సంగీతం, సాహిత్యం పాటకు తల్లిదండ్రులైతే.. అమృతం నింపుకొన్న గాత్రంతో ఆ పాటకు జన్మనిచ్చే గాయకులు ఏమవుతారు? ఆ సందేహమే ఆమెను ఓ మ్యూజికల్ బ్యాండ్‌కు కింగును చేసింది. ఒక్కపాటతో వైరల్ అవుతున్న గాయకులు ఉన్న ఈ జమానాలో.. వంద సినిమాల్లో వీనులవిందు చేసిన ఆమెకు తన అస్తిత్వం ప్రశ్నార్థకంగానే తోచింది! ‘ఈ పాట పాడింది నేనే’ అని చెప్పుకోవాల్సి రావడమేంటని ప్రశ్నించుకుంది. అంతే, హుషారుగా గొంతు సవరించుకుంది. రికార్డింగ్ స్డూడియోలోని అద్దాల గదికి మాత్రమే పరిమితమైన తన కీర్తిని మరెందరికో స్ఫూర్తినిచ్చేలా చాటిచెప్పాలనుకుంది. తను పాడిన, రాసిన పాటలను పదిమందిలో ప్రత్యక్షంగా వినిపించడానికి ఓ వేదికను నిర్మించుకుంది. ఇప్పుడు స్ఫూర్తి జితేందర్ యాదగిరి తెర వెనుక ఉండే ప్లే బ్యాక్ సింగర్ కాదు.. రాక్ బ్యాండ్‌తో ఒరిజినల్స్ ఆలపించే లీడ్ సింగర్!!
Spoorthi Yadagiri | పోరగాళ్ల గుండెల్ని పిండేసిన పాట ‘ఉండిపోరాదే.. గుండె నీదేలే…’ ఎంత పాపులరో తెలిసిందే! ఆ పాట ఎంత అలరించిందో.. దానికి ఫీమేల్ వెర్షన్‌గా వచ్చిన ‘ఉండి పోతారా.. గుండె నీవేరా’ పాట కూడా అంతే హిట్టు కొట్టింది. ‘హుషారు’ సినిమాలోని ఈ పాటకు యూట్యూబ్ ప్లే లిస్ట్‌లో మిలియన్ల వ్యూస్ ఉన్నాయి. ఈ పాట వింటున్నప్పుడు ‘ఇది సినిమాలో మిస్సయ్యామా?’ అనే సందేహం కలగడం సహజమే. ఈ పాట సినిమాలో లేదు. ‘హుషారు’ జ్యూక్బాక్స్లో మాత్రం వినిపిస్తుంది.
ఈ పాట రాసిందీ, ఆలపించిందీ స్ఫూర్తినే. ‘ఆర్ఎక్స్ 100’ సినిమా గుర్తుందిగా! అందులోని ‘పిల్లా రా’ పాట మర్చిపోగలమా!! దానికి మ్యాంగో మీడియా రాయించుకున్న ఫీమేల్ వెర్షన్ ‘పిల్లోడా..’ కూడా ఆమే రాసింది. వంద సినిమాల్లో ప్లే బ్యాక్ సింగర్‌గా తెరవెనుకే ఉండిపోయిన స్ఫూర్తి ఇప్పుడు స్క్రీన్‌పై మెరిసిపోతున్నది. కొత్తగా ‘రాక్ బ్యాండ్’లో లీడ్ సింగర్‌గా అదరగొడుతున్నది. ఈ బ్యాండ్ ఏర్పాటు వెనుక పెద్ద కథే ఉంది. లీడ్ సింగర్ మారడానికి తనకో ప్రత్యేకమైన లక్ష్యం ఉందని చెబుతున్నది ఆమె.
‘సినిమాల్లో పాడే అవకాశం దక్కడం కెరీర్లో మొదటి అడుగు. రెండో అవకాశం దక్కించుకున్నప్పుడు ఇంకో మెట్టు ఎక్కిన ఫీలింగ్ రావాలి కదా! కానీ, వంద సినిమాల్లో పాడినా కింది మెట్టు మీద ఉన్నట్టే అనిపించింది. ఏదో అసంతృప్తి వెంటాడింది. సూపర్ హిట్ పాటలు పాడినా, వాటికి మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చినా… ఆ పాట పాడింది నేనే అని ఎంతమందికి తెలుసు? అది నేనే పాడానని ప్రతి చోటా చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఇంకా చెప్పాలంటే ప్లే బ్యాక్ సింగర్‌గా తెర వెనుకే ఉండిపోయాను అనిపించింది.
నాకు పదేండ్లు ఉన్నప్పుడు సినిమా రంగంలోకి అడుగుపెట్టాను. ట్రినిటి కాలేజ్‌లో ఎయిట్ గ్రేడ్ మ్యూజిక్ కోర్స్ చేశాను. డబ్బింగ్ ఆర్టిస్ట్, రైటర్, సింగర్, కంపోజర్, ట్యూటర్‌గా ఎన్నో ప్రయత్నాలు, ప్రయోగాలు చేశాను. సంగీతమే జీవితమన్నట్టుగా దశాబ్దం గడిచిపోయింది. ఎంత గొప్ప పాట రాసినా, పాడినా, అవి ఎంతగా అలరించినా.. ఆ సక్సెస్ నాకు దక్కకుండా పోతున్నదని అనిపించింది. అందుకే నా అస్తిత్వాన్ని చాటుకోవాలని ‘Spoo J’s VROOR Band’ని మొదలుపెట్టాను’ అంటున్నది స్ఫూర్తి.
సినిమాల్లో హీరోకి అందమైన జోడీగా హీరోయిన్ ఉంటుంది. సినిమా పాటలు పాడే లోకల్ బ్యాండ్స్ కూడా అదే ట్రెండ్‌ని ఫాలో అవుతున్నాయి. లీడ్ సింగర్ అంటే అబ్బాయే. ఫిమేల్ సింగర్ అతనికి సపోర్టివ్. దానికి భిన్నంగా ‘మా బ్యాండ్‌లో నేనే లీడ్ సింగర్. అంటే నేనే కింగునన్నమాట’ అని గర్వంగా చెబుతుంది స్ఫూర్తి. పాత ట్రెండ్‌ని ఫాలో కాకుండా వెస్ట్రర్న్ మ్యూజిక్, టాలీవుడ్ సాంగ్స్‌తో ఫ్యూజన్ ఆలపిస్తూ అలరిస్తున్నది.
‘తెలుగు సినిమా కవర్ సాంగ్స్‌తోపాటు మధ్య మధ్యలో నేను రాసిన పాటలు పాడుతుంటాను. తెలుగు, తమిళం, ఇంగ్లిష్, స్పానిష్‌లో నేను రాసిన పాటలు పాడుకునేందుకు ఎక్కడా అవకాశం రాలేదు. ఈ బ్యాండ్‌తో నాకు నేనే అవకాశం కల్పించుకున్నాను. నేను పాడిన సినిమా పాట అయిపోయాక.. ‘సినిమాలోనూ దీన్ని గానం చేసింది నేనే’ అని చెప్పుకొంటాను. నేను రాసిన ఒరిజినల్స్‌ని వినిపించి గర్వపడతాను’ అంటుంది స్ఫూర్తి. తన బ్యాండ్‌తో హైదరాబాద్‌లోని పబ్స్‌లో తెలుగు సినిమాల్లోని పాత పాటల మాధుర్యాన్ని వినిపిస్తున్నదామె. ఆ పాత మధురాలకు వెస్ట్రర్న్ మ్యూజిక్ టచ్ ఇచ్చి వీనుల విందు చేస్తున్నది.
సాధారణంగా ఒక పాట నిడివి నాలుగు నుంచి ఐదు నిమిషాలు ఉంటుంది. దాదాపు అన్ని బ్యాండ్లూ పాటంతా వినిపించే ప్రయత్నం చేస్తుంటాయి. స్ఫూర్తి అండ్ కో మాత్రం పాటలోని పసందైన పంక్తులను మాత్రమే ఎత్తుకుంటారు. నిమిషం నిడివితో ఆలపిస్తారు. ఆ వెంటనే మరో పాట.. ఇలా నిమిష నిమిషానికీ పాట మారుస్తుంటారు. ‘పాట అంతా పాడాల్సిన అవసరం లేదు. ఆడియన్స్‌కి పరీక్ష కాకూడదు.
ప్రేక్షకులకు నచ్చిన నాలుగు లైన్లు పాడి మరోపాటలోకి వెళ్తాం. మెడ్లీ పేరుతో సినిమాల్లో వచ్చిన జానపదాలకు వెస్ట్రర్న్ టచ్ ఇస్తూ ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తుంటాం’ అని చెబుతున్నది స్ఫూర్తి. ఈ బ్యాండులో విశాల్ డ్రమ్స్ వాయిస్తాడు. జయకర్ కీబోర్డ్ ప్లేయర్. మనోహర్, ఉదయ్ గిటార్‌పై విన్యాసాలు చేస్తుంటారు. ఈ జట్టుతో కలిసి తన పాటల ప్రయాణాన్ని కొనసాగిస్తున్నది స్ఫూర్తి. కొత్త ప్రయోగాలతో ప్రేక్షకులకు మజా పంచడమే మా బ్యాండ్ లక్ష్యం అంటున్నది ఆమె!
– నాగవర్ధన్ రాయల