రోజుకు ఓ ఆపిల్ పండు తింటే డాక్టర్ అవసరం రాదని అంటారు. హిమాలయ పర్వత రాష్ర్టాలైన హిమాచల్ ప్రదేశ్, కశ్మీర్ మనదేశంలో ఆపిల్ పంటకు ప్రసిద్ధి. ప్రస్తుతం ఎన్నో రకాల ఆపిల్ పండ్లు సాగవుతున్నాయి. వాటిలో ఆరు రకాలు బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. తియ్యగా, పుల్లగా ఉండే ఆపిల్ పండ్లు విటమిన్లు, ఫైబర్, ఇతర పోషకాలకు గనులు. పండుగానే కాకుండా సలాడ్లలో, డెజర్ట్‌గానూ వీటిని తినొచ్చు.
సిమ్లా ఆపిల్
ఆకట్టుకునే రంగుతో తియ్యగా, రసభరితంగా నోరూరించే సిమ్లా ఆపిల్ అంటే మనసు పారేసుకోని వారుండరు. హిమాచల్ ప్రదేశ్‌లోని హిమాలయ పర్వత సానువుల్లో సముద్ర మట్టానికి ఆరువేల అడుగుల ఎత్తులో ఈ చెట్లు పెరుగుతాయి. సిమ్లా ఆపిల్‌లో విటమిన్లు ముఖ్యంగా విటమిన్ సి, ఫైబర్, యాంటి ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అరుగుదలకు సహాయకారిగా ఉంటాయి. జలుబు, ఇన్ఫెక్షన్లతో పోరాటానికి తగినన్ని యాంటి ఆక్సిడెంట్లను శరీరానికి ఇస్తాయి. సిమ్లా ఆపిల్ ముక్కలను వాల్‌నట్స్‌తో మేళవించి, తేనె చల్లుకుని సలాడ్‌గా ఆరగిస్తే మంచిది.
కశ్మీర్ ఆపిల్
అందాల కశ్మీర్ లోయ ఈ రకం ఆపిల్స్కు ప్రసిద్ధి. తియ్యగా, రసభరితంగా ఉండే కశ్మీర్ ఆపిల్స్ ఇతర రకాలతో పోలిస్తే లేత ఎరుపు రంగులో ఉంటాయి. తక్కువ కొలెస్ట్రాల్ ఉంటుంది కాబట్టి, గుండె ఆరోగ్యానికి మంచివి. అంతేకాదు, ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. చర్మం, వెంట్రుకలకు కూడా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. యాలకులు, దాల్చినచెక్కను మేళవించి మన రుచికి తగినవిధంగా కశ్మీర్ యాపిల్‌తో పచ్చడి చేసుకోవచ్చు.
రాయల్ గాలా ఆపిల్
లేత ఎరుపు, ఎరుపు, గులాబీ రంగుల్లో ఉంటాయి. కరకరలాడుతూ నోట్లో రసాలూరిస్తూ తియ్యగా ఉంటాయి. ఇవి కశ్మీర్లో పండుతాయి. పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. దీంతో రక్తపోటు (బీపీ) ఆరోగ్యకరమైన స్థాయిలో ఉంటుంది. భోజనం తర్వాత డెజర్ట్‌తో రాయల్ గాలా ఆపిల్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో.
ఇండియన్ గ్రానీ ఆపిల్
హిమాచల్ ప్రదేశ్, కశ్మీర్ రాష్ర్టాల్లో ఇవి పండుతాయి. ఆకుపచ్చ రంగులో కరకుగా రసభరితంగా ఉండే ఇండియన్ గ్రానీ ఆపిల్స్ రుచికి పుల్లగా ఉంటాయి. విటమిన్ సి, ఫైబర్, పొటాషియం, ఇతర విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. గుండెపోటు, పక్షవాతం ముప్పును తగ్గిస్తాయి. కడుపు నిండిన అనుభూతిని ఇస్తాయి. అలా బరువు తగ్గడానికి దోహదం చేస్తాయి.
గోల్డెన్ డెలీషస్ ఆపిల్
కశ్మీర్లో పండిస్తారు. బంగారు పసుపు రంగులో రసభరితంగా, చాలా తియ్యగా ఉంటాయి. ఇవి శరీరంలో సూక్ష్మక్రిములకు వ్యతిరేకంగా పోరాడే శక్తిని ఇస్తాయి. జీవక్రియలకు తగిన శక్తిని ప్రసాదిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రిస్తాయి. శరీరంలో కలుషిత పదార్థాలను బయటికి (డిటాక్సిఫై) పంపిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలా శరీరానికి ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. గోల్డెన్ డెలీషస్ ఆపిల్ పై తింటే శరీరానికి మంచి పోషకాలు అందుతాయి.
కిన్నౌర్ ఆపిల్
హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో కిన్నౌర్ జిల్లాలో పండుతాయి. హిమాలయా పర్వత సానువుల్లో దాదాపు 7 వేల అడుగుల ఎత్తులో రైతులు వీటిని సాగుచేస్తుంటారు. ముదురు ఎరుపు రంగులో నోరూరించే కిన్నౌర్ ఆపిల్స్ తింటే కరకరలాడుతాయి. విటమిన్ సి, ఫైబర్, యాంటి ఆక్సిడెంట్లు పుష్కలం. ఇవి అరుగుదలకు, రోగ నిరోధక శక్తి పెరగడానికి దోహదం చేస్తాయి. బరువు తగ్గడానికి, నోటి ఆరోగ్యానికి మేలుచేస్తాయి. కిన్నౌర్ ఆపిల్‌ను దోరగా కాల్చుకుని తింటూ చలికాలం సాయంత్రాల్లో ఆహ్లాదాన్ని అనుభూతి చెందవచ్చు.