్‌గా కాకుండా, అమాసపున్నానికి ఒకసారి అలా తింటే ఫర్వాలేదని ఐసీఎంఆర్ పరిశోధకులు సూచిస్తున్నారు.